‘మిషన్​ 90’ టార్గెట్​గా జనంలోకి బీజేపీ

‘మిషన్​ 90’ టార్గెట్​గా జనంలోకి బీజేపీ

హైదరాబాద్, వెలుగు: ‘మిషన్ 90’ లక్ష్యంతో కొత్త ఏడాదిలో వరుస కార్యక్రమాలకు బీజేపీ సిద్ధమవుతున్నది. 10 నెలల రోడ్ మ్యాప్ లో భాగంగా నాలుగు నెలల రోడ్ మ్యాప్​ను రెడీ చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఫెయిల్యూర్స్​ను జనంలో ఎండగట్టడంతోపాటు రాష్ట్రానికి కేంద్రం ఏ పథకం కింద ఎన్ని నిధులు ఇచ్చిందో వివరించనుంది. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 5 వరకు ‘పల్లె గోస.. బీజేపీ భరోసా’ పేరుతో పది వేల గ్రామ సభలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఫిబ్రవరిలో ప్రధాని మోడీని హైదరాబాద్ కు ఆహ్వానించి, ఏడు లక్షల మంది బూత్ కమిటీ సభ్యులతో సమ్మేళనం నిర్వహించాలని భావిస్తున్నది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 5 వరకు అసెంబ్లీ స్థాయిలో, ఆ తర్వాత జిల్లా స్థాయిలో సభలు నిర్వహించేందుకు ప్రణాళికను రెడీ చేసుకుంది. వీటికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను తీసుకురావాలనే ఆలోచనలో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఫెయిల్యూర్స్​పై ఏప్రిల్ లో చార్జ్​షీట్ విడుదల చేయాలనుకుంటున్నది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆహ్వానించి భారీ బహిరంగ సభను నిర్వహించాలని యోచిస్తున్నది. గురువారం హైదరాబాద్ శివారులో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల పాలక్​, విస్తారక్​, ప్రభారీ, కన్వీనర్ల సమావేశంలో పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్  చేసిన దిశానిర్దేశంతో నేతలు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. కాగా,  బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉధృతంగా పోరాడాలని శుక్రవారం బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన ఈ వర్చువల్​ మీటింగ్​లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ ఇన్​చార్జ్​ తరుణ్ చుగ్, సహ ఇన్​చార్జ్​ అరవింద్ మీనన్,  సీనియర్ నేతలు లక్ష్మణ్, డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, విజయశాంతి, జితేందర్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, ప్రదీప్, బంగారు శృతి తదితరులు పాల్గొన్నారు.  సమావేశం ప్రారంభంకాగానే ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ మృతికి సంతాపం ప్రకటించారు. నిత్యం పోరాటాలతో ప్రజల్లో ఉండాలని, ఇందుకోసం కార్యక్రమాలను రూపొందించాలని సమావేశం నిర్ణయించింది.

రాష్ట్రపతిని కలిసిన బీజేపీ నేతలు

రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి హైదరాబాద్ వచ్చిన ద్రౌపది ముర్మును శుక్రవారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బీజేపీ నేతలు కలిసి శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో పార్టీ నేతలు విజయశాంతి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్  రావు, బంగారు శృతి, ఇతర నేతలు ఉన్నారు.

తెలంగాణ ఉద్యమంలో నిర్వహించినట్లుగా సదస్సులు

రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు నాలుగంచెల వ్యవస్థతో ముందుకు వెళ్తున్నామని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలనతో విసిగి పోయారని, అందుకే ‘కేసీఆర్ హఠావో...తెలంగాణ బచావో’ పేరుతో జనంలోకి వెళ్తామని చెప్పారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మేధావులతో సమ్మేళనాలు, సదస్సులు నిర్వహించినట్లే ఇప్పుడు కూడా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు పోటీకి రెడీగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. ఈసారి హైదరాబాద్ ఎంపీ సీటును కూడా గెలుచుకోవాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు.