మాకు 400 సీట్లు పక్కా..తెలంగాణలో 10కి పైగా గెలుస్తం : అమిత్ షా

మాకు 400 సీట్లు పక్కా..తెలంగాణలో 10కి పైగా గెలుస్తం : అమిత్ షా
  • ముస్లిం రిజర్వేషన్లు మాత్రమే రద్దు చేస్తం
  • నా వీడియోను ఎడిట్ చేసి కాంగ్రెస్ దుష్ర్పచారం 
  • దేశాన్ని ఉత్తర, దక్షిణ భారత్​గా విడగొట్టేందుకు ఆ పార్టీ కుట్ర చేస్తున్నది 
  • రాహుల్​ను ఎన్నిసార్లు లాంచ్ చేసినా విఫలమేనని కామెంట్ 

హైదరాబాద్/వికారాబాద్/వనపర్తి, వెలుగు : ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుచుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 13 స్థానాల్లో బీజేపీకి అనుకూలంగా ఉందని, కచ్చితంగా 10కి పైగా సీట్లలో విజయం సాధిస్తామని చెప్పారు. 

దక్షిణ భారతదేశంలో బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తాయని తెలిపారు. శనివారం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో మీడియా సమావేశంలో, బీజేపీ చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మద్దతుగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జనసభలో, నాగర్ కర్నూల్ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ కు మద్దతుగా వనపర్తిలో నిర్వహించిన జనసభలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను బీజేపీ తొలగిస్తుందంటూ కాంగ్రెస్ ​నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘‘ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని నేను చెప్తే.. ఆ వీడియోను కాంగ్రెస్ ఎడిట్ ​చేసి ఫేక్ ​వీడియోను ప్రచారం చేస్తున్నది. పదేండ్లుగా బీజేపీకి మెజారిటీ ఉంది. రిజర్వేషన్లను రద్దు చేసేదుంటే ఎప్పుడో చేసేవాళ్లం. రిజర్వేషన్లను రద్దు చేసే ఉద్దేశం మాకు లేదు.

మతపరమైన ముస్లిం రిజర్వేషన్లను మాత్రమే రద్దు చేస్తం” అని స్పష్టం చేశారు. ముస్లిం రిజర్వేషన్లను తీసేస్తే వాళ్లు ఈడబ్ల్యూఎస్​పరిధిలోకి వస్తారని చెప్పారు. ‘‘ఓవైపు ఇండియా కూటమి.. ఇంకోవైపు ఎన్డీయే కూటమి ఉన్నది. ఓవైపు రూ.12 లక్షల కోట్ల అవినీతి చేసిన కూటమి..

మరోవైపు 25 పైసల అవినీతి కూడా లేని మోదీ కూటమి ఉన్నది. అధికార అహంకారం తలకెక్కిన ఇండియా కూటమి ఒకవైపుంటే.. సెలవు లేకుండా సైనికుల మధ్యే దీపావళి జరుపుకుంటున్న మోదీ కూటమి మరోవైపు ఉన్నది. ప్రజలు ఎవరి వైపు ఉంటారో ఆలోచించుకోవాలి” అని అన్నారు. 

దేశాన్ని విడగొడుతున్నది కాంగ్రెస్సే..

దేశాన్ని విడగొడుతున్నది కాంగ్రెస్​ పార్టీనేనని అమిత్​షా ఆరోపించారు. ఇప్పటికే దేశాన్ని ఓసారి విభజించిందని.. ఇప్పుడు ఉత్తర, దక్షిణ భారత్ గా విభజించేందుకు కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. ‘‘2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను నిలపాలని మోదీ ప్రయత్నిస్తుంటే..  దేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలని కాంగ్రెస్​ కుట్రలు చేస్తున్నది. పాకిస్తాన్​వద్ద అణుబాంబులు ఉన్నాయని, ఆ దేశం మనపై దాడి చేస్తుందంటూ కాంగ్రెస్​ నేత మణిశంకర్​ అయ్యర్

ఇండియా కూటమి నాయకుడు ఫరూఖ్​ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయి” అని అన్నారు. అధికారంలోకి వస్తే ఆర్టికల్​370, ట్రిపుల్​తలాక్ ను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ చెబుతున్నదని ఫైర్ అయ్యారు. ‘‘రాహుల్ ను ఎన్నిసార్లు లాంచ్ చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నా విఫలమే అవుతున్నది. ఇప్పటికే 20 సార్లు ఫెయిల్ అయింది. ఇప్పుడు  21వ సారి కూడా విఫల ప్రయత్నం చేస్తున్నది” అని విమర్శించారు. 

ఆరు గ్యారంటీల అమల్లో ఫెయిల్.. ​

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అమిత్​షా విమర్శించారు. ‘‘సోనియా బర్త్ డే అయిన డిసెంబర్​9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదు. సోనియా ఎన్నో పుట్టిన రోజు నాడు రుణమాఫీ చేస్తారో చెప్పలేదు. ఇప్పుడు మళ్లీ ఆగస్టు 15న రుణమాఫీ చేస్తామంటున్నారు. కానీ ఏ ఏడాది ఆగస్టు 15న అన్నది కూడా చెప్పలేదు” అని ఎద్దేవా చేశారు. ‘‘రైతు భరోసా రూ.15 వేలు, వడ్లకు రూ.500 బోనస్, మహిళలకు నెలకు

రూ.2,500 కూడా ఇవ్వడం లేదు. ఇవేవీ చేయడం లేదు కానీ, హైకమాండ్​కు ఇచ్చిన ఒక్క హామీని మాత్రం నెరవేరుస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల ఖర్చుల కోసం తెలంగాణ నుంచి డబ్బులు వసూలు చేసి పంపిస్తున్నారు” అని ఆరోపించారు. తెలంగాణకు పెట్టుబడులు లేకుండా కేంద్రం కుట్ర చేస్తోందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయన రాష్ట్రాన్ని నడుపుతున్న తీరును చూసే పెట్టుబడులు రావడం లేదన్నారు. 

ప్రభుత్వాన్ని నడుపుతున్నది మజ్లిస్ పార్టీనే..  

రాష్ట్రంలో బీఆర్ఎస్​ గానీ, కాంగ్రెస్​ గానీ ఎవరు అధికారంలో ఉన్నా ప్రభుత్వాన్ని నడుపుతున్నది మాత్రం మజ్లిస్​పార్టీనే అని అమిత్​షా అన్నారు. అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలనతో తెలంగాణ రాజకీయాలు భ్రష్టు పట్టాయని.. అందుకే ఈసారి వీలైనన్ని ఎక్కువ సీట్లలో బీజేపీని గెలిపించాలని ప్రజలు డిసైడ్​అయ్యారని పేర్కొన్నారు. ‘‘అర్వింద్ కేజ్రీవాల్​నిర్దోషి అని కోర్టు తీర్పు ఇవ్వలేదు. కేవలం ఎన్నికల ప్రచారం కోసమే బెయిల్​ఇచ్చింది.

బెయిల్ రావడమే క్లీన్​చిట్ అనుకుంటే, అంతకన్నా అమాయకత్వం మరొకటి ఉండదు. ప్రాంతీయ పార్టీలు తమ గొంతును వినిపించే అధికారం ఉంటుంది. కేసీఆర్​కూ ఆ అధికారం ఉంది. అంతేగానీ బీజేపీతో పోల్చుకోవాలనుకోవడం హాస్యాస్పదం” అని అన్నారు. ఎండోమెంట్​చట్టం తొలగింపు అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని చెప్పారు. 

రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్..  

ఢిల్లీ కాంగ్రెస్ కు తెలంగాణ ఏటీఎంగా మారిందని అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్స్ నడుస్తున్నదని.. ఆర్ఆర్ అంటే రాహుల్, రేవంత్ ట్యాక్స్ అని పేర్కొన్నారు. ‘‘అయోధ్య విషయాన్ని కాంగ్రెస్ 70 ఏండ్లు నాన్చింది. కానీ మోదీ అధికారంలోకి వచ్చిన పదేండ్లలో రామమందిరం నిర్మించారు. కనీసం ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి కూడా కాంగ్రెస్ నేతలు రాలేదు. ఓ వర్గం ఓటు బ్యాంకుకు భయపడే వాళ్లు హాజరుకాలేదు. మజ్లిస్ ఓటు బ్యాంకుకు రేవంత్ భయపడుతున్నారు. బీజేపీ మాత్రం ఓటు బ్యాంకు కోసం ఎన్నడూ భయపడలేదు” అని అన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని.. కాంగ్రెస్, మజ్లిస్ ను రాష్ట్రం నుంచి తరిమే శక్తి బీఆర్ఎస్ కు లేదని, అది బీజేపీకే సాధ్యమని చెప్పారు. ‘‘సర్జికల్ స్ట్రైక్స్ పై రేవంత్ తమాషాగా మాట్లాడుతున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ తో పాక్ లోని ఉగ్రవాదులను ఏరిపారేశాం. సర్జికల్ స్ట్రెక్స్ చేసే ధైర్యం కాంగ్రెస్ కు లేదు” అని పేర్కొన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారమే మోదీ పాలన సాగుతున్నదని.. తాము ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయబోమని స్పష్టం చేశారు. యూపీఏ పదేండ్ల పాలనలో దళితులకు  బడ్జెట్‌‌ లో రూ.45 వేల కోట్లు కేటాయిస్తే, మోదీ ప్రభుత్వం రూ.లక్షా 85 వేల కోట్లు  కేటాయించిందని తెలిపారు.