పోలింగ్ సరళిపై బీజేపీహైకమాండ్ ఆరా.. కిషన్ రెడ్డికి అమిత్ షా, నడ్డా ఫోన్

పోలింగ్ సరళిపై బీజేపీహైకమాండ్ ఆరా.. కిషన్ రెడ్డికి అమిత్ షా,  నడ్డా ఫోన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళిపై బీజేపీ హైకమాండ్ ఆరా తీసింది. తెలంగాణ ప్రజల ఓటింగ్ నాడి ఎలా ఉందనే దానిపై బీజేపీ రాష్ట్ర నేతలను ఢిల్లీ పెద్దలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డా గురువారం మధ్యాహ్నం బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్ రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు.  రాష్ట్రంలో బీజేపీ గెలిచే సీట్లు ఎన్ని? హోరాహోరీగా తలపడ్డ స్థానాలు ఎన్ని? బీఆర్ఎస్, కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి? అని అడిగి తెలుసుకున్నారు.

బీజేపీ ఓటింగ్ శాతం ఈసారి భారీగా పెరిగే చాన్స్​ ఉందని కిషన్ రెడ్డి వారికి చెప్పినట్లు సమాచారం. పోలింగ్ సరళి, పార్టీ గెలిచే  సీట్లపై రిపోర్టును  పంపాలని ఢిల్లీలోని సెంట్రల్ బీజేపీ ఆఫీసు ఆదేశించింది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా పోలింగ్ ముగిసే వరకు ఓటర్ల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఏ వర్గం బీజేపీని ఆదరించారనే దానిపై తెలుసుకునే ప్రయత్నం చేసింది. బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలు ఏ మేర ప్రభావం చూపాయనే దానిపై జాతీయ నాయకత్వం ఆరా తీసినట్లు తెలిసింది. రాష్ట్రంలో 10 నుంచి 15  సీట్లు గెలుచుకుంటామనే ధీమాలో కమలం నేతలు ఉన్నారు.