కేసీఆర్​ పాలనలో అవినీతి పెరిగింది: జేపీ నడ్డా

కేసీఆర్​ పాలనలో అవినీతి పెరిగింది: జేపీ నడ్డా

బీఆర్ఎస్ అంటే   భారత రాక్షస సమితి అని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు.గురువారం ( నవంబర్​ 23)  సంగారెడ్డిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన  ప్రసంగించారు. కేసీఆర్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని జేపీ నడ్డా విమర్శించారు. తెలంగాణను అభివృద్ది వైపు కాకుండా అప్పుల్లోకి తీసుకెళ్లారని కేసీఆర్ సర్కార్ పై ఆయన విమర్శలు చేశారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లను తీసేస్తామని జేపీ నడ్డా తేల్చి చెప్పారు. మియాపూర్ భూములు, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్లను దోచుకున్నారని  జేపీ నడ్డా   కేసీఆర్ పై ఆరోపణలు చేశారు. కేసీఆర్ ముస్లింలకు  12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇచ్చిన హామీని జేపీ నడ్డా ప్రస్తావించారు. కాళేశ్వరం  కేసీఆర్ ఏటీఎంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకొనేందుకు కమల దళం  అన్ని అస్త్రాలను  ప్రయోగిస్తుందన్నారు.   

తెలంగాణ ప్రజలకు కేసీఆర్​ ఏమీ చేయలేదని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.  తెలంగాణ ప్రజల పోరాటం వల్లే  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.   చాలా రాష్ట్రాల్లో కుటుంబ పాలన ఉందని... తెలంగాణలో కల్వకుంట్ల ఫ్యామిలీ పాలన నడుస్తుందని... కేసీఆర్​, కవిత, కేటీఆర్​ పాలన నడుస్తుందన్నారు. తెలంగాణ రైతులకు ధరణి పోర్టల్​ ఏర్పాటు చేశామని గొప్పలు చెబుతున్నారని ... కాని అది కేసీఆర్​ హరణి పోర్టల్​ గా తయారైందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు పసుపు బోర్డు రావడం వల్ల తెలంగాణకు హల్దీ ప్రాసెసింగ్ ప్లాంట్ వస్తుందన్నారు.  తెలంగాణ పసుపు రైతుల కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇంటర్వెన్షన్ పథకం తెచ్చిందన్నారు. 

తెలంగాణలో జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది.ఈ రెండు పార్టీలు  తెలంగాణలో కలిసి పోటీ చేస్తున్నాయి. బీజేపీ  111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తుంది.  బీజేపీ, జనసేన అభ్యర్థుల తరపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడ  విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.