
- ఇందూరు బిడ్డ.. బంగారు కొండ
- వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్
- ఈ ఘనత సాధించిన తెలంగాణ బాక్సర్ గా రికార్డు
- వరల్డ్ ఛాంపియన్ షిప్ లో నిఖత్ జరీన్ కు బంగారు పతకం
- బాక్సింగ్ క్వీన్
ఇండియా యువ బాక్సర్, తెలంగాణ ఆడ బిడ్డ నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. తన పంచ్ పవర్‌తో ప్రపంచ వేదికపై మన తిరంగాను రెపరెపలాడించింది. అసమాన ప్రతిభతో విమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించింది. ఇస్తాంబుల్ వేదికగా గురువారం జరిగిన 52 కేజీల కేటగిరీ ఫైనల్లో నిఖత్ 5–0తో థాయ్‌లాండ్ బాక్సర్ జిట్‌పాంగ్ జుటామస్‌ను చిత్తుగా ఓడించింది. ఏకపక్షంగా సాగిన బౌట్‌లో ప్రతీ రౌండ్‌లో తన పంచ్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. తెలంగాణ నుంచి వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా నిలిచిన తొలి క్రీడాకారిణిగా.. ఇండియా నుంచి ఈ ఘనత సాధించిన ఐదో బాక్సర్‌గా చరిత్రకెక్కింది. లెజెండరీ బాక్సర్లు మేరీకోమ్, సరితా దేవి తదితరుల సరసన చేరింది. ఇందూరు గడ్డపై సాధారణ ముస్లిం కుటుంబంలో పుట్టి.. భాగ్యనగరంలో బాక్సర్‌గా ఎదిగిన నిఖత్ తెలంగాణ బంగారు కొండ.. పాతికేళ్లకే బాక్సింగ్ ప్రపంచాన్ని గెలిచిన సిసలైన విశ్వవిజేత.
అపలె అమ్మాయికి ఆటలెందుకన్నారు.. ! కానీ, ఆమె క్రీడాకారిణి అవ్వాలనుకుంది..! బాక్సింగ్ ఆడితే ముఖానికి దెబ్బలు తగులుతాయి ఎవ్వరూ పెండ్లి చేసుకోరని భయపెట్టారు.. ! కానీ, తన పంచ్ పవర్ చూపెడుతూ నేషనల్, ఇంటర్నేషనల్ టోర్నీల్లో పతకాలు నెగ్గింది.. ! కొన్నేళ్లకు ఇక ఆడింది చాలు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం తెచ్చుకుంటే మంచి సంబంధం వస్తుందని బంధువులు సలహాలిచ్చారు.. ! వాళ్లు చెప్పినట్లే ఆమె ఉద్యోగం తెచ్చుకుంది. కానీ పతకాల వేటను కొనసాగిస్తూనే ఉంది.. లెజెండరీ బాక్సర్ మేరీకోమ్ తోనే ట్రయల్స్ పెట్టాలని అంటుందా ? ఆమెకు అంత సీన్ ఉందా ? అని ఎగతాళి చేశారు.. కానీ మేరీకే సాధ్యం కాని రీతిలో ప్రతిష్టాత్మక స్ట్రాంజా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్ లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించింది. ఇదంతా తెలంగాణ బంగారు కొండ నిఖత్ జరీన్ గురించే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ ఆరంభం నుంచి ప్రతి దశలో సవాళ్లను ఎదుర్కొన్న నిఖత్ కష్టాలకు పంచ్ ఇస్తూ ముందుకొచ్చింది.. అదే జోరును కొనసాగిస్తూ.. ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్ షిప్ లో బంగారు కల నెరవేర్చుకుంది.. మన నిఖత్ జరీన్ ఇప్పుడు వరల్డ్ బాక్సింగ్ క్వీన్..
ఇస్తాంబుల్: తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ అనుకున్నది సాధించింది. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకం సాధించి తన కల నెరవేర్చుకుంది. గురువారం జరిగిన 52 కేజీల విభాగం ఫైనల్ బౌట్ లో 5 - 0 తేడాతో థాయ్ లాండ్ దేశానికి చెందిన బాక్సర్ జిట్ పాంగ్ జుటామస్ ను ఓండించి ప్రపంచ ఛాంపియన్ అయ్యింది. ఈ టోర్నీలో ఇండియాకు ఇది మూడో పతకం. సెమీ ఫైనల్స్ లో ఓడిన మనీషా (57 కేజీ) పర్వీన్ (63 కేజీ) లు బ్రాంజ్ మెడల్స్ సాధించారు. బంగారు పతకంతోపాటు నిఖత్ లక్ష డాలర్ల ప్రైజ్ మనీ (రూ.77 లక్షలు) గెలుచుకోగా.. మనీషా పర్వీన్ చెరో 25వేల డాలర్ల (రూ.19 లక్షలు) అందుకున్నారు.
అంతా నిఖత్ పక్షమే
ఈ టోర్నీలో ఆడిన ప్రతీ బౌట్ లో ఏకగ్రీవ విజయాలతో టైటిల్ ఫైట్ కు దూసుకొచ్చిన నిఖత్ ఆఖరాట లోనూ అదే జోరు కొనసాగించింది. ఫైనల్ బౌట్ లో నిఖత్ ఆది నుంచి ఆధిపత్యం చూపెట్టింది. వరల్డ్ ఛాంపియన్ షిప్ లో మూడుసార్లు పతకం గెలిచిన కజకిస్తాన్ బాక్సర్ జైనాను ఓడించి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఫైనల్ కు వచ్చిన జుటామన్ కు ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు.
మొదటి రౌండ్ గంట మోగగానే ఆమెపై పదునైన పంచ్ లు కొట్టి డిఫెన్స్ లోకి నెట్టేసింది. తన లాంగ్ రీచ్ ను సద్వినియోగం చేసుకుంటూ థాయ్ బాక్సర్ పై ఆధిపత్యం చెలాయించింది. రెండో రౌండ్ లో జుటామన్ కౌంటర్ అటాక్ కు ప్రయత్నించింది. కానీ నిఖత్ రింగ్ లోపాదరసంలా కదలడంతో ఆమె షాట్లు కనెక్ట్ అవ్వలేదు. అటు ఎటాక్, డిఫెన్స్ లో ఫుల్ కట్ రోల్ లో ఉన్న జరీన్.. స్ట్రెయిట్, క్లియర్ పంచులు విసిరింది. రెండు రౌండ్లలో తనదే ఆధిపత్యం అవడంత మూడో రౌండ్ ఆరంభంలో కాస్త జాగ్రత్తగా ఆడినప్పటికీ.. చివర్లో మళ్లీ వరుస పంచ్ లు విసిరి సులువుగా విజయం సాధించింది.
నా టార్గెట్ ఒలింపిక్ గోల్డ్
వరల్డ్ చాంపియన్ అవ్వాలన్న నా లక్ష్యం నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ పతకాన్ని దేశ ప్రజలందరికీ, ఇన్నేళ్లు నాకు మద్దతుగా నిలిచిన వాళ్లకు అంకితం చేస్తున్నా. నేను ఇక్కడితో ఆగిపోను. ఇకపై మరింత కష్టపడతా. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ నెగ్గడమే నా టార్గెట్. దాన్ని అందుకునేందుకు శక్తిమేరకు ప్రయత్నిస్తా. 2017లో భుజం గాయం అయిన తర్వాత చాలా కష్టపడి తిరిగొచ్చా. అప్పటి నుంచి ఏ పరిస్థితుల్లో అయినా పాజిటివ్‌గా ఉండటం అలవాటు చేసుకున్నా. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయిన తర్వాత నా ఆటను పూర్తిగా మార్చుకున్నా. మెంటల్‌గా స్ట్రాంగ్ అయ్యా. టెక్నిక్‌ను మెరుగు పరుచుకున్నా.. ఫలితమే ఈ మెడల్. వరల్డ్ చాంపియన్‌షిప్ అయ్యాక ట్విట్టర్‌లో నేను ట్రెండింగ్‌లో ఉన్నానంటే నమ్మలేకపోతున్నా. ఓ రోజు ట్రెండింగ్‌లో ఉండాలన్నది నా కల అది నెరవేరినందుకు హ్యాపీ. ‑ నిఖత్ జరీన్
ఇంతకూ ఈ నిఖత్ ఎవరు..?
సరిగ్గా మూడేండ్ల కిందట లెజెండరీ బాక్సర్ ఎంసీ మేరీకోమ్‌ను సెలక్షన్ ట్రయల్స్ ఆడించకుండా బాక్సింగ్ ఫెడరేషన్ నేరుగా వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌నకు ఎంపిక చేసింది. ఇదే వెయిట్ కేటగిరీలో బెర్తు ఆశించిన నిఖత్ జరీన్ ఫెడరేషన్ నిర్ణయాన్ని సవాల్ చేసింది. అప్పటికే మంచి బాక్సర్‌గా పేరు తెచ్చుకున్న ఆమె ట్రయల్స్ నిర్వహించాలని కేంద్ర క్రీడా శాఖను ఆశ్రయించింది. అదే విషయాన్ని మేరీకోమ్ వద్ద ప్రస్తావిస్తే.. ‘నిఖత్ జరీన్ ఎవరు?’ అని ప్రశ్నించిందామె. అలా అడగడంలో అసహనం ఉంది. వ్యంగ్యం ఉంది. ‘నన్నే పోటీ పడమంటారా?’ అన్న కోపం ఉంది. మూడేండ్లు గిర్రున తిరిగాయి. ఈసారి వరల్డ్ చాంపియన్ షిప్‌కు మేరీ కోమ్ దూరమైంది. ఇదే సమయంలో నాడు మేరీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పింది జరీన్. కాకపోతే మాటతో కాదు ఆటతో!
(వెలుగు స్పోర్ట్స్ డెస్క్)
నిజామాబాద్ పట్టణంలో సాధారణ ముస్లిం కుటుంబంలో పుట్టిన నిఖత్ బాక్సర్‌గా మారడమే అనూహ్యం. ఎందుకంటే స్కూల్ ఏజ్‌లో ఆమె అథ్లెటిక్స్‌లో పోటీ పడింది. కానీ, ఓ రోజు బాక్సింగ్ పోటీలు జరుగుతున్న స్టేడియంలోకి వెళ్లిన ఆమెకు అక్కడ అంతా అబ్బాయిలే కనిపించారు. ‘బాక్సింగ్ రింగ్‌లో ఒక్క అమ్మాయి కూడా లేదేంటి’ అని తన తండ్రి జమీల్‌ను అమాయకంగా ప్రశ్నించిందామె. కొంత మంది ఉన్నా.. ఈ ఆటలో దెబ్బలు తగులుతాయని వాళ్లను ఎంకరేజ్ చేయడం లేదని జమీల్ చెప్పాడు. అప్పుడే బాక్సింగ్ ఆడాలని నిఖత్ డిసైడైంది. అలా 13 ఏళ్ల వయసులో నిఖత్ బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది.
కానీ, ఇరుగు పొరుగు, బంధువులు ‘మన మతం అమ్మాయిలకు బాక్సింగ్ అవసరమా? ఆమెను అంత పొట్టి బట్టలు ఎలా వేసుకోనిస్తున్నారు? అంటూ నిఖత్ తండ్రి జమీల్‌ను ప్రశ్నించారు. కానీ, వాటిని పట్టించుకోని జమీల్ తన కూతురును పెద్ద బాక్సర్‌ను చేయాలని కలగన్నాడు. మంచి కోచింగ్ కోసం తన కుటుంబాన్ని హైదరాబాద్ తీసుకొచ్చాడు. ఆటపైనే ఫోకస్ పెట్టాలని నిఖత్‌ను ఎంకరేజ్ చేశాడు. తండ్రి సపోర్ట్‌తో 2010లో కాంపిటీటివ్ పోటీల్లోకి వచ్చిన నిఖత్ తర్వాతి ఏడాదే జూనియర్ నేషనల్స్‌లో గోల్డ్ నెగ్గింది. 2011లోనే జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ప్లై వెయిట్ డివిజన్‌లో గోల్డ్ మెడల్‌తో మంచి పేరు తెచ్చుకుంది. అంతే, అప్పటిదాకా నిఖత్‌ను ప్రశ్నించిన బంధువులంతా ఆమెను ప్రశంసల్లో ముంచెత్తారు.
వెంటాడిన మేరీకోమ్ నీడ
నిఖత్ జరీన్‌కు లెజెండరీ బాక్సర్ ఎంసీ మేరీకోమ్ స్ఫూర్తి. ఆమెను ఆదర్శంగా తీసుకొని ఆటలో తనదైన ముద్ర వేయడం ప్రారంభించింది. కెరీర్ ఆరంభంలోనే నిఖత్‌కు జూనియర్ మేరీకోమ్ అనే పేరొచ్చింది. కానీ, ఆ పేరు.. మేరీతో పోలికే నిఖత్‌కు శాపమైంది. జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్ తర్వాత ఈ హైదరాబాదీ యంగ్‌స్టర్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో అనుకున్నంతగా రాణించలేకపోయింది. పైగా, 2017లో భుజం గాయం జరీన్ కెరీర్‌ను ప్రమాదంలోకి నెట్టింది.
ఏడాది పాటు ఆటకు దూరం అవ్వాల్సి వచ్చింది. కానీ, 2019లో థాయ్‌లాండ్ ఓపెన్‌లో సిల్వర్‌తో పాటు స్ట్రాంజా మెమోరియల్ టోర్నీలో గోల్డ్‌తో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చింది. అంతా సాఫీగా సాగుతుందనుకున్న టైమ్‌లో తన ఆరాధ్య బాక్సర్ మేరీకోమ్ రూపంలో నిఖత్‌కు అసలైన సవాల్ ఎదురైంది. ఒలింపిక్స్ కోసం 48 కేజీ వెయిట్ డివిజన్ నుంచి ఫ్లై వెయిట్ (నిఖత్ పోటీపడే విభాగం)కు మారిన మేరీని బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నేరుగా 2019 వరల్డ్ చాంపియన్‌షిప్స్‌కు ఎంపిక చేసింది.
అందులో గోల్డ్, సిల్వర్ నెగ్గిన వాళ్లు నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారని చెప్పింది. అయితే, సెలక్షన్ ట్రయల్స్ పెట్టాల్సిందే అన్న నిఖత్‌పై చాలా మంది కన్నెర్రజేశారు. లెజెండరీ మేరీకోమ్‌నే సవాల్ చేస్తుందా? ఆమెకు అంత సీన్ ఉందా? అని ప్రశ్నించారు. మేరీ అయితే.. అసలు నిఖత్ ఎవరు? అంటూ ఎగతాలి చేసింది. కానీ, మీడియా నిఖత్‌వైపు నిలవడంతో సెలక్షన్ నిర్వహించక తప్పలేదు. అందులో తెలంగాణ బాక్సర్‌ను ఓడించిన మేరీకోమ్ బౌట్ ముగిసిన తర్వాత నిఖత్‌కు కనీసం షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా అవమానించింది.
ఇదీ సమాధానం
ఆ ట్రయల్స్ తర్వాత కూడా నిఖత్ గురించి మేరీకోమ్ పలుమార్లు చులకనగా మాట్లాడింది. కానీ, తన ఆరాధ్య బాక్సర్‌ను పల్లెత్తు మాట అనని నిఖత్ ఆటతోనే సమాధానం చెప్పాలనుకుంది. విమర్శలను పట్టించుకోకుండా తన ఆటపైనే ఫోకస్ పెట్టింది. అప్పటికే మెంటల్ స్ట్రెంత్‌ను పెంచుకున్న ఆమె తన ఫిట్‌నెస్, టెక్నిక్‌ను కూడా మెరుగు పరుచుకోవడంపైనే దృష్టిసారించింది. ఈ క్రమంలో రెండు నెలల కిందట బల్గేరియాలో జరిగిన స్ట్రాంజా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో టోక్యో ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్, వరల్డ్ చాంపియన్‌షిప్ మెడలిస్ట్‌లను ఓడిస్తూ గోల్డ్ నెగ్గింది. స్ట్రాంజాలో రెండు స్వర్ణాలు సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డు సృష్టించింది.
అయినా, నిఖత్‌లో కసి తగ్గలేదు. తనేంటో ఈ ప్రపంచానికి చాటాలన్న పట్టుదలతో వరల్డ్ బాక్సింగ్‌లో గోల్డ్ మెడల్ గెలిచి ఔరా అనిపించింది. ‘నిఖత్ ఎవరు?’ అని ప్రశ్నించిన వాళ్లకు వరల్డ్ చాంపియన్ అనే సమాధానం ఇచ్చింది. ఇప్పుడు మేరీకోమ్ నీడ నుంచి నిఖత్ బయటపడింది. తనిప్పుడు జూనియర్ మేరీ కాదు.. నిఖత్ జరీన్. ఆమె అంతిమ లక్ష్యం ఒలింపిక్స్. 2024 పారిస్ ఒలింపిక్స్ కోసం కఠోరంగా శ్రమిస్తోంది. మేరీకోమ్‌కు కూడా సాధ్యం కాని ఒలింపిక్ గోల్డ్ మెడల్‌ను అందుకోవాలని ఆశిద్దాం..!
నిఖత్ ఘనతలు
2011 విమెన్స్ జూనియర్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్స్ లో గోల్డ్.
2014 యూత్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్స్ లో సిల్వర్
2014 నేషన్స్ కప్ ఇంటర్నేషనల్ టోర్నీలో గోల్డ్
2015 సీనియర్ విమెన్ నేషనల్ బాక్సింగ్ లో గోల్డ్
2019 థాయ్ లాండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ టోర్నీలో సిల్వర్
2019 స్ట్రాంజా మెమోరియల్ బాక్సింగ్ టోర్నీలో గోల్డ్
2022 స్ట్రాంజా మెమోరియల్ బాక్సింగ్ టోర్నీలో గోల్డ్
2022 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్
అభినందనల వెల్లువ
ఆర్థిక కష్టాలు వెంటాడిన వెనుకంజ వేయలేదు. కుటుంబంలో నలుగురు ఆడపిల్లలున్నా అధైర్యపడలేదు. తండ్రి ప్రోత్సాహంతో 12 ఏళ్ల వయసులో ఉత్సాహంగా బాక్సింగ్ రింగులోకి దిగింది. పతకాల పంచులతో ఇందూరు నుంచి ఇంటర్నేషనల్ వరకు ఎదిగింది. తాజాగా ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ ను సొంతం చేసుకుని చరిత్రను లిఖించింది. థాయిలాండ్ ప్లేయర్ జిట్‌పాండ్ జుటమాస్‌తో జరిగిన ఫైనల్ లో బంగారు పతకం సాధించింది. మొదటి బౌట్ లో నిఖత్ జరీన్ ఆధిక్యం కనపర్చింది. సెకండ్ బౌట్ లో ఇద్దరికి సమానంగా పాయింట్స్ వచ్చాయి. ముందునుంచి ప్రత్యర్థిపై పైచేయి సాధించిన నిఖత్ జరీన్ ప్రపంచ బ్యాక్సింగ్ చాంపియన్ గా నిలిచింది. ఈ సందర్భంగా నిఖత్ జరీన్ కు అభినందనల వెల్లువ కొనసాగుతోంది. ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు ఆమెకు స్పెషల్ విషెస్ చెప్పారు.
మన బాక్సర్లు మనల్ని గర్వపడేలా చేశారు. విమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్ కు అభినందనలు. ఇదే టోర్నీలో కాంస్య పతకాలు గెలిచిన మనీషా మౌన్, పర్వీన్ హుడాలకు కుడా నా శుభాకాంక్షలు. -నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి
మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో స్వర్ణ పతకం సాధించిన క్రీడాకారిణి నిఖత్ జరీన్ కు అభినందనలు. ఆమె సాధించిన ఈ విజయం దేశానికి గర్వకారణం. భవిష్యత్తులోనూ ఆమె ఇలాంటి మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ‑ వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి
ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్ షిప్ లో విజేతగా నిలిచిన మన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ కు హృదయపూర్వక శుభాభినం దనలు తెలియజేస్తున్నాను. ఎందరో మహిళల్లో స్ఫూర్తిని నింపేలా మీరు సాధించిన ఈ విజయం పట్ల దేశం గర్విస్తోంది. రాబోయే రోజుల్లో మరెన్నో విజయాలను మీరు సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నా. ‑ కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి
ప్రతిష్టాత్మక ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో విశ్వవిజేతగా నిలిచిన నిజామాబాద్ కు చెందిన నిఖత్ జరీన్ కు శుభాకాంక్షలు. భారత కీర్తి పతాకాన్ని విశ్వ క్రీడా వేదిక మీద ఎగరేసిన తెలంగాణ బిడ్డ నిఖత్ కు అభినందనలు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని నిఖత్ బాక్సింగ్ క్రీడలో విశ్వ విజేతగా నిలవడం గర్వించదగిన విషయం. క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తోంది. తెలంగాణలోని ప్రతీ గ్రామంలో గ్రామీణ క్రీడా కారులుగా ప్రాంగణాలను ఏర్పాటు చేసి, యువ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ‑ కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి