
సెప్టెంబర్ 17 విమోచనమే...
బానిస సంకెళ్ల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజే సెప్టెంబర్ 17. ఇది విమోచనమే.. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలు తిరుగుబావుటా ఎగరేసి బిగించిన ఉక్కు పిడికిలే భావి ఉద్యమాలకు నాంది పలికింది. ఆ పోరాట స్ఫూర్తే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఊతమిచ్చింది. నిజాం ఏలుబడిలో ఖాసిం రజ్వీ నేతృత్వంలో రజాకార్లు హత్యలు, అత్యాచారాలు సాగించినా ప్రజలు ఏమాత్రం వెరువకుండా పోరు కొనసాగించారు. నిజాం నవాబు హైదరాబాద్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించేందుకు యూఎన్ భద్రతా మండలిని ఆశ్రయించి లాబీయింగ్ చేసినా అప్పటి కేంద్ర పాలకులు ఈ ప్రయత్నాలపై కనీస చర్యలకు పూనుకోలేదు. రజాకార్లు, భూస్వాముల ఆగడాలతో చలించిపోయిన అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్యకు దిగారు. అప్పటి వరకు తనకు ఎదురే లేదనుకున్న నిజాం..పటేల్ ముందు మోకరిల్లాడు. హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించాడు. ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17ను తెలంగాణ ఆవిర్భావం తర్వాత తామే అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్.. తీరా అధికారంలోకి వచ్చాక ఎంఐఎం నేతల ఒత్తిడితో మాట మార్చారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ విమోచన ఉత్సవాలు నిర్వహిస్తుండటంతో కేసీఆర్ దిగొచ్చి జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగానే నిర్వహించాలి.
- వివేక్ వెంకటస్వామి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు
విలీనంలో, రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీనే కీలకం
హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడంలో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంలో కాంగ్రెస్ పార్టీదే కీలక పాత్ర. కాశీం రజ్వీని, రజాకార్లను ఎదిరించి పోరాటం చేసింది కాంగ్రెస్, కమ్యూనిస్టులే. సెప్టెంబరు 17న భారత్‌లో నిజాం సంస్థానం విలీనం చేయడంలో బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీల పాత్రే లేదు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం విమోచనం, విలీనం అంటూ బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు వజ్రోత్సవాల ఆర్భాటం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. నాడు ఆగస్టు 15, 1945లో దేశానికి స్వాతంత్య్రం వస్తే నిజాం సంస్థానంతోపాటు, మరికొన్ని సంస్థానాలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చారు. హైదరాబాద్ నైజాం పాలనపై ప్రజలు ఉద్యమించారు. ఈ తరుణంలో ప్రధాని నెహ్రూ ఉప ప్రధాని సర్థార్ పటేల్ కు పోలీస్ యాక్షన్ బాధ్యతలు అప్పగించారు. సైనిక చర్యతో చేపట్టడంతో నిజాం లొంగిపోయారు. విలీనం కావడానికి అధికారిక ప్రక్రియ చేపట్టింది కాంగ్రెస్ పార్టీనే. ప్రజల ఆకాంక్షల మేరకు 2014లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఇచ్చింది. బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు చరిత్రను కనుమరుగు చేయలేవు.
- జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత
నిజాన్ని ఎక్కువ కాలం దాచలేకపోయారు
విమోచన దినోత్సవం జరుపుకోవడానికి, అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడానికి నేటి ప్రభుత్వాలు సిద్ధంగా లేకపోవడం దురదృష్టకరం. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా తెలంగాణ ప్రజల జీవితాల్లో అత్యంత ముఖ్యమైన చారిత్రక ఘట్టాన్ని రహస్యంగా దాచి కుట్రపూరితంగా ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారు. కానీ సత్యాన్ని ఎక్కువ కాలం దాచలేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనుగడ సాగించిన ప్రభుత్వాలు, ప్రస్తుత టీఆర్‌ఎస్ ప్రభుత్వం సెప్టెంబరు 17ను 'విమోచన దినోత్సవం'గా జరుపుకోకుండా, పేరు పలకడానికి కూడా ఇబ్బంది పడుతున్నాయి. విమోచన దినోత్సవం గురించి ఈ రాజకీయ పార్టీల నాయకులు ఎందుకు భయపడుతున్నారు?. 'విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తుంది' అనే ఆలోచనే సంకుచిత ఓటు బ్యాంకు రాజకీయాల మనస్తత్వాన్ని చాటుతోంది. వాస్తవాలను విస్మరించడం అజ్ఞానమే కాదు తెలంగాణ చరిత్ర, సంస్కృతికి చేస్తున్న అన్యాయం. ఇది ఏ ఒక్క వర్గానికి వ్యతిరేకం కాదు. తెలంగాణ తిరుగుబాటులో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.
- దాసోజు శ్రవణ్, బీజేపీ నాయకులు