ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో బలపడుతున్న బీజేపీ

ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో బలపడుతున్న బీజేపీ

సామ్రాజ్యాల మాదిరిగానే పొలిటికల్ పార్టీలు కూడా విస్తరిస్తాయి.. కనుమరుగైపోతాయి. రాజ కుటుంబాలు తొలుత వృద్ధి చెందుతాయి. ఆ తర్వాత కూలిపోతాయి. మొఘల్ చక్రవర్తులు 200 ఏండ్ల పాటు ఇండియాను పాలించారు. చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ జాఫర్ షా 1862లో బర్మాలో చనిపోయారు. ఇప్పుడు మనం మొఘల్ చక్రవర్తుల వారసులు ఒక్కరిని కూడా మనం గుర్తించలేం. కాలం చాలా క్రూరమైనది. అన్ని జ్ఞాపకాలనూ చెరిపేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పొలిటికల్ పార్టీలు పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోయాయి. 1922లో రష్యాను పాలించిన కమ్యూనిస్టు పార్టీ శకం 1991లో ముగిసిపోతుందని ఏ ఒక్కరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. 
భారతీయ జనతా పార్టీకి చరిత్ర గురించి చాలా బాగా తెలుసు. మరికొంత కాలం మనుగడ సాగించాలని ఆ పార్టీ కోరుకుంటోంది. అందుకే బీజేపీ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. మనుగడ సాగించాలంటే విస్తరించడం, కొత్తగా ఆలోచించడం తప్పదని ఆ పార్టీకి తెలుసు. ఒకప్పుడు కెమెరాలను తయారు చేసిన కంపెనీలు.. మొబైల్ ఫోన్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకపోవడం వల్లే అవి చరిత్రలో కలిసిపోయాయి. నిరంతరం మారుతూనే ఉండాలని, లేకుంటే కనుమరుగైపోతామని బీజేపీకి తెలుసు. ఐదు రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి ఎలక్షన్ క్యాంపెయిన్లో గొప్ప స్టైల్ ఉందని నిరూపించాయి. బీజేపీ ఎన్నికల ప్రచారాలు సక్సెస్ అయినా కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఒక మాట చెబుతుంటారు. బీజేపీ ఇప్పుడు ఎన్నికల్లో విజయం సాధించడమే కాదు.. ఇండియాలో ప్రజలందరికీ కనెక్ట్ కావాలని ఆయన అంటూ ఉంటారు. 
కొత్త నాయకత్వానికి దారులు
కొత్త యువ నాయకత్వం సిద్ధంగా ఉండాలని బీజేపీ కోరుకుంటోంది. మొదట్లో బీజేపీ పూర్తిగా అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీపైనే ఆధారపడింది. 2004, 2009 లోక్సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజలు వారిని తిరస్కరించారు. అప్పట్లో వారికి కొత్త నాయకత్వం లేదు. సహజంగానే ప్రస్తుత బీజేపీ కొత్త కేడర్ను సృష్టించాలని కోరుకుంటోంది. అందువల్లే తేజస్వీ సూర్య, స్మృతీ ఇరానీ వంటి యువ నాయకులను ప్రొజెక్ట్ చేస్తోంది.
వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం
వెనుకబడిన, అట్టడుగు వర్గాలకు చెందిన నాయకులకు బీజేపీ ప్రాధాన్యం ఇస్తోంది. గతంలో బీజేపీ అంటే ఉన్నత కులాలకు చెందిన నాయకులే గుర్తొచ్చేవారు. కానీ ఇప్పుడు, బీజేపీ బడుగు, బలహీన వర్గాలకు చేరువ అవుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ వేస్తున్న అడుగులే ఇందుకు ఉదాహరణ. ఇక పశ్చిమ బెంగాల్లో షెడ్యూల్ కులమైన మతువా సామాజిక వర్గానికి, గిరిజనులకు, ఓబీసీలకు దగ్గరైంది. బెంగాల్లో పేదలు, బలహీన వర్గాల పార్టీగా బీజేపీ నిలిస్తే.. కాంగ్రెస్, లెఫ్ట్, మమతా బెనర్జీ పార్టీలు ఉన్నత కులాలకు ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నాయి.
పాలసీల విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు
ఎకనామిక్, సోషల్ పాలసీలకు సంబంధించి బీజేపీ సరళంగా వ్యవహరిస్తోంది. ‘‘సబ్కా సాత్, సబ్ కా వికాస్, అందరి కోసం అభివృద్ధి”వంటి నినాదాలతో పాటు ఎన్ఆర్ఈజీఏ, రైతులకు నేరుగా నగదు జమ చేసే పీఎం కిసాన్ మొదలైన పాపులర్ పథకాలతో ప్రజల మనసులు గెలిచేందుకు ప్రయత్నిస్తోంది. రాజకీయ పరిస్థితులకు తగినట్టుగా పార్టీ తనను తాను మార్చుకుంటోంది. 
ఇతర పార్టీల నాయకులకూ ఆహ్వానం
పవర్లో ఎక్కువ కాలం పాటు ఉన్న నాయకులను బీజేపీ పక్కన పెడుతోంది. దీని ద్వారా కొత్త తరానికి తలుపులు తెరుస్తోంది. అవకాశాలు కల్పిస్తోంది. అలాగే ఇతర పార్టీల నుంచి పాపులర్ లీడర్లను తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. మహారాష్ట్ర, హర్యానా, కర్నాటక, అస్సాంలో బీజేపీ విజయం సాధించడానికి కారణం ఈ పాలసీనే. ఈ విధానం వల్లే ఇప్పుడు బెంగాల్, తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడుతోంది.
ఓవర్ సెంట్రలైజేషన్ తో ప్రమాదమే
కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల్లో మాదిరిగానే బీజేపీలో కూడా హై కమాండ్ కల్చర్ డెవలప్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఓవర్ సెంట్రలైజేషన్ వల్ల ప్రాంతీయ నాయకులు ఎదగడానికి ఎక్కువ అవకాశం ఉండదు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ఆ రాష్ట్రంలో పాపులర్ లీడర్. ఆయన మధ్యప్రదేశ్ రాజకీయాలను డామినేట్ చేయగలరు. అందువల్ల బీజేపీ హైకమాండ్ కల్చర్ వల్ల లోకల్ లీడర్షిప్ నాశనం కాకుండా జాగ్రత్త పడాలి. బీజేపీ తమ నాయకుల నియంత్రణ, స్వేచ్ఛకు సంబంధించి సరైన విధానం కనుగొనాలి. 
ఇతర పార్టీలు భవిష్యత్‌ను  ఆలోచించట్లే
కొత్త, యువ నాయకులను వెలుగులోకి తీసుకొచ్చే గొప్ప ప్రయత్నాన్ని బీజేపీ చేపట్టింది. మిగతా పొలిటికల్ పార్టీలు భవిష్యత్ కోసం సరైన ప్రణాళికను సిద్ధం చేసుకోవడం లేదు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు.. నెహ్రూ తర్వాత ఎవరు? అనే ప్రశ్న వచ్చేంది. కానీ దానికి స్పష్టమైన సమాధానం ఉండేది కాదు. త్వరలో కొత్త నాయకత్వం ఉండాలనే విషయంలో బీజేపీ జాగ్రత్తగా అడుగులు వేయాలి. లేకపోతే ఇన్నాళ్లు కష్టపడి జాగ్రత్తగా నిర్మించుకున్న బీజేపీ కోట.. గోల్కొండ ఫోర్ట్ మాదిరిగా మిగిలిపోతుంది. గోల్కొండ కోటకు గొప్ప చరిత్ర ఉంది. కానీ ఇప్పుడు అది ఒక శిథిల జ్ఞాపకంగా మిగిలింది.
వారసత్వ అభ్యర్థులకు దూరం
బీజేపీ వారసత్వ అభ్యర్థులపై తక్కువగానే ఆధారపడుతోంది. బీజేపీలో కూడా ప్రమోద్ మహాజన్, మాజీ సీఎం వసుంధరా రాజే, కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మొదలైన వారసత్వ కుటుంబాలు ఉన్నాయి. అయితే ప్రస్తుత బీజేపీ లీడర్షిప్ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడం లేదు. అలాగే వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడానికి కూడా నిరాకరిస్తోంది.

ఎన్నికల ప్రచారంలో డిఫరెంట్ స్ట్రాటజీ
బీజేపీకి ఛరిష్మా, అత్యంత ప్రజాదరణ కలిగిన నరేంద్రమోడీ లీడర్గా ఉన్నారు. అయినా కూడా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ మిగతా నాయకులైన అమిత్షా, పార్టీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్సింగ్, స్మృతీ ఇరానీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో పాటు ఇంకా చాలా మందిని వాడుకుంది. అయితే మిగతా పొలిటికల్ పార్టీలు ఎక్కువ మంది లీడర్లను ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వాడుకోలేదు. కాంగ్రెస్ పార్టీ రాహుల్గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలను తప్ప మిగతా సీనియర్లను కనీసం ప్రచారానికి ఆహ్వానించలేదు.-పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ అనలిస్ట్