కలెక్టరేట్ల ముట్టడి: బీజేపీ, టీఆర్‌‌ఎస్ నేతల మధ్య ఘర్షణ

కలెక్టరేట్ల ముట్టడి: బీజేపీ, టీఆర్‌‌ఎస్ నేతల మధ్య ఘర్షణ

రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనంటూ బీజేపీ ఆందోళన బాటపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ ఆందోళనల్లో భాగంగా  రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవటంతో.. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ఇదే టైంలో బీజేపీ నేతలకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు టీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో రెండు పార్టీల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని.. స్టేషన్‌కు తరలించారు. అయితే పోలీసుల వాహనం నుంచి కిందకు దిగిన కొందరు బీజేపీ నేతలు.. కలెక్టరేట్ గేట్ ముందు ఆందోళన నిర్వహిస్తున్నారు.  అలాగే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. దీంతో నిరసనకారులు లోపలికి రాకుండా.. బారికేడ్లను ఏర్పాటు చేసి, భారీగా పోలీసులు మోహరించారు. హనుమకొండలో బీజేపీ నేతలు ప్రేమేందర్‌‌ రెడ్డి, రావు పద్మ, ధర్మారావు, రాకేశ్‌ రెడ్డి తదితర నేతలతో పాటు కిసాన్‌ మోర్చా నేతలు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించారు. వానాకాలం వరి పంటను వెంటనే కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేస్తూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కలెక్టరేట్ లోపలికి వెళ్లకుండా ప్రధాన గేటు ముందు ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు.