ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నారు

ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నారు

రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమని బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. కేంద్రం చేస్తున్న సాయాన్ని.. తమ గొప్పగా టీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారని ఆమె అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఆమె పత్రికా ప్రకటన విడుదల చేశారు.

‘రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నేడు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత గానీ, ఆసుపత్రుల్లో పడకల కొరత గానీ లేదని మాట్లాడడం పట్ల తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నారు. పీఎం కేర్ నుండి కేంద్ర ప్రభుత్వం 5 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఇంకా 12 ఆక్సిజన్ ప్లాంట్‌లు ఏర్పాటు చేసుకోవడానికి నిధులు ఇచ్చిన విషయం వాస్తవం కాదా?  ఆక్సిజన్ కొరత లేకుండా చేసింది కేంద్ర ప్రభుత్వం కాదా? యుద్ధ విమానాలను రాష్ట్రానికి పంపించింది కేంద్రం కాదా? రాష్ట్రంలో రెమిడిసివర్ కొరత లేకుండా కరోనా బాధితులకు అందుతుందంటే.. అది కేంద్ర ప్రభుత్వం స్పందించడం ద్వారానే అనే విషయం వాస్తవం కాదా? ప్రజా సంక్షేమాన్ని, ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపడం లక్ష్యంగా పెట్టుకున్నది.  ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఆరోగ్యశాఖకు సంబంధించిన అధికారులతో కానీ, క్యాబినెట్‌తో సమావేశమై కానీ, ఇతర సంబంధిత అధికారులతో సమీక్షించిన దాఖలాలు లేవు అనే విషయం వాస్తవం కాదా? ప్రచార మాధ్యమాలకు కొంతమంది ద్వారా లీకులు ఇస్తూ.. ముఖ్యమంత్రి  ప్రజారోగ్యంపై దృష్టి పెట్టారన్న అబద్ధపు వార్తలను ప్రచారం చేస్తున్న విషయం వాస్తవం కాదా? గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఒక్క ఆస్పత్రి నిర్మాణం చేసింది లేదు అనేది వాస్తవం కాదా?

రోజూ పత్రికలలో ప్రచార మాధ్యమాలలో కేంద్ర ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తూ.. ఆరోగ్య శాఖ మంత్రి కనిపిస్తున్నారు తప్ప ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందనే విషయాన్ని కానీ, నేటి వరకు తీసుకున్న చర్యలపై కానీ  వివరించలేదు. ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప రాష్ట్రంలో ప్రజలకు చేసింది ఏమీ లేదు. వ్యాక్సినేషన్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తున్నది. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన మంత్రులు.. కుటిల రాజకీయాలు చేయడంలో నిమగ్నమయ్యారు. యుద్ధ విమానాలను రాష్ట్ర ప్రభుత్వమే వినియోగిస్తుందని గొప్పలు చెప్పుకోవడం మానుకోవాలి. కేంద్ర ప్రభుత్వం స్పందించడం ద్వారానే దేశంలో యుద్ధ విమానాలు సైతం ప్రజాసంక్షేమం కోసం, ఆరోగ్యం కోసం పనిచేస్తున్నాయని మంత్రులు తెలుసుకుంటే మంచిది. కరోనా బాధితులు టెస్టులు చేయించుకోవడానికి కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో రాష్ట్ర ప్రభుత్వం గ్రహించకపోవడం దుర్మార్గం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆపత్కాల సమయంలో కూడా దుర్మార్గంగా రాజకీయాలు చేయడం తప్ప ఇంకొకటి చేయటం లేదు. ప్రైవేట్ యాజమాన్యాలు ప్రజలను దోపిడీ చేస్తున్నాయన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్న మంత్రి.. ఏం చర్యలు తీసుకుంటున్నారో ప్రజలకు వివరించాలి.

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఉన్న భారత్ బయోటెక్‌తో చర్చలు జరిపితే.. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులో ఉండి కూడా వ్యాక్సినేషన్‌పై చర్చించకపోవడం వారి నిర్లక్ష్యాన్ని తెలియజేస్తున్నది. వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టి కాలం వెళ్లదీసే ఆలోచనలో ఉన్నది ఈ ప్రభుత్వం. అందరికీ వ్యాక్సినేషన్ వేయాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కేంద్ర ప్రభుత్వం వేస్తున్న వ్యాక్సినేషన్ తమ గొప్పతనంగా చెప్పుకోవాలని ఆలోచనే తప్ప ఇంకొకటి కాదు. అందరికీ వ్యాక్సినేషన్ అన్నప్పుడు వివిధ కంపెనీలతో చర్చలు జరపాలన్న ఆలోచన లేకుండా ప్రజలను తప్పుదారి పట్టించే వ్యవహారం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1250 వెంటిలేటర్లు రాష్ట్ర ప్రభుత్వానికి దిక్కైనవి. కరోనాతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఒక సంవత్సరం నుండి ఒక డాక్టర్‌ను కానీ, ఆరోగ్య సిబ్బందిని కానీ భర్తీ చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. ఇప్పటికైనా ప్రజల ప్రాణాలు, ఆరోగ్యాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ప్రకటనలు మాని ప్రభుత్వ యంత్రాంగాన్ని కరోనాపై యుద్ధం ప్రకటించడానికి సమాయత్తం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని బీజేపీ నాయకురాలు విజయశాంతి పత్రికా ప్రకటనను విడుదల చేశారు.