బీజేపీలో ఉంటే మంచోళ్లు..లేకుంటే చెడ్డోళ్లా?: ఏచూరి

బీజేపీలో ఉంటే మంచోళ్లు..లేకుంటే చెడ్డోళ్లా?: ఏచూరి

హైదరాబాద్, వెలుగు: బీజేపీలో ఉంటేనే మంచోళ్లనీ, ఇతర పార్టీల్లో ఉంటే అవినీతి పరులు అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఈడీ, సీబీఐ, ఎలక్షన్ కమిషన్ లను బీజేపీ వాడుకుని ప్రత్యర్థులను బెదిరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్ల కాలంలో ఈడీ 5600 కేసులు నమోదు చేస్తే దాంట్లో కేవలం 23 మాత్రమే నిలబడ్డాయని తెలిపారు. దేశంలో బీజేపీ ఓటమే లక్ష్యంగా పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో యాంటీ బీజేపీ, యాంటీ బీఆర్ ఎస్ నినాదాలతో తాము ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. 

శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీడబ్ల్యూజేఎఫ్​, హెచ్​యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది మీడియా కార్యక్రమంలో ఏచూరి పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్​తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా, పొత్తులు కుదరకపోవడంతో సీపీఎం ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. పొత్తులు లేకపోవడానికి కారణం కాంగ్రెస్​నే అడగాలని ఆయన మీడియాకు సూచించారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు విజయావకాశాలు ఉన్నాయన్నారు. రాజస్థాన్ లో పోటాపోటీ ఉన్నా.. బీజేపీపై వ్యతిరేకత తీవ్రంగా ఉందన్నారు. 

పోటీ చేయని స్థానాల్లో కాంగ్రెస్ కు మద్దతు

తెలంగాణలో హంగ్ వస్తే.. బీఆర్ఎస్ తప్పకుండా బీజేపీ మద్దతు తీసుకుంటుందని ఏచూరి చెప్పారు. ఇండియా కూటమిలో సీపీఎం భాగస్వామింగా ఉందని.. అందుకే తాము పోటీ చేయని స్థానాల్లో కాంగ్రెస్ కు మద్దతిస్తామని వెల్లడించారు. బీజేపీకి యాంటీ టీమ్ గా ఉంటామని.. అన్ని రాష్ట్రాల్లోనూ తమది అదే వైఖరి అన్నారు.