ఇంగ్లిష్ భాషను భారతదేశంలో నేర్చుకోవడం, దాన్ని ఇక్కడ దేశభాషగా మార్చడంపై ప్రధానమంత్రి నుంచి మొదలుకొని కొంతమంది ముఖ్యమంత్రుల వరకు వ్యతిరేకిస్తున్నారు. అది మెకాలే భాష అని కొందరు, అది వలసవాద భాష అని మరికొందరు, అభివృద్ధి దేశభాష ద్వారానే జరుగుతుందని కొందరు, మాతృభాషతోటే అభివృద్ధి జరుగుతుందని కొందరు వాదిస్తున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ తమ సంస్కృత, హిందీవాద, జాతీయవాదంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ను టీచ్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీలలో కూడా ఇంగ్లిష్‌కు బదులు హిందీని పెంచి పోషిస్తున్నారు. సంస్కృత భాషపై బాగా ఖర్చు పెడుతున్నారు. బీజేపీయేతర నాయకులు కూడా ఈ విషయంలో తప్పటడుగులు వేస్తున్నారు.
నరేంద్ర మోదీ, అమిత్‌షా, మోహన్ భాగవత్‌లకు ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం అంతగా రాకపోవడం వల్ల కూడా ఈ భాష పట్ల వ్యతిరేకతను చూపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వెంకయ్య నాయుడు, ఎంవీ రమణ అటు ఆంధ్రప్రదేశ్‌లో, ఇటు తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ద్వారా గ్రామీణ విద్యార్థులకు ఇంగ్లిష్ నేర్పడంపై చాలా ఆందోళనలో ఉన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రభుత్వ ఆర్డర్స్ అన్నీ తెలుగులోనే తేవాలని బహిరంగంగానే సలహాలు ఇస్తున్నారు.
ఈ మధ్య ఈనాడు అధిపతి రామోజీరావు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఈ గొప్ప సలహా ఇచ్చారు. ఈనాడు గ్రూపు, ముఖ్యంగా రామోజీరావు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం చదువు గ్రామీణ పిల్లలకు చెప్పడాన్ని చాలాకాలం వ్యతిరేకించారు. ఆ పత్రికలో ఇంగ్లిష్ పదాలు వాడకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, తమ కుటుంబ పిల్లలను మాత్రం భోదన ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చదివిస్తారు. ఆయన చిన్న కొడుకు సుమన్ దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే చనిపోయాడు.
నిజాం కాలేజీలో నా విద్యార్థి. మంచి ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదువుకుని నిజాం కాలేజీలో ఇంగ్లిష్ మీడియంలోనే బీఏ చదివాడు. రామోజీరావు భార్య పేరుతో ఒక ఇంగ్లిష్ మీడియం స్కూలు కూడా నడుస్తోంది. అంతకంటే విచిత్రమేమంటే ‘రైలు టికెట్’ అని రాయడానికి బదులు ‘ధూమశకట ఆరోహణ, అధిరోహన పత్రం’ అని రాసే ఈనాడు అధిపతి తన ‘చిత్ర నిర్మాణ నగరం’ను మాత్రం ‘రామోజీ ఫిల్మ్‌సిటీ’ అని పెద్దగా ఇంగ్లిష్‌లో రాసుకున్నారు. ఆ పేరుతోనే అడ్వర్టైజ్ చేస్తారు. ఆ కుటుంబం నడిపే హోటళ్ల పేరు ‘డాల్ఫిన్’ అని పెట్టుకున్నారు. డాల్ఫిన్‌ను తెలుగులో ఏమంటారో చెప్పి ఆ పేరు పెట్టుకోవచ్చు కదా! వెంకయ్య నాయుడు, ఎంవీ రమణ ఆ హోటళ్లలోనే ఉంటారు కదా, వాటికి తెలుగు పేర్లు ఎందుకు పెట్టించలేదు? ప్రజలు ప్రపంచ భాష నేర్చుకొని మేధావులైతే తమ పిల్లలను కూడా శాసిస్తారనే భయంకాక ఈ మొత్తం ప్రయత్నంలో ఏం కనిపిస్తుంది?
కామరాజ్ నాడార్ జీవితాన్ని అధ్యయనం చేయాలి
ఈ ఇంగ్లిష్ వ్యతిరేక నాయకులు అంబానీ, అదానీ, బిర్లావంటి పెట్టుబడిదారులు నడిపే అతి ఖరీదైన ఇంగ్లిష్ మీడియం స్కూళ్లను, యూనివర్సిటీలను గుజరాతీ భాషలోకి మార్పిస్తే మనం వద్దంటామా! లేనివారి మనుమలు, మనుమరాండ్లు చదువుకోవాలని కోరుకుంటారు. ఇది కదా సమస్య. నాయకులకు, పాలకులకు ఇంగ్లిష్ వచ్చా రాదా అనేది సమస్య కాదు. అది ముఖ్యంగా శ్రమజీవుల భవిష్యత్ తరాల సమస్య. ఈ సందర్భంలో దేశ రాజకీయాల మీద పట్టు ఉండి తమిళనాడు విద్యావ్యవస్థను సమూలంగా మార్చిన కామరాజ్ నాడార్ జీవితాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఆయన మూడో తరగతి వరకు చెట్టు కింద చదివి ఆపేశారు. ఆయన నాడార్ అనే అంటరాని కులంలో పుట్టిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ, సర్దార్ పటేల్ తరువాత దేశ రాజకీయ చక్రం తిప్పిన కింగ్ మేకర్. 1964–1967 వరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు. లాల్ బహదూర్శాస్త్రిని, ఇందిరా గాంధీని తనకున్న అవకాశాన్ని వదులుకుని ప్రధానమంత్రులను చేసిన కింగ్ మేకర్.
అంబేద్కర్ ఇంగ్లిష్ అంటే ఏంటి ?
ఈ దేశంలో హరప్పా నగర నిర్మాణం నుంచి 1891లో అంబేద్కర్ పుట్టేవరకు చదువు హింసాయుతంగా నిరాకరించబడిన దళిత, శూద్రులకు ఈనాడు ఎటువంటి ఇంగ్లిష్ కావాలి.. అంబేద్కర్ ఒక్క జీవిత కాలంలో నేర్చుకుని ఈ దేశ చరిత్రను మార్చినటువంటి ఇంగ్లిష్ కావాలి. వేల సంవత్సరాలు గొర్ల కాపరికంలో, అప్పుల్లో అక్షర జ్ఞానం లేకుండా బతికిన కుటుంబంలో, కులంలో పుట్టాను. నేను నేర్చుకున్న ఇంగ్లిష్ కూడా అంబేద్కర్ ఇంగ్లిష్. మెకాలే ఇంగ్లిష్ కాదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు ఇంగ్లిష్ను ఒక బ్రిటిష్ భాషగా చూస్తున్నారు.
కానీ, దానికున్న విముక్తి శక్తిని గమనించడం లేదు. లేదా ఈ దేశంలో వేల సంవత్సరాలు బానిసలుగా బతికినవారికి విముక్తి ఎందుకు అనే భావన నుంచి కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉండి ఉండవచ్చు. 19వ శతాబ్దంలోనే సావిత్రి బాయి ఫూలే, మహాత్మా ఫూలేలు ఇంగ్లిష్ భాషకున్న బానిసత్వ వ్యతిరేక లక్షణాన్ని అర్థం చేసుకున్నారు. దాన్ని నేర్చుకుని ఆ భాషను ఉపయోగించే బ్రిటిష్ వలస పాలనను అంబేద్కర్, గాంధీ, నెహ్రూ, పటేల్ వంటి వారు బ్రిటిష్ ఆధిపత్యాన్ని అంతం చేశారు.
విముక్తి ఆయుధం ఇంగ్లిష్
అంబేద్కర్ మరో అడుగు ముందుకేసి నిరంతరం ఇంగ్లిష్‌లో రాసి కుల వ్యవస్థను కూడా దెబ్బ తీశాడు. ఆయన తన మొదటి వ్యాసం ‘క్యాస్ట్ ఇన్ ఇండియా’ నుంచి మొదలుకొని ఆఖరి పుస్తకం ‘ది బుద్ధ అండ్ హిజ్ దమ్మ’ వరకు ఇంగ్లిష్‌లోనే రాశాడు. ఆయనకు తెలుసు ఆనాడు తన ప్రజలకు ఇంగ్లిష్ భాష కాదు కదా ప్రాంతీయ భాషల్లో కూడా చదవడం, రాయడం రాదని. కానీ, భవిష్యత్‌లో అన్ని రాష్ట్రాల్లో ఇంగ్లిష్ నేర్చుకున్న మేధావులే దేశమంతటా అనుసంధానకర్తలు అవుతారని గాంధీ తాను రాసిన ‘హిందీ స్వరాజ్’, మై ఎక్స్పర్మెంట్ విత్ ట్రూత్’ గుజరాతీలోనే రాశాడు. తరువాత మాత్రమే ఇంగ్లిష్‌లోకి అనువాదం చేయడమైనది. ఎందుకు? ఆయన ఇంగ్లిష్ను ఒక విముక్తి భాషగా చూడలేదు. కానీ, అంబేద్కర్‌కు అది ఒక విముక్తి ఆయుధం.
భవిష్యత్ తరాలకూ అంతే..
ఈ దేశంలో దోపిడీకి, అణచివేతకు గురైన దళితులు, ఆదివాసీలు, శూద్రులకు ఇంగ్లిష్ఒక విముక్తి ఆయుధం. అది నేర్చుకున్నవారిని విద్యార్థి జీవితం కాలంలోనే ఐక్య పరుస్తుంది. ప్రాంతీయ భాషలు వారిని విడివిడి గదులలో ఒకరితో ఒకరు మాట్లాడుకోలేనివారిగా బాధిస్తాయి. కానీ, ఇంగ్లిష్.. అణచివేతకు గురైన శక్తులకు, ప్రపంచ దేశాల విభిన్న శక్తులకు తమ బాధను, తమ శక్తిని చెప్పుకునే ఆయుధం అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. అంబేద్కర్‌కు ఇంగ్లిష్వచ్చి ఉండకపోతే ఆయన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లలో, కానిస్టిట్యూయెంట్ అసెంబ్లీలో ప్రపంచాన్నే మెప్పించే వాదనలు చేయగలిగేవాడా! ఆ భాషను తన జీవితాంతం సొంతపేరు కోసం నవలలో, కథలో రాసేందుకు ఉపయోగించేవాడు. కానీ, ఆయన ఆ భాషను వేల సంవత్సరాలు బానిసలుగా బతికినవారిని విముక్తి చేయడానికి వాడుకున్నాడు.
ఇది 40 ఏండ్ల పోరాటం !
నేను గత 40 ఏండ్లు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు ఉండాలని పోరాడాను, రాశాను, మాట్లాడాను. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం టీచింగ్ జరుగుతుంది. టీచర్ల కొరతను తీర్చేందుకు బైలింగువల్పాఠ్య పుస్తకాలు వచ్చాయి. ఈ విధానాన్ని వ్యతిరేకించే శక్తులు రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి. అందుకే విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ఇంగ్లిష్ మెకాలే భాష అనే శక్తుల గాలిలో కొట్టుకుపోవద్దు. మన దేశంలో అది అంబేద్కర్ భాష. మెకాలే భాష కాదు.
బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కవచం
రెండు దఫాలు తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్. తమిళనాడులో ద్విభాష (ఇంగ్లిష్, తమిళం) స్కూల్ ఎడ్యుకేషన్ స్థిరీకరించిన మట్టి మేధావి. ఆయనకు ఇంగ్లిష్ రాకపోయినా దేశానికి, తమిళనాడుకి ఇంగ్లిష్ అవసరాన్ని నెహ్రూ కంటే ఎక్కువగా అర్థం చేసుకున్న స్టేట్స్‌మన్. లా చదువుకుని దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన చక్రవర్తి రాజగోపాలాచారిని ఎదురించి నిలిచిన నాయకుడు. పెరియార్, ఇటు కామరాజ్ తమిళనాడును ఆంగ్లంలో బెంగాల్‌ను మించిపోయే రాష్ట్రంగా తీర్చిదిద్దారు. అన్నాదురై, కరుణానిధిలోని తమిళ ఆధిపత్యాన్ని దింపి ఇంగ్లిష్‌కు సమానస్థాయిని కలిపించిన వ్యక్తి. అందుకే నేడు తమిళనాడు దేశానికి, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కవచ రాష్ట్రమైంది. ఆయన విద్యా విధానం వల్లనే అన్ని కులాల తమిళులు ఈ రోజు ప్రపంచమంతటా ఉన్నారు. కమలాహారిస్, సుందర్ పిచాయ్ వంటి వారంతా ఆయనకు రుణపడి ఉండాలి.
ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్
