విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వాడకం రోజురోజుకూ పెరుగుతున్నది. ఇది ఒక ఆందోళనకరమైన విషయం. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని, భవిష్యత్తును ప్రమాదంలో పెట్టే ఈ అలవాటు విద్యార్థుల్లో ఎందుకు కలుగుతున్నది? దానికి సమాజం ఎలా స్పందించాలన్నవాటికి సమగ్రంగా చూస్తే.. చదువులో ఒత్తిడి, స్నేహితుల ప్రభావం, కొత్త అనుభవాలపై ఆసక్తి వంటి కారణాలు వారిని ఈ దారిలోకి నెడుతున్నాయి. ఈ పరిస్థితి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఒత్తిడి ఈ కాలంలో తీవ్రమైన ఒక సామాజిక సమస్యగా మారింది. కౌమార దశలో కొత్త అనుభవాలను ప్రయత్నించాలని ఉండే జిజ్ఞాస, స్నేహితుల ఒత్తిడి, కుటుంబంలో అనుకూల వాతావరణం లోపించడం, సినిమాలు, -సోషల్ మీడియాలో మాదక ద్రవ్యాలను ఆకర్షణీయంగా చూపించడం వంటి కారణాలు విద్యార్థులను ఈ ప్రమాదకర అలవాట్ల వైపు మళ్లిస్తున్నాయి. చిన్న తప్పు.. వారి ఆరోగ్యం, చదువు, భవిష్యత్తు అన్నింటినీ ప్రమాద స్థితికి చేరవేయగలదు.
ప్రతికూల పరిణామాలు
మాదకద్రవ్యాల వాడకం వల్ల శారీరకంగా గుండె, ఊపిరితిత్తులు, కాలేయం వంటి అవయవాలు దెబ్బతినడమే కాకుండా, మానసికంగా డిప్రెషన్, ఆందోళన, ఆత్మవిశ్వాస లోపం వంటి సమస్యలు వస్తాయి. చదువులో వెనుకుబాటు, క్రమశిక్షణ లోపం, కుటుంబంతో గొడవలు వంటి ప్రతికూల పరిణామాలు వారి జీవన ప్రమాణాన్ని దెబ్బతీస్తాయి. ఒకసారి అలవాటుపడితే దానినుంచి బయటపడటం కష్టతరమై, దీర్ఘకాలిక వ్యసనమై తీవ్ర ఆరోగ్య సమస్యలు, కొన్ని సందర్భాలలో మరణ ప్రమాదం కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటి తరానికి అవకాశాలు అమితంగా పెరిగాయి.
అయితే, ఇదే సమయంలో వారిని తప్పుదారిలోకి నడిపించే ప్రమాదకర శక్తి కూడా పెరుగుతోంది. అదే మాదకద్రవ్యాల ఆకర్షణ. విద్యార్థుల జీవితంలో అత్యంత విలువైన సమయం చదువుకునే వయస్సు. ఈ సమయంలో డ్రగ్స్ వైపు వేసే చిన్న అడుగు కూడా వారి భవిష్యత్తుకు పెద్ద నష్టం. అందుకే, ప్రతి యువకుడు, ప్రతి విద్యార్థి, ప్రతి తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన గొప్ప సందేశం ‘డ్రగ్స్ కాదు – డ్రీమ్స్ సాధించు!’
డ్రగ్స్ ఎందుకు ప్రమాదకరం ?
మాదకద్రవ్యాలు మొదట్లో తాత్కాలిక ఆనందం భ్రమను కలిగిస్తాయి. కానీ, ఆ ఆనందం కేవలం కొన్ని నిమిషాల వ్యవధి వరకు కలిగే మాయ. ఆ మాయలో మనసు చిక్కుకుంటే ఆపడం చాలా కష్టం. శరీరంలోని ప్రధాన అవయవాలు దెబ్బతింటాయి. మానసికంగా ఆందోళన, డిప్రెషన్, కోపం, స్థిమితం కోల్పోవడం మొదలవుతాయి. కొన్నిసార్లు చదవడం మీద ఆసక్తి లేకపోవడం, ఒత్తిడిని తట్టుకోలేకపోవడం, ఇలాంటివి డ్రగ్స్ వైపు దారి తీస్తాయి.
కానీ, అవి అందించే ఆనందం కేవలం క్షణికం మాత్రమే. నష్టం మాత్రం జీవితాంతం ఉండేలా చేస్తాయి. కలలు మనిషిని ముందుకు నడిపించే ముఖ్యమైన శక్తి. ఉన్నతమైన లక్ష్యంతో కూడిన కలలు జీవితానికి దిశానిర్దేశం చేస్తాయి. ఒక విద్యార్థి లక్ష్యంతో ముందుకుసాగితే తన ప్రతిభను అభివృద్ధి చేసుకుంటాడు. జీవితం పట్ల సానుకూల దృక్పథం పెంపొందించుకుంటాడు. డ్రగ్స్ మనల్ని చీకటిలోకి నెడతాయి. కలలు మాత్రం వెలుగువైపు నడిపిస్తాయి.
డ్రగ్స్ ఒక సామాజిక సమస్య
మాదక ద్రవ్యాల సమస్యను ఒక వ్యక్తి సమస్యగా పరిగణించకూడదు. డ్రగ్స్‌ను అరికట్టడాన్ని కుటుంబం, - విద్యాసంస్థ, - సమాజం అందరూ కలిసి ఎదుర్కొనాల్సిన సామూహిక బాధ్యతగా చూడాలి. రిహాబిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి, హెల్ప్‌లైన్ సేవలు అందించి బాధితుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలి. సమష్టిగా చైతన్యం పెంచినప్పుడే విద్యార్థులను మాదకద్రవ్యాల ప్రమాదం నుంచి దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందించగలుగుతాం. మాదక ద్రవ్యాల రహిత సమాజమే నిజమైన అభివృద్ధి.
సమాజం, ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రమాదకర పదార్థాల విక్రయాన్ని అరికట్టడంలో కీలక పాత్ర పోషించాలి. మీడియా ద్వారా దుష్ప్రభావాలపై జనజాగరణ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల వి ద్యార్థుల్లో డ్రగ్స్ అనర్థాలపై అవగాహన పెరుగుతుంది. మాదకద్రవ్యాల సమస్య ఓ సామాజిక సమస్య. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, ఆరోగ్యశాఖ, మాదకద్రవ్య నివారణ సంస్థలు, సమాజం అందరూ కలిసి కృషి చేస్తేనే ఈ సమస్యను అధిగమించగలుగుతాం.
పరిష్కార మార్గాలు
యువత తమపై తాము నమ్మకం పెంపొందించుకోవాలి. కష్టం వచ్చినప్పుడు అది శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి. సానుకూల స్నేహితులను ఎంచుకోవాలి. చెడు అలవాట్లను ప్రోత్సహించేవారిని దూరం పెట్టాలి. అభిరుచులు పెంపొందించుకోవాలి. క్రీడలు, సంగీతం, చిత్రలేఖనం, నృత్యం, పుస్తకాలు ఇవి మనసును ఆహ్లాదంగా ఉంచుతాయి. సహాయం కోరడంలో వెనకడుగు వేయకూడదు. తల్లిదండ్రులు, గురువులు, కౌన్సెలర్ల సహాయం తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించే ఆరోగ్యకరమైన మార్గాలు నేర్చుకోవాలి. ధ్యానం, యోగా, వ్యాయామం వంటి అలవాట్లు మానసిక బలం ఇస్తాయి.
తల్లిదండ్రులు పిల్లలతో ప్రతిరోజూ మాట్లాడటం, వారి సమస్యలు వినడం, ప్రేమ, సహనంతో వ్యవహరించాలి. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై పాఠశాల/కళాశాల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గమనించి తక్షణ చర్యలు తీసుకోవాలి. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సానుకూల మార్గదర్శనం చేయాలి. విద్యార్థులు స్వీయ అవగాహనతో మాదకద్రవ్యాలు శాశ్వత సమస్యలకు తప్పుదారి మాత్రమే అని గ్రహించాలి.
డా. కోమల్ల ఇంద్రసేనారెడ్డి

