విమోచన దినం కోసం బీజేపీ.. సమైక్యతా దినం కోసం టీఆర్ఎస్

విమోచన దినం కోసం బీజేపీ.. సమైక్యతా దినం కోసం టీఆర్ఎస్
  • పోటాపోటీ ఏర్పాట్లలో పార్టీలు
  • కేంద్రం బస్సులు అడిగితే రాష్ట్ర సర్కారే బుక్ చేసుకుందన్న ఆర్టీసీ
  • మెట్రో పిల్లర్ల యాడ్స్‌‌ కూడా బుక్ చేసుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగుసెప్టెంబర్ 17ను ఎవరికి వారే ఘనంగా నిర్వహించుకోవాలని ఇటు రాష్ట్రం.. అటు కేంద్రం పోటీ పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విమోచన దినాన్ని పరేడ్ గ్రౌండ్‌‌లో నిర్వహిస్తున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చీఫ్ గెస్టుగా హాజరు కానున్న ఈ కార్యక్రమం కోసం జనాన్ని తరలించేందుకు బస్సులను అద్దెకు ఇవ్వాలని కేంద్రం తరఫున ఆర్టీసీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బస్సులను బుక్ చేసుకుందని, బస్సులను ఇవ్వలేమని ఆర్టీసీ అధికారులు చెప్పారు. ఇదే విషయాన్ని అధికారికంగా లెటర్ ద్వారా రాసి ఇవ్వాలని కిషన్ రెడ్డి కోరగా.. ఆర్టీసీ అధికారులు దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారు.

సెప్టెంబర్ 17 వార్

కేంద్రం నిర్వహించనున్న ఉత్సవాలపై హైదరాబాద్ సిటీలో ప్రచారం కోసం మెట్రో పిల్లర్లు బుక్ చేసుకునేందుకు సంబంధిత యాడ్ ఏజెన్సీని కేంద్రం తరఫున కిషన్ రెడ్డి సంప్రదించారు. అయితే జాతీయ సమైక్యతా దినోత్సవం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బుక్ చేసుకుందని ఏజెన్సీ వాళ్లు సమాధానం ఇచ్చారు. రెండు నెలల కిందట బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌‌లో నిర్వహించినప్పుడు కూడా మెట్రో పిల్లర్లపై యాడ్స్‌‌ కోసం సంబంధిత ఏజెన్సీని బీజేపీ లీడర్లు సంప్రదించారు. రాష్ట్ర ప్రభుత్వమే అన్ని పిల్లర్లను బుక్ చేసుకుందనే సమాధానం ఏజెన్సీ నిర్వాహకులనుంచి వచ్చింది. బీజేపీ సమావేశాలు జరిగిన మూడు రోజులపాటు సిటీ అంతటా మెట్రో పిల్లర్లపై కేసీఆర్ బొమ్మలతో కూడిన రాష్ట్ర ప్రభుత్వ పథకాల హోర్డింగ్‌‌లే దర్శనమిచ్చాయి.

కేంద్రానికి పేరు రావద్దని..

సెప్టెంబర్ 17న జరిపే ఉత్సవాల్లో కేంద్రానికి పేరు రావద్దని, రాష్ట్ర సర్కారే హైలైట్ కావాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అందులో భాగంగానే ఆర్టీసీ బస్సులు, సిటీలో మెట్రో పిల్లర్లపై హోర్డింగ్‌‌లు బీజేపీకి దక్కకుండా ఉండేందుకు ముందస్తు వ్యూహంతోనే టీఆర్ఎస్ సర్కార్ ఇలా వ్యవహరించిందనే ప్రచారం జోరుగా సాగుతున్నది. కేంద్రం పరేడ్ గ్రౌండ్‌‌లో ఉత్సవాలు నిర్వహించనుండగా, రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.