కమ్యూనిస్టుల ఖిల్లాపై కాషాయం ఫోకస్​..క్షేత్రస్థాయిలో బలోపేతమే లక్ష్యంగా..

కమ్యూనిస్టుల ఖిల్లాపై కాషాయం ఫోకస్​..క్షేత్రస్థాయిలో బలోపేతమే లక్ష్యంగా..

ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాపై బీజేపీ నజర్ పెట్టింది. ఏళ్లుగా కమ్యూనిస్టుల అడ్డాగా ఉన్న చోట, పాగా వేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఖమ్మం ఖిల్లా మీద కాషాయం జెండా ఎగురవేసేందుకు ఎత్తులు వేస్తోంది. ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభను ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం దీన్ని నిరూపిస్తోంది. ప్రధానిగా నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమాన్ని బీజేపీ దేశవ్యవాప్తంగా నిర్వహిస్తోంది. 

దీనిలో భాగంగా రాష్ట్రంలో రెండు పబ్లిక్ మీటింగ్ లకు ప్లాన్ చేయగా, అందులో మొదటిది ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్ లో ఈనెల15న సాయంత్రం జరగనుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు శంఖారావంగా దీన్ని పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఈ సభను విజయవంతం చేసేందుకు బీజేపీ లీడర్లు కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఇన్​చార్జీలను నియమించి, భారీ జన సమీకరణపై దృష్టిపెట్టారు. లక్షకు తగ్గకుండా జన సమీకరణ చేయడం ద్వారా సత్తా చాటాలని  భావిస్తున్నారు. 

సొంతంగా ఎదిగేందుకే ప్లాన్...

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి నుంచి కమ్యూనిస్టులు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పట్టు నిలుపుకుంటూ వస్తున్నాయి. గత రెండు సార్లు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్(ప్రస్తుతం బీఆర్ఎస్) కు కూడా ఈ జిల్లా ప్రజలు మొన్నటి వరకు అవకాశం ఇవ్వలేదు. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ కేవలం ఒక్క అసెంబ్లీ స్థానానికే పరిమితమైంది. ఇక బీజేపీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ తరపున ఉమ్మడి జిల్లాలో ఎవరూ ప్రాతినిధ్యం వహించలేదు. రాష్ట్రవ్యాప్తంగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 7.13 శాతం ఓటింగ్ పర్సెంటేజీతో14,43,799 ఓట్లు వచ్చాయి. ఇందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఎక్కడా నాలుగు అంకెలను దాటలేకపోయింది. 

యావరేజీగా అసెంబ్లీ స్థానానికి 2 వేల కంటే తక్కువ ఓట్లు రావడంతో, ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా కనీసం రెండో స్థానంలో నిలవలేకపోయింది. తొలిసారిగా మొన్నటి ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లోనే కమలం పార్టీ బోణీ కొట్టింది. ఒక కార్పొరేటర్ గెలిచారు. దీంతో ఈ పరిస్థితిని మార్చాలని గట్టిగా ప్లాన్ చేస్తోంది. ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించడం ద్వారా బలోపేతం కావాలని వేసిన ఎత్తులు వర్కవుట్ కాక సొంతంగానే ఎదిగేందుకు వ్యూహాలు రచిస్తోంది. మొన్నటి వరకు బీజేపీలో చేరతామంటూ చెప్పిన లీడర్లు కూడా ఇప్పుడు ముఖం చాటేశారు. దీంతో వారికి కూడా పార్టీ బలం తెలిసొచ్చేలా చేయాలని భావిస్తోంది. ఖమ్మం జిల్లా కాషాయం అడ్డాగా నిరూపించేందుకు ప్లాన్ చేస్తోంది. 

బల నిరూపణకు కసరత్తులు..

గత రెండేళ్లలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తరచుగా ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. గత నెలలోనే నిరుద్యోగ మార్చ్ లో భాగంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అమిత్ షా మీటింగ్ తేదీ ప్రకటించిన తర్వాత ఏర్పాట్లపై ఖమ్మం వచ్చి సమీక్షించారు. ‘ఖమ్మంలో బీజేపీ లేదని కొందరు అవమానిస్తున్నారు. కానీ అమిత్ షా బహిరంగ సభ ద్వారా తమ పార్టీ బలం ఏంటో చూపిస్తాం’ అంటూ సవాలు కూడా చేశారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరి చొప్పున బాధ్యులను నియమించారు. ఉమ్మడి జిల్లాలోని 47 మండలాలు, 3 మున్సిపాలిటీలతోపాటు ఖమ్మం కార్పొరేషన్ వారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. గ్రామాల్లో ప్రజలను కూడా ఈ మీటింగ్ కు ఆహ్వానిస్తున్నారు. 

నెక్ట్​సభ ప్రధాని మోడీతోనే...

జిల్లా ప్రజలకు భరోసా కల్పించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని, ఈ సభ సక్సెస్ అయితే త్వరలోనే భద్రాద్రికొత్తగూడెంలో జరిగే మీటింగ్ కు ప్రధాని నరేంద్ర మోడీ వస్తారని బండి సంజయ్ చెబుతున్నారు. అమిత్ షా పర్యటన ఏర్పాట్లపై బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సోమవారం మాజీ ఎంపీ గరికపాటి మోహన్​రావు, మాజీ మంత్రి విజయ రామారావు, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ పరిశీలించారు. మంగళవారం బీజేపీ కర్నాటక ఇన్​చార్జి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్​రెడ్డి కూడా మీడియా సమావేశం ద్వారా లీడర్లతోపాటు కార్యకర్తలను సన్నద్ధం చేశారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి వస్తున్నడంతో పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.