
వేములవాడ, వెలుగు : రాజన్న దేవాలయానికి కోడె మొక్కుల ద్వారా ఏటా కోట్ల రూపాయలు వస్తున్నప్పటికీ కోడెల సంరక్షణ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ మండిపడ్డారు. బుధవారం వేములవాడ పట్టణంలోని తిప్పపూర్ గోశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భక్తులు కోడెల కోసం ఇచ్చిన గడ్డి మోపులు వర్షం వల్ల తడిసిపోయాయని బురదనీటిలో ఉన్న కోడెల ఆరోగ్య పరిస్థితి ఎంటో చెప్పాలన్నారు. రాజన్న దేవస్థానానికి కోడె మొక్కుల ద్వారా ఏటా కోట్ల రూపాయలు వస్తున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. నాలుగు వందల కెపాసీటిలో 1200 వరకు కోడెలు ఎలా ఉంటున్నాయని ప్రశ్నించారు.
గోవులను రైతులకు పంపిణీ చేయకుండా కాలయాపన దేని కోసం అని మండిపడ్డారు. గోశాలలో కెపాసీటికి మించి కోడెలు ఉండడంతో మృత్యువాత పడుతున్నాయని, వెంటనే రైతులకు పంపిణీ చేయాలన్నారు. కొత్తగా తగినన్ని షెడ్లు నిర్మించి సిబ్బందిని పెంచాలన్నారు. లేకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. పట్టణ ఉపాధ్యక్షుడు కట్కం శ్రీనివాస్, యువర్ మోర్చా ఉపాధ్యక్షుడు బుర్ర మనీశ్ గౌడ్, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు తడక రాజు, ప్రధాన కార్యదర్శి నేరెళ్ల సాయి తదితరులు పాల్గొన్నారు