మంత్రి, ఎమ్మెల్యేలు.. చేతకాని దద్దమ్మలు

మంత్రి, ఎమ్మెల్యేలు..  చేతకాని దద్దమ్మలు
  • దమ్ముంటే అసెంబ్లీలో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం ఏమైందని ప్రశ్నించాలి
  • బీజేపీ నేతలు విశ్వేశ్వర్ రెడ్డి ,టి. ఆచారి
  • లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు వద్ద కుర్చీ వేసి సీఎం ఫొటోతో ఊరేగించి నిరసన 

షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబితతో పాటు ఎమ్మెల్యేలు అందరూ చేతకాని దద్దమ్మలని, వీరికి దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీ సమావేశాల్లో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణంపై ప్రభుత్వాన్ని  నిలదీయాలని బీజేపీ నేతలు సవాల్ విసిరారు.  రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ సెగ్మెంట్ లోని బీజేపీ ఆఫీసు నుంచి జిల్లాలోని ఆయా అసెంబ్లీ  సెగ్మెంట్ల కన్వీనర్లు, పదాధికారులు, జిల్లా, రాష్ట్ర స్థాయి లీడర్లు, కార్యకర్తలు శనివారం చౌదరిగూడ మండలంలోని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణ  స్థలానికి భారీ కాన్వాయ్​తో తరలివచ్చారు. 

సీఎం కేసీఆర్ కోసం అక్కడ ఓ కుర్చీని ఏర్పాటు చేశారు. కుర్చీని వాహనంపై పెట్టి సీఎం కేసీఆర్ ఫొటోను ఉంచి షాద్ నగర్ నుంచి ఊరేగించుకుంటూ లక్ష్మీదేవిపల్లి స్థలానికి తీసుకొచ్చారు. మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ మెంబర్ టి. ఆచారి తదితరులు మీడియాతో  మాట్లాడుతూ.. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ వద్ద  కుర్చీ వేసుకుని ప్రాజెక్ట్  నిర్మాణాన్ని పూర్తిచేయిస్తానని ప్రతీ సభలోనూ,  ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పారని,  ఇక్కడ కుర్చీ ఏర్పాటు చేశామని దమ్ముంటే రిజర్వాయర్ కట్టాలని డిమాండ్​ చేశారు.  పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్వీర్యం చేసి బీడుగా మార్చారని విమర్శించారు.  దీనిపై ప్రశ్నించాల్సిన జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు చేతకాని దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.  భూముల అమ్మకంతో ప్రభుత్వ ఖజానా నింపుకొని ఎన్నికల్లో ఉచితాలు పంచేందుకు ప్రయత్నిస్తున్నారని, రంగారెడ్డి జిల్లాను కూడా అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. 

లక్ష్మీదేవిపల్లి వద్ద గాలిమరలకు కట్టి తిప్పుతం..

షాద్ నగర్ నియోజకవర్గంలో లక్ష్మీదేవిపల్లి ప్రాంతంలో నేటికీ శంకుస్థాపన జరగలేదని, ఇక్కడ ఏర్పాటుచేసిన గాలిమరలకు కేసీఆర్ ను కట్టి తిప్పుతామని హెచ్చరించారు. జూరాల నుంచి అతి సమీపంలో నీటిని తీసుకోవాల్సి ఉండగా కేసీఆర్ కావాలని శ్రీశైలం నుంచి నీరు తరలించడం మూర్ఖత్వానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.  బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి,  నాయకులు ప్రేమ్ రాజ్, పాపయ్య గౌడ్, కుమార్, ప్రదీప్ గౌడ్, కె. నరసింహారెడ్డి, సుదర్శన్ రెడ్డి,  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, ఏపీ మిథున్ రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, షాద్ నగర్ అసెంబ్లీ కన్వీనర్ టి. విజయ్ కుమార్, కమ్మరి భూపాల చారి, నందకిషోర్ జిల్లా అధికార ప్రతినిధి వెంకటేశ్​ గుప్త, అశోక్ గౌడ్ పాల్గొన్నారు..