కేసీఆర్ జనాల్ని కాదు.. పైసల్ని నమ్ముకుండు 

కేసీఆర్ జనాల్ని కాదు.. పైసల్ని నమ్ముకుండు 

వరంగల్ అర్బన్: ఎన్నికల్లో గెలవడానికి సీఎం కేసీఆర్ ప్రజలను గాక డబ్బులను నమ్ముకున్నారని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వరంగల్‌లో 30వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రచార వేగాన్ని పెంచింది. సోమవారం నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న కిషన్ రెడ్డి.. కేసీఆర్ సర్కార్‌‌‌పై విమర్శలకు దిగారు. కేసీఆర్ ప్రభుత్వం చేతాగానితనం వల్లే వరంగల్‌‌‌కు వచ్చిన POH పరిశ్రమ నిర్మాణం  జరగలేదని దుయ్యబట్టారు. తెలంగాణలో మోడీ ప్రభుత్వం అత్యధిక నిధులు వరంగల్ అభివృద్ధికే కేటాయించిందని తెలిపారు. 

‘బీజేపీ వరంగల్ అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఎలక్షన్లలో పంచడానికి కేసీఆర్ దగ్గర డబ్బులున్నాయి కానీ వరంగల్ అభివృద్ధికి మాత్రం నిధులు లేవట. అవినీతి డబ్బుతో టీఆరెస్ గెలవాలని అనుకుంటోంది. తండ్రీ కొడుకుల ప్రభుత్వం వరంగల్ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు యత్నిస్తోంది. అవినీతిని అరికట్టాలన్నా, వరంగల్‌‌ను అన్ని విధాలుగా డెవలప్ చేయాలన్నా బీజేపీ మేయర్ గెలవాలి. వరంగల్ రూపురేఖలు మారాలంటే ఇక్కడకు విమానాశ్రయం రావాలి. గత ఐదేళ్లుగా ఎయిర్ పోర్ట్‌‌కు భూమి కేటాయించకుండా, రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయం నిర్మాణాన్ని అడ్డుకుంటోంది. ఎయిర్ పోర్ట్ స్థలం చుట్టూ భూములు కొనుగోలు చేసిన టీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటున్నారు. వరంగల్‌‌కు కేసీఆర్ ఏం చేశాడో చెప్పాలి? కనీసం రింగ్ రోడ్డు కూడా వేయలేదు. వరంగల్ ప్రజలను ఓట్లు అడిగే హక్కు TRSకు లేదు’ అని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.