కమ్యూనిస్టులంటే బీజేపీకి భయం :సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

కమ్యూనిస్టులంటే బీజేపీకి భయం :సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
  • వేల కోట్లు సంపాదించిన వారు దేశభక్తులు.. అడవుల్లో ఉండే మావోయిస్టులు దేశద్రోహులా ?
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

కోహెడ (హుస్నాబాద్), వెలుగు : బీజేపీ నాయకులకు కమ్యూనిస్ట్‌‌లంటే భయం.. ఎరుపు చూస్తే వారు ఉలిక్కి పడుతారు.. ఒక్క కమ్యూనిస్ట్‌‌ను తుడిచి పెట్టేస్తే వంద మంది పుట్టుకొస్తారు’  అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌‌లో బుధవారం జరిగిన సీపీఐ మహాసభకు జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ దేశం కోసం జెండా ఎత్తని బీజేపీ లీడర్లు.. కమ్యూనిస్టులను దేశద్రోహులు అంటున్నారని, కేంద్రమంత్రి అమిత్‌‌షానే దేశద్రోహిలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. 

అక్రమంగా డబ్బు సంపాదించిన వారు, జైళ్లలో ఉండాల్సిన వారిలో 90 శాతం మంది అసెంబ్లీ, పార్లమెట్‌‌లో ఉంటున్నారన్నారు. కమ్యూనిస్ట్‌‌ పార్టీ చిన్నదే కావచ్చు.. కానీ ప్రధాన మంత్రుల కంటే ఉన్నతమైన నాయకులను అందించిందన్నారు. కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చి నేరపూరిత రాజకీయ నాయకులు లెక్కలు తీసి జైలులో పెట్టే రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా కార్యదర్శి మంద పవన్‌‌ పాల్గొన్నారు.