ఉపాధి కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటా : కూన శ్రీశైలం గౌడ్

ఉపాధి కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటా : కూన శ్రీశైలం గౌడ్
  • కుత్బుల్లాపూర్ సెగ్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్

జీడిమెట్ల, వెలుగు : కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే ఉపాధి కోసం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ తెలిపారు. సెగ్మెంట్ లోని పలు ప్రాంతాల్లో బుధవారం ఆయన పర్యటించారు. బీజేపీకి ఓటేయాలని కోరారు. అనంతరం కల్పనా సొసైటీలో ఏర్పాటు చేసిన సభలో కుత్బుల్లాపూర్ కాపు సేవా సమితి శ్రీశైలం గౌడ్​కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ జైత్రయాత్ర కుత్బుల్లాపూర్ నుంచే ప్రారంభమవుతుందన్నారు. బీజేపీకి పవన్​కల్యాణ్ కొండంత బలంగా మారారని ఆయన పేర్కొన్నారు.

బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణలో ఓసీగా ఉన్న 26 కులాలను బీసీ జాబితాలోకి చేర్చే బాధ్యతను తాను తీసుకుంటానని కూన శ్రీశైలం గౌడ్ హామీ ఇచ్చారు. జనాలను మోసం చేయడంలో బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద ఆరితేరిన వ్యక్తి అని ఆరోపించారు. కుత్బుల్లాపూర్​లో బీఆర్ఎస్ మూడోస్థానంలో ఉంటుందని సర్వేలు తెలిపాయన్నారు.సెగ్మెంట్ వాసుల ఆశీస్సులతో బీజేపీ, జనసేనకార్యకర్తల అండతో ఎన్నికల్లో 50 వేలకు పైగా మెజార్టీతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.