సమస్యలపై ఫోకస్​ ...ప్రజా పోరాటాలు, ఉద్యమాలు చేసేందుకు వంద రోజుల కార్యక్రమం

సమస్యలపై ఫోకస్​ ...ప్రజా పోరాటాలు, ఉద్యమాలు చేసేందుకు వంద రోజుల కార్యక్రమం
  •     బీజేపీ ఆధ్వర్యంలో పాలమూరులో మహా ర్యాలీ
  •     ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన లీడర్లు, శ్రేణులు
  •     వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టాలని నేతల పిలుపు

మహబూబ్​నగర్​ అర్బన్​, వెలుగు : బీజేపీ లీడర్లు ప్రజా సమస్యలపై ఫోకస్​ పెట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రజా పోరాటాలు, ఉద్యమాలు చేసేందుకు వంద రోజుల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో ‘ప్రజా సమస్యలపై పాలమూరులో మహా ర్యాలీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ర్యాలీకి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో లీడర్లు, కార్యకర్తలు తరలివచ్చారు. చీఫ్​ గెస్ట్​గా పార్టీ స్టేట్​ చీఫ్  జి.కిషన్​రెడ్డి హాజరయ్యారు.

పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జీతేందర్​రెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి న్యూ టౌన్​ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్​ మీదుగా గడియారం చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ సభ అనంతరం మధ్యాహ్నం కిషన్​రెడ్డి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అలాగే ఉమ్మడి జిల్లా అసెంబ్లీ కోర్​ కమిటీ మీటింగ్​లో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై ఆయన దిశానిర్దేశం చేశారు.

పాలమూరులో వేధింపులు పెరిగినయ్..

ఉమ్మడి పాలమూరులో అధికార పార్టీ వేధింపులు పెరిగాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. మాయమాటలు చెప్పడంలో కేసీఆర్​ దిట్ట అని, ఎన్నికలప్పుడు కొత్త కొత్త హామీలు ఇస్తారని వాటిని నమ్మొద్దని కోరారు. జిల్లాలో ఎక్కడ చూసినా మంత్రులు, ఎమ్మెల్యేల భూములే ఉన్నాయని, ఇసుక, మట్టి కాంట్రాక్టులు వాళ్లవేనని, తెలంగాణ సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. అధికార పార్టీ లీడర్ల భూముల రేట్లు పెంచుకునేందుకు కలెక్టరేట్​ను ఊరి బయటకు తరలించారని మండిపడ్డారు. తాను బీసీ కావడంతోనే తనను తిడుతున్నారని మంత్రి శ్రీనివాస్​గౌడ్​  పేర్కొనడం సరైంది కాదని, బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తిని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు. ఎవరినో తీసుకొచ్చి కంప్లైంట్లు చేయిస్తూ, నాన్​ బెయిలబుల్​ కేసులు పెట్టిస్తున్నారని ఫైర్​ అయ్యారు. పాలమూరు ప్రజలను జైల్లో పెట్టించడానికే ప్రజలు గెలిపించారా? అని ప్రశ్నించారు.

పాలమూరు డెవలప్​మెంట్​కు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పాలని డిమాండ్​ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పాలమూరు అభివృద్ధి జరుగుతోందన్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఆశలతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ కుటుంబ పాలనలో దోపిడీకి గురవుతోందన్నారు. ఎన్నికల సమయంలో పాలమూరు లిఫ్ట్  ఇరిగేషన్  ప్రాజెక్ట్ ను రెండున్నరేండ్లలో పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఆందిస్తానని చెప్పి పూర్తి చేయలేదని విమర్శించారు. మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, టి.ఆచారి, దుద్యాల ప్రదీప్​కుమార్, నాగురావు నామాజీ, అప్సర్​ పాషా, పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, లీడర్లు పద్మజారెడ్డి, ఎన్పీ వెంకటేశ్​, సుదర్శన్​రెడ్డి, డీకే స్నిగ్ధారెడ్డి, ఆర్​ బాలాత్రిపుర సుందరి పాల్గొన్నారు.