కశ్మీర్‌లో బీజేపీ కౌన్సిలర్ దారుణ హత్య

కశ్మీర్‌లో బీజేపీ కౌన్సిలర్ దారుణ హత్య

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో దారుణం జరిగింది. బీజేపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ రాకేశ్ పండితాను బుధవారం ఉగ్రవాదులు కాల్చిచంపారు. త్రాల్ ఏరియాలోని తన ఫ్రెండ్ ఇంట్లో ఉన్నప్పుడు రాకేశ్ పండితాపై కాల్పులు ఉగ్రవాదులు జరిపారు. వెంటనే రాకేశ్‌ను హాస్పిటల్‌కు తరలించగా... అప్పటికే రాకేశ్ చనిపోయినట్టు డాక్టర్లు తేల్చారు. ఉగ్రవాదుల కాల్పుల్లో రాకేశ్ ఫ్రెండ్ కూతురు అసిఫా ముస్తాఖ్ కూడా గాయపడ్డారు. ఆమెకు ట్రీట్మెంట్ జరుగుతోంది. ఆమె పరిస్థితి కూడా సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. 

రాకేశ్ పండితా మృతికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సంతాపం తెలిపారు. రాకేశ్‌పై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. రాకేశ్ పండితా బలిదానం వృథాగా పోదని జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా అన్నారు. రాకేశ్ హత్య మానవత్వాన్ని, కశ్మీరియతను చంపడమేనని ఆయన అన్నారు. కశ్మీర్ నుంచి ఉగ్రవాదులను నిర్మూలించడమే తన లక్ష్యమని ఆయన తేల్చి చెప్పారు. జమ్మూలో గురువారం రాకేశ్ అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియలలో మాజీ డిప్యూటీ సీఎం కవీందర్ గుప్తా, రవీందర్ రైనాలు పాల్గొని.. రాకేశ్ కుటుంబసభ్యులను ఓదార్చారు.