బూత్​ లెవల్​ నుంచి పార్టీ బలోపేతం చేయడంపై ఫోకస్​ పెట్టిన బీజేపీ

బూత్​ లెవల్​ నుంచి పార్టీ బలోపేతం చేయడంపై  ఫోకస్​ పెట్టిన బీజేపీ
  • 30 ఓట్లకు ఒక పన్నా ప్రముఖ్ నియమాకం
  • వరుసగా టౌన్​, మండల కార్యవర్గ మీటింగ్​లు
  • గడప గడపకూ కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ బూత్​ లెవల్​ నుంచి బలోపేతం చేయడంతోపై  ఫోకస్​ పెట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పార్టీ మండల, పట్టణ, జిల్లా కమిటీలు ఉండగా పార్టీ కార్యక్రమాలు అమలయ్యేలా చూసేందుకు అసెంబ్లీ కన్వీనర్​లను, పట్టణ, మండల ఇన్​చార్జిలను నియమించారు. మండలాలు, పట్టణాల్లో బూత్​ కమిటీలను నియమిస్తున్నారు. బూత్​ కమిటీలో సభ్యులుగా ఉన్నవారిని 30 ఓట్లకు ఒకరి చొప్పున పన్నాప్రముఖ్​ (పేజ్​ ఇన్​చార్జి)గా బాధ్యతలు అప్పగిస్తున్నారు. వీరు తరచుగా తమ పరిధిలోని కుటుంబాలను కలిసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఉజ్వల్​ గ్యాస్​, పీఎంకిసాన్​, బేటి బచావో, బేటి పడావో, జీవన్​ జ్యోతి, సురక్ష బీమా పథకాల గురించి వివరిస్తారు. అర్హులైన వారికి ఆయా పథకాల ఫలాలు అందేలా చూస్తారు. అలాగే ఈ ప్రక్రియ సక్రమంగా జరిగేలా పర్యవేక్షించేందుకు 3 నుంచి 5 బూత్​ లకు ఒక శక్తి కేంద్రం ఇన్​చార్జిని నియమించారు. మరోవైపు  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ పార్టీ పట్ల సానుకూలంగా ఉన్న వారిని, టీఆర్​ఎస్, కాంగ్రెస్​ పార్టీల్లో సరైన గర్తింపు లభించడం లేక అసంతృప్తితో ఉన్నవారు బీజేపీలోకి చేర్చుకునేందుకు బీజేపీ ఇన్​చార్జీలు దృష్టి సారిస్తున్నారు. 

 సిద్దిపేట జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 24 మండలాలుండగా అన్నిచోట్ల బూత్ స్థాయిలో పార్టీని పటిష్టపరచే దిశగా కసరత్తు ప్రారంభమైంది. దుబ్బాక లో ఎమ్మెల్యే రఘునందన్ రావు, జిల్లా ఇన్​చార్జి అంజన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో శక్తి కేంద్రాల ఇన్​చార్జిల సమావేశాన్ని ఇటీవలే నిర్వహించారు.  గజ్వేల్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి మండలాల వారీగా బాధ్యులను నియమించారు. సిద్దిపేట అసెంబ్లీ పరిధిలో బీజేపీ ప్రజా సంక్షేమ పథకాలను గడప గడపకు వివరించడానికి జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మార్నింగ్ వాక్ పేరిట పాద యాత్రకు ప్రణాళికను రూపొందిస్తున్నారు. 

గారెడ్డి జిల్లాలో భారతీయ జనతా పార్టీ సంస్థగత కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ స్పీడ్ పెంచారు. ప్రస్తుతం ప్రజాగోస.. బీజేపీ భరోసా యాత్ర కొనసాగుతోంది. 5 నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే సంగారెడ్డి, నారాయణఖేడ్, అందోల్ సెగ్మెంట్లలో భరోసా యాత్ర పూర్తి చేసుకున్నారు. సోమవారం జహీరాబాద్ లో భరోసా యాత్ర ప్రారంభించి నెలాఖరులో పటాన్ చెరులో కొనసాగించనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ బీజేపీ పట్ల ప్రజలలో భరోసా కల్పిస్తున్నారు. ఇక బూత్ స్థాయి కమిటీలను కూడా వేగవంతం చేశారు. జిల్లా వ్యాప్తంగా 1750 బూత్ కమిటీలు ఉండగా ఇప్పటికీ 1000 కమిటీలను పూర్తి చేశారు. రాష్ట్ర కమిటీ ఇచ్చే ఎలాంటి పిలుపునైనా సక్సెస్ చేస్తూ ప్రజల్లో తిరుగుతున్నారు. అలాగే నియోజకవర్గాల్లో ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్ సెకండ్ క్యాడర్ నాయకులను బీజేపీ పట్ల ఆకర్షితులను చేస్తూ పార్టీలో చేర్చుకునే పనిలో జిల్లా కమిటీ నిమగ్నమైంది. పార్లమెంట్, అసెంబ్లీ సెగ్మెంట్ల స్థాయిలో ముఖ్య నాయకులు దృష్టి సారించి ప్రజలతో మమేకమయ్యే పనుల్లో బిజీగా ఉన్నారు.

అంతటా ఆదరణ పెరుగుతోంది 

పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నాలుగు మున్సిపాలిటీలు, 21 మండలాల్లో పార్టీ కార్యవర్గ సమావేశాలు పూర్తి చేశాం. బీజేపీ లక్ష్యా చేరుకునేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలను పార్టీ శ్రేణులకు వివరించాం.  మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతోపాటు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్​ఎస్​ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడాన్ని ఎప్పటికపుడు ఎండగడుతున్నాం. రోజు రోజుకు బీజేపీకి ఆదరణ పెరుగుతోంది. 

- గడ్డం శ్రీనివాస్, 
బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు