మహారాష్ట్ర బీజేపీ మేనిఫెస్టోలో హామీలు
ముంబై: మళ్లీ అధికారంలోకి వస్తే ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అలా వచ్చే అయిదేళ్లలో ఐదు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా మంగళవారం ఇక్కడ రిలీజ్ చేశారు. వచ్చే 2022 నాటికి అందరికీ ఇళ్లు కట్టిస్తామని కూడా మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న నడ్డా.. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. మహారాష్ట్ర రాజకీయ సంస్కృతిని ఫడ్నవీస్ మార్చేశారని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మెచ్చుకున్నారు. ఒకప్పుడు మహారాష్ట్ర అంటేనే ‘‘అవినీతిలో కూరుకుపోయిన రాష్ట్రం ’’అనుకునేవారని.. ఇప్పుడు దీన్ని ‘‘ అవినీతిలేని’’ రాష్ట్రమని చెప్పుకుంటున్నారని అన్నారు. అంతకుముందు సీఎం అంటే ‘‘మ్యూజికల్ చైర్’’ ఆటలా ఉండేదని… ఫడ్నవీస్ మాత్రం రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించారని నడ్డా చెప్పారు. మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమంలో సీఎం ఫడ్నవీస్, బీజేపీ స్టేట్ చీఫ్ చంద్రకాంత్ పాటిల్, ముంబై యూనిట్ చీఫ్ మంగల్ ప్రభాత్ లోథా పాల్గొన్నారు.
మేనిఫెస్టోలో మరికొన్ని హామీలు
రాష్ట్ర ఎకానమీని ట్రిలియన్ యూఎస్ డాలర్లకు తీసుకెళ్లడం.
జాతీయ, రాష్ట్ర హైవేల మెయింటనెన్స్ కోసం సెపరేట్ డిపార్ట్‌మెంట్ల ఏర్పాటు.
రూ.16 వేల కోట్లతో మరాట్వాడా తాగునీటి గ్రిడ్ ప్రాజెక్ట్.
మరాట్వాడాలో 11 డ్యామ్‌లను లింక్ చేయడం.
