ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే : ఎమ్మెల్యే రఘునందన్​రావు 

గజ్వేల్, వెలుగు: తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు అన్నారు. ఆదివారం గజ్వేల్​ పట్టణంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. వెస్ట్​ బెంగాల్​ సీఎం మమతా బెనర్జీని తన సొంత నియోజకవర్గంలో ఎలా ఓడించామో.. అదే విధంగా తెలంగాణలో గజ్వేల్​ నియోజకవర్గం నుంచే మార్పు ప్రారంభం కావాలన్న లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. మనోహరాబాద్​ కొత్తపల్లి రైల్వే లైన్​  నరేంద్రమోడీ కారణంగానే వచ్చిందన్నారు. ప్రస్తుతం గజ్వేల్​ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ భవనాలన్నీ కేంద్ర ప్రభుత్వ ఎన్​ఆర్​జీఎస్​ నిధులతోనే కడుతున్నారని తెలిపారు. కేంద్ర నిధులతో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్లటానికి పార్టీ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్​రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంబటి బాలేశ్, జిల్లా ఇన్​చార్జి అంజన్​కుమార్​గౌడ్, బీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి మల్లేశ్​యాదవ్​,పార్లమెంట్​ కన్వీనర్​ రామ్మోహన్​గౌడ్​, జిల్లా ప్రధాన కార్యదర్శులు సురేశ్, నరేశ్, సీనియర్​ నాయకులు రాంచందర్​రావు, రాంచందర్​రెడ్డి, గురువారెడ్డి, ఎల్లురామ్​రెడ్డి, విద్యాసాగర్,  నలగామ శ్రీనివాస్, పేర్ల శ్రీనివాస్​, మల్లేశం  పాల్గొన్నారు. 

ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎన్​సీసీ కృషి

సిద్దిపేట రూరల్, వెలుగు : విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎన్​సీసీ కృషి చేస్తోందని అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్ అన్నారు. ఆదివారం 74వ ఎన్​సీసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో ఎన్సీసీ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఉద్యోగ జీవితంలో ఉన్నత స్థాయికి చేరడానికి ఎన్​సీసీ ఎంతో ఉపయోగపడిందని తెలిపారు.  ఎన్​సీసీలో చేరే అవకాశాన్ని విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం వ్యాసరచన పోటీలలో గెలుపొందిన వారికి, జాతీయ స్థాయి క్యాంపులో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు.  కార్యక్రమంలో ఎన్సీసీ ఆఫీసర్ డాక్టర్ ఆర్.మహేందర్ రెడ్డి, కాలేజీ అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ గోపాల సుదర్శనం, డాక్టర్ మధుసూదన్, డాక్టర్ అయోధ్యరెడ్డి, మహేందర్, డాక్టర్ భవాని తదితరులు పాల్గొన్నారు.

భూములకు హద్దులు చూపాలి.. పట్టాలివ్వాలి 

దుబ్బాక వెలుగు : దుబ్బాక మండలం ఆకారం గ్రామానికి చెందిన 126 మంది రైతులకు 2005లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన 110ఎకరాల భూములకు వెంటనే హద్దులు చూపాలని, పట్టాలివ్వాలని డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్  డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఆ భూములను పరిశీలించారు. అనంతరం జరిగిన భూ హక్కుదారుల సమావేశంలో మాట్లాడారు. ఆకారాం భూసాధన కమిటీ ఆధ్వర్యంలో భూ హక్కుల పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. 2005లో ప్రధాని చేతుల మీదుగా పట్టాలను అందజేస్తే 2007లో నాటి వీఆర్ఓ  ఆర్డీఓ సంతకాలు చేయిస్తానని పాస్ బుక్స్​  తీసుకెళ్లి తిరిగి ఇవ్వలేదని తెలిపారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. ఇదిలా ఉండగా  భూమిపై హక్కులను సాధించేందుకు దశలవారీగా ఉద్యమం చేయాడానికి డీబీఎఫ్ ఆధ్వర్యంలో 18 మందితో ఆకారం భూసాధన కమిటీని ఏర్పాటు చేశారు. కార్యక్రమం లో డీబీఎఫ్ రాష్ట కార్యదర్శి దాసరి ఎగొండస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుబాషి సంజీవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి భ్యాగరి వేణు, జిల్లా ఉపాధ్యక్షుడు భీమ్ శేఖర్, మంజీరా దళిత సేవా సమితి జిల్లా అధ్యక్షుడు పి.కిరణ్, ఆకారం భూసాధన కమిటీ నాయకులు మిద్దె వేణు, మెట్ల బాబు,  మంజుల, ఎల్లవ్వ, పుష్ప, లక్ష్మి, స్వామి  తదితరులు  పాల్గొన్నారు.

35 ఏండ్లకు కలుసుకున్న దోస్తులు

మెదక్ (నిజాంపేట), వెలుగు : నిజాంపేట జడ్పీ హైస్కూల్ లో 1986 ౼ 87 టెన్త్ బ్యాచ్​ విద్యార్థులు 35 ఏండ్ల తర్వాత కలుసుకున్నారు.  ఆదివారం స్కూల్​లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. గురువులను ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పూర్వ  విద్యార్థులు మాట్లాడుతూ ఇన్నాళ్లకు అందరం కలుసుకొని గురువులను సన్మానించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న స్నేహితులకు సాయం చేస్తామని చెప్పారు. మృతి చెందిన గురువులు, స్నేహితులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు  తిరుమలరావు, జనార్దన్ రెడ్డి, బాలయ్య,  సత్యానందం , పూర్వ విద్యార్థులు లక్ష్మణ శాస్త్రి , మోయినోద్దిన్, నాగరాజు, పద్మ, కరుణ, రాధ పాల్గొన్నారు.

దివ్యాంగుల బంధు పథకం పెట్టాలి

సిద్దిపేట రూరల్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు మాదిరిగానే దివ్యాంగుల బంధు పథకం పెట్టాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్​ డిమాండ్​ చేశారు. ఆదివారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో సంఘం జిల్లా కొత్త కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన కెమ్మసారం అశోక్, జిల్లా అధ్యక్షుడు చందనగిరి రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పర్తి నర్సింహ చారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి దివ్యాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించకుండా అన్యాయం చేశారని, వచ్చే బడ్జెట్లో అయినా రూ.300 కోట్లతో ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని కోరారు. దివ్యాంగులకు ప్రైవేట్  ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించాలన్నారు. వికలాంగుల సంక్షేమ శాఖను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని,  గతంలో ప్రత్యేక శాఖగా ఉన్న దీన్ని మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసిందని గుర్తు చేశారు. వెంటనే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సీనియర్ నాయకులు కొల్లూరి ఈదయ్య బాబు, జిల్లా గౌరవ అధ్యక్షుడు దేశెట్టి శాంసన్, నాయకులు బొడ్డు రాజేశ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు దరిపల్లి పూర్ణ పాల్గొన్నారు..

బాలింతను బస్టాండ్ లో దింపాం కానీ..

సంగారెడ్డి, వెలుగు :  ‘అమ్మఒడి పథకంలో భాగంగా 102 వెహికల్ లో తీసుకెళ్లి బాలింతను వారి సహాయకుల నిర్ణయం మేరకే సంగారెడ్డి బస్టాండ్ లో దింపాం. బస్టాండ్ పక్కనే వారి ఇల్లు ఉండటం, ఆ ప్రాంతం రద్దీగా ఉండటంతో పాటు  వారు ఫ్రూట్స్ తీసుకుని వెళ్తామని చెప్పడంతో వెహికల్ పైలెట్ (డ్రైవర్) అక్కడ దింపి వచ్చేశారు’ అని సంగారెడ్డి డీఎంహెచ్ఓ గాయత్రిదేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో బాలింతలు, గర్భిణుల కోసం 102 వెహికల్ సేవలు సరిగ్గా అమలు కావడం లేదని ‘బస్టాండు దాకే అమ్మఒడి’  అనే శీర్షికన ఆదివారం వెలుగు దిన పత్రికలో ప్రచురితమైన కథనానికి డీఎంహెచ్ఓ స్పందించారు. జిల్లాలో అమ్మఒడి సేవలను ఎలాంటి ఆటంకాలు లేకుండా అమలు చేస్తున్నామని తెలిపారు. ఎక్కడైనా102 వెహికల్ పైలెట్ బాలింతలు, గర్భిణులను మధ్యలోనే దింపి ఇబ్బందులు కలుగజేస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

90 శాతం ధాన్యం  కొనుగోళ్లు పూర్తి
మెదక్​ అడిషనల్​ కలెక్టర్ ​రమేశ్​

మెదక్​ టౌన్​, వెలుగు :  మెదక్​ జిల్లాలో ఇప్పటి వరకు 90 శాతం ధాన్యం కొనుగోలు చేశామని అడిషనల్​ కలెక్టర్​రమేశ్​ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రాలు ఏర్పాటు  చేసిన నెలరోజుల్లో  రైతుల నుంచి  వేగంగా వడ్లను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.  రైతులు నాణ్యత ప్రమాణాలకనుగుణంగా ధాన్యం కేంద్రాలకు  తేవడం, కేంద్రం నిర్వాహకులు, అధికారులు సమన్వయం పనిచేయడంతో ఇది సాధ్యమైందని తెలిపారు. మరో పది రోజుల్లో పూర్తిగా ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. స్థల సమస్య ఉన్న  శివ్వంపేట, నర్సాపూర్​, తూప్రాన్, చేగుంట, వెల్దుర్తి మండలాల ధాన్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించి మిగతా ధాన్యాన్ని గతంలో మాదిరే గోడౌనులు, ఇతర ప్రైవేట్ ప్రాంతాలలో నిలువ చేశామని పేర్కొన్నారు.