సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తోన్న బీజేపీ ..సీపీఎం నేత చుక్క రాములు

సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తోన్న బీజేపీ ..సీపీఎం నేత చుక్క రాములు

మెదక్​ టౌన్, వెలుగు: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్క రాములు అన్నారు. ఆదివారం మెదక్ పట్టణంలోని కేవల్ కిషన్ భవనంలో సీపీఎం మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.1946  నుంచి 1951 వరకు రైతులు, ప్రజలు నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు. 

కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన పోరాటంలో 4 వేల మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. 10 లక్షల ఎకరాల భూమిని ప్రజలకు పంచారని, 33 గ్రామాలకు విముక్తి  కల్పించామని వివరించారు. సాయుధ పోరాటంలో ఏనాడు పాల్గొనని బీజేపీ చరిత్రను వక్రీకరించేందు ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. మతం పేరుతో బీజేపీ చేస్తున్న నాటకాలను ప్రజలు గమనించాలన్నారు. సాయుధ పోరాటం ప్రపంచానికే  ఆదర్శంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు అడివయ్య,  బాలమణి, మల్లేశం, సంతోష్, అజయ్ కుమార్, ప్రవీణ్, నాగరాజు, సత్యనారాయణ, దుర్గ, యాదగిరి, వెంకట్, సావిత్రి, కవిత, దుర్గేశ్, బాబు,   సాయిలు, మంజుల పాల్గొన్నారు.