పోలీసు ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు

పోలీసు ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు

తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వయో పరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ.. దరఖాస్తు మే 20వ తేదీ చివరి తేదీ శుక్రవారం రోజునే ఈ నిర్ణయం తీసుకోవడంతో దరఖాస్తు దారుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో.. దరఖాస్తు గడువు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఈనెల 26వ తేదీ రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. వయో పరిమితిని పెంచడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 17 వేల 291 పోస్టులకు 10 లక్షల 60 వేల దరఖాస్తులు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు.

తెలంగాణలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడంతో పాటు, రెండేండ్ల  కరోనా కారణంగా, తెలంగాణ యువతీ యువకులకు వయోపరిమితిని పెంచాలని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సీఎం కేసీఆర్ కు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన సిఎం కెసిఆర్.. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డిజిపిని ఆదేశించారు.  పోలీసు, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, రవాణా శాఖల్లో ఉద్యోగాల భర్తీకి మే 02వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి నిరుద్యోగుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని సమాచారం. దరఖాస్తు చేసుకున్న వారికి తెలంగాణ పోలీసు శాఖ ఉచితంగా శిక్షణ ఇస్తోంది. 

మరిన్ని వార్తల కోసం : -

టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ ఫ్రీ సర్వీస్


పోలీసు ఉద్యోగార్థులకు శుభవార్త..