టెక్నాలజీ రంగంలో భారత్ ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుస్తోంది. టెక్నాలజీ అంటే ఏమిటో తెలియని దేశం నుంచి ప్రపంచంలోనే టెక్నాలజీ ద్వారా ఎక్కువ చెల్లింపులు చేస్తున్న దేశంగా భారత్ ఎదిగింది. ఇప్పుడు భారతీయుల రోజువారీ జీవన విధానంలో టెక్నాలజీ వాడటం ఒక భాగం. ఒకప్పుడు నగదుతో కూడుకున్న ఏ పని చేయాలన్నా తప్పనిసరిగా ఇంటి నుంచి బయటకి నగదుతో వెళ్లాల్సి వచ్చేది. కానీ, ఇప్పడు అవన్నీ ఇంటి నుంచే చేతిలో నగదు లేకుండానే నిమిషాల్లో చేసేస్తున్నారు.
ఆర్థిక వ్యవహారాలలో టెక్నాలజీ వినియోగం పెరిగింది. ఏ దేశం అభివృద్ధికైనా బాటలు వేసేది ఆ దేశం ఫైనాన్షియల్ సిస్టం. మన దేశంలో డిజిటల్ పేమెంట్స్ వినియోగం పెరిగిపోతోంది. ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం 2024లో నగదు చెల్లింపులు కేవలం 0.2 శాతానికి పడిపోవడమే దీనికి నిదర్శనం. మన దేశ ఫైనాన్షియల్ సిస్టంలో మొత్తం నాలుగు భాగాలు ఉంటాయి. అవి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అంటే బ్యాంకు, నాన్ బ్యాంకింగ్ సంస్థలు. ఎక్కడైతే నగదు లేదా నగదు రూప పరికరాలు లభిస్తాయో వాటిని ఫైనాన్షియల్ మార్కెట్ అంటారు. మనీ మార్కెట్, కాపిటల్ మార్కెట్గా దీనిని వర్గీకరిస్తారు.
ఇక నగదుకు బదులుగా ఉపయోగించే సాధనాలను ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్గా పేర్కొంటారు. అవి చెక్కు, బాండ్స్, షేర్స్, కాల్ మనీ, ప్రామిసరీ నోట్ మొదలుగునవి. లీజింగ్, హైరింగ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్సు, మర్చంట్ బ్యాంకింగ్ వంటి సేవలను ఫైనాన్షియల్ సర్వీసెస్‌గా పేర్కొంటారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ నాలుగు పునాదులు వంటివి. ఈ నాలుగు అంశాలలో కీలకమైనది ఫైనాన్షియల్ సర్వీసెస్. దేశంలో సుమారు 80 శాతం ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యాంకింగ్ రంగం నుంచే జరుగుతాయి. దేశంలో సుమారు 95 శాతం మంది బ్యాంకులలో అకౌంట్ కలిగి ఉన్నారు.
డిజిటల్ పేమెంట్లో భారత్ ప్రస్థానం ?
టెక్నాలజీని ఉపయోగించి ఆన్లైన్ ద్వారా నగదు చెల్లింపు, వసూలు చేసే విధానాన్ని డిజిటల్ పేమెంట్ సిస్టం అంటారు. మన దేశంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, బ్యాంకులు జారీ చేసే డెబిట్, క్రెడిట్ కార్డ్స్ ద్వారా, మొబైల్ వాలెట్, బ్యాంకుల యాప్ల ద్వారా ఆర్థిక వ్యవహారాల చెల్లింపులు జరుగుతున్నాయి.
గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాపంగా మొత్తం డిజిటల్ చెల్లింపులలో 48.5 శాతం భారత్‌లో జరుగుతున్నాయి. 2030 నాటికి ఈ వాటా సుమారు 20 శాతానికి చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో ప్రతి సంవత్సరం డిజిటల్ వ్యవహారాలు సుమారు 30 శాతం వరకు పెరుగుతున్నాయి.
పెరిగిన డిజిటల్ పేమెంట్స్
కరోనా మహమ్మారి తరువాత డిజిటల్ పేమెంట్స్ విపరీతంగా పెరిగాయి. 2020-–21లో 41,03,653.58 కోట్ల రూపాయల విలువైన 22,330.65 మిలియన్ వ్యవహారాలు జరగగా, 2024–-25 నాటికి 2,60,56,954.65 కోట్ల రూపాయల విలువైన 1,85,866.02 మిలియన్ వ్యవహారాలకు పెరిగింది. గత ఐదేండ్లలో కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సుమారు 700 శాతం పెరిగింది. కేవలం ఇవి యూపీఐ ద్వారా జరిగిన డిజిటల్ ట్రాన్సాక్షన్ మాత్రమే.
ఇక డెబిట్, క్రెడిట్ కార్డ్స్, నెఫ్ట్, ఇతర ఆన్లైన్ మార్గాల ద్వారా కూడా డిజిటల్ ప్రవాహం జరుగుతోంది. 2021 మార్చి నాటికి 19 శాతం ఉన్న డిజిటల్ పేమెంట్స్, 2024 డిసెంబర్ నాటికి 48 శాతానికి పెరిగినాయి. 2021 నగదు చెల్లింపులు 86 శాతం ఉండగా 2024 నాటికి 60 శాతంకు పడిపోయాయి. యూపీఐ ద్వారానే దేశంలో సుమారు 85 శాతం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి.
డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ ఆవశ్యకత ఏమిటి ?
డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అంటే బ్యాంకు అకౌంట్‌కు మొబైల్ నెంబర్ అనుసంధానం చేసి వివిధ డిజిటల్ చెల్లింపు పద్ధతుల ద్వారా చెల్లింపులు చేయడం. వాస్తవానికి పన్నులు దేశ ప్రగతికి కీలకమైనవి. వివిధ రకాల ఆర్థిక వ్యవహారాలపై దేశంలో పన్నులు విధిస్తారు. అన్ని ఆర్థిక వ్యవహారాలపై ప్రభుత్వాల నిఘా ఉండదు. ఫలితంగా పన్నులు ఎగవేత సాధ్యమవుతుంది.
ఒకవేళ ఆర్థిక వ్యవహారాలు డిజిటల్ రూపంలో జరిగితే వాటిపై ప్రభుత్వాల పర్యవేక్షణ, నియంత్రణ ఉంటుంది. ఫలితంగా పన్నుల ఎగవేత ఉండదు. పేపర్ లెస్ ఎకానమీ ద్వారా పర్యావరణ సంరక్షణ సాధ్యమవుతుంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ 2015లో ‘డిజిటల్ ఇండియా’ మిషన్ ను ప్రకటించి దేశంలో అన్నిరకాల ఆర్థిక వ్యవహారాలు డిజిటల్ రూపంలో జరిగేలా ప్రోత్సహించారు.
900 శాతం పెరిగిన సైబర్ క్రైమ్స్
భారత్ పూర్తి స్థాయి డిజిటల్ ఎకానమీగా మారడానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ ఎక్కువ గ్రామాలలో ఇంటర్నెట్ సేవలు లభించడం లేదు. కేంద్ర ప్రభుత్వం 'భారత్ నెట్' పథకం కింద గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ సేవలు విస్తరించాలని భావించినప్పటికీ అది పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. ఇంటర్నెట్ స్పీడ్ పెరగాలి. 2020 నుంచి 2024 మధ్యలో మన దేశంలో సైబర్ క్రైమ్ మోసాలు సుమారు 900 శాతం పెరిగాయి. అకౌంట్స్ హ్యాక్ చేయడం, ఓటీపీలు చోరీ చేసి ఆన్లైన్లో నగదును దొంగిలించడం వంటివి పెరిగిపోతున్నాయి. ఇలా కొన్ని డిజిటల్ అవరోధాలను భారత్ అధిగమించగలిగితే రానున్న రోజుల్లో భారత్ 100 శాతం డిజిటల్ ఆర్థికవ్యవస్థగా అవతరిస్తుంది.
డా.రామకృష్ణ బండారు, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీయూ, కేరళ
