ఎమ్మెల్యే బాల్కసుమన్​ తీరుపై బీజేపీ లీడర్ల ఆగ్రహం

ఎమ్మెల్యే బాల్కసుమన్​ తీరుపై బీజేపీ లీడర్ల ఆగ్రహం
  • రామకృష్ణాపూర్ ​మున్సిపల్ ఆఫీస్ ​ఎదుట ఆందోళన

రామకృష్ణాపూర్, వెలుగు: రామకృష్ణాపూర్​ మున్సిపాలిటీలోని మెయిన్ ​రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం కోసం శిలాఫలకాలు వేసి నాలుగేళ్లు గడిచినా పనులు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా కార్యక్రమం చేపట్టారు. క్యాతనపల్లి మున్సిపల్​ ఆఫీస్ ​మొయిన్​ గేటు ఎదుట బీజేపీ, దాని అనుబంధ సంఘాల లీడర్లు, కార్యకర్తలు బైఠాయించి ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ ​సర్కార్, ప్రభుత్వ విప్​బాల్క సుమన్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాకు ఎలాంటి పర్మిషన్​ లేదంటూ లీడర్లు, కార్యకర్తలను రామకృష్ణాపూర్ ​ఎస్సై అశోక్, పోలీసులు బలవంతంగా తొలగించే ప్రయత్నం చేయడంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. సమస్యలపై శాంతియుతంగా ధర్నాకు దిగితే పోలీసులు అడ్డుకోవడం ఏంటని, ప్రభుత్వ విప్​ కనుసన్నల్లో పోలీసులు పని చేస్తున్నారని  మండిపడ్డారు. ధర్నా అనంతరం మున్సిపల్​ కమిషనర్ ​వెంకట నారాయణకు వినతిపత్రం అందించారు.

ఈ సందర్భంగా బీజేపీ టౌన్​ప్రెసిడెంట్​మహంకాళీ శ్రీనివాస్, బీసీ మోర్చా ప్రెసిడెంట్​వీరమల్ల పాల రాజయ్య మాట్లాడుతూ.. రామకృష్ణాపూర్​మున్సిపాలిటీ పరిధిలో మెయిన్ ​రోడ్ల విస్తరణ, కొత్తగా నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల కోసం బాల్క సుమన్​ 22 చోట్ల నాలుగేళ్ల కిందట శిలాఫలకాలు వేశాడన్నారు. ఇప్పటివరకు నిర్మాణ పనులు చేపట్టలేదన్నారు. ప్రజల ఇబ్బందులు పట్టించుకోకుండా పట్టణ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్న బాల్క సుమన్​ వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో ఎక్కడ బై ఎలక్షన్లు వస్తే అక్కడ సమస్యలు పరిష్కారిస్తామంటూ ప్రచారం చేస్తూ సొంత నియోజకవర్గం చెన్నూరును మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నాడన్నారు. కార్యక్రమంలో బీజేపీ టౌన్​ వైస్​ ప్రెసిడెంట్లు జంగపెల్లి మల్లయ్య, సంగ రవి, జనరల్​ సెక్రటరీ వేల్పుల సత్యనారాయణ, సీనియర్​ లీడర్​ అరిగెల రవీందర్, మహిళా మోర్చా ప్రెసిడెంట్​ మేదరి లక్ష్మి, ఎస్సీ, కిసాన్​ మోర్చా ప్రెసిడెంట్లు బంగారి ప్రసాద్​, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.