కేసీఆర్ దమ్ముంటే రా.. హుజురాబాద్ లో తేల్చుకుందాం

కేసీఆర్ దమ్ముంటే రా.. హుజురాబాద్ లో తేల్చుకుందాం

హైదరాబాద్: ఉపఎన్నికలు వచ్చినప్పుడల్లా కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హుజురాబాద్ ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలని కేసీఆర్ చేస్తున్న తీరును ఎండగడుతూ ఆయన బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. 

‘కేసీఆర్ నీకు దమ్ముంటే హుజూరాబాద్ అభ్యర్థిగా రా. హుజూరాబాద్ ప్రజలు ఈటలను గెలిపిస్తారో.. నిన్ను గెలిపిస్తారో తేల్చుకుందాం. హుజూరాబాద్ ఎన్నికను రెఫరెండంగా తీసుకుందాం. కేసీఆర్ ఉపఎన్నికలో నిలబడితే ప్రజలు ఎలా బుద్ది చెబుతారో తెలుస్తుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక వేడెక్కుతోంది. ఇది రాష్ట్ర రాజకీయాల ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేస్తోంది. టీఆర్ఎస్ ఇప్పుడు తమ అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ ముందుగానే ఈటల తమ అభ్యర్థిగా చెప్పింది. కేసీఆర్ కుట్రలకు పరాకాష్టగా ఈ ఎన్నిక మారింది. పెద్దిరెడ్డి, కౌషిక్ రెడ్డి, రమణను చేర్చుకున్నారు. రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు. హుజూరాబాద్ ప్రజలు విజ్ఞతతో వ్యవహరిస్తారు. ఉద్యమంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. కేసీఆర్ ఎలా మోసం చేశారో ప్రజలు చూస్తున్నారు. నాలుగు వేల ఇండ్లు పూర్తి చేశామని హరీష్ రావు నాలుగు నియోజకవర్గాల పేర్లు చెప్పారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలుంటే కేసీఆర్ కు ఆ నాలుగు నియోజకవర్గాలే కనిపిస్తున్నాయా? 
అందుకు ఉదాహరణ నిన్నటి హరీష్ ప్రకటనే. మిగిలిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే లు.. మంత్రులు నిర్ణయాత్మక స్థితిలో లేరని అర్థమైంది. ఈటలను ఎలా అవమానించారో హరీష్ మాటల్లో కనిపించింది. ఇది ప్రత్యేక పరిస్థితిలో జరుగుతున్న ఉప ఎన్నిక. నీతీ నిజాయితీలకు మరియు ఫిరాయింపులకు పెద్దపీట వేస్తున్న వారికి మద్య జరగుతున్న ఎన్నిక ఇది. తెలంగాణ ద్రోహులు మంత్రులు అయ్యారు. తెలంగాణ వద్దన్న పార్టీలు టీఆర్ఎస్ లో విలీనం అయ్యాయి. కేసీఆర్ ఉప ఎన్నిక వచ్చినప్పుడల్లా మాటలు కోటలు దాటిస్తారు. ప్రజలను మోసం చేసి హుజూర్ నగర్, నాగార్జున సాగర్ లో గెలవవచ్చు. హామీలు నెరవేర్చనందుకు ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. మూడెకరాలను పంచనందుకు, నోటిఫికేషన్ ఇవ్వనందుకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. మానుకోటలో అడ్డుకుంటా.. తెలంగాణ వాదం లేకుండా చేస్తా అన్న కౌషిక్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్సీ ఇచ్చినందుకు క్షమాపణ చెప్పాలి. చిన్న కులాలకు వెయ్యికోట్లు ఇస్తానని ఏడేళ్లుగా ఇవ్వనందుకు క్షమాపణ చెప్పాలి. అనేక సర్వేలు ఈటల గెలుస్తాడని చెబుతున్నాయి’ అని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.