కేసీఆర్‌ జాతీయ పర్యటనపై ఈటల ఫైర్‌

కేసీఆర్‌ జాతీయ పర్యటనపై ఈటల ఫైర్‌

హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సీఎం కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఢిల్లీ వెళ్లారు.  ఇక కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. ఓ వైపు రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే... జాతీయ పర్యటన పేరుతో పాలనను గాలికొదిలేశారని మండిపడ్డారు. ఇక్కడ పాలన చేత కాక ప్రజల డబ్బుతో విమానాల్లో తిరుగుతూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని బంగారు మయం చేసిన కేసీఆర్... ఇక దేశాన్ని బాగు చేయడానికి బయల్దేరారని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్న ఆయన... కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని విమర్శించారు.  గత్యంతరం లేక మద్యం రేట్లు పెంచుతూ ప్రజలపై ఆర్ధిక భారం మోపుతున్నారని ఫైర్ అయ్యారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు, బస్సు ఛార్జీలు... ఇలా ఛార్జీల మీద ఛార్జీలు పెంచుతో ప్రజల నడ్డి విరుస్తున్నారని ధ్వజమెత్తారు. మధ్యాహ్న భోజనం వండిన మహిళలకు ఇంతవరకు వేతనాలు చెల్లించలేదని దుయ్యబట్టారు. ముందుగా రాష్ట్రాన్ని బాగు చేసి... తర్వాత దేశమంతా తిరగాలని కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. 

మరిన్ని వార్తల కోసం...

నిఖత్ జరీన్ కు అభినందనల వెల్లువ

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న చెన్నై

పోలీసు ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు