
హైదరాబాద్: సీఎం కేసీఆర్ రైతుల నుంచి ధాన్యం కొనాలని, లేకుంటే గద్దె దిగాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. బీజేపీ రైతు దీక్షలో పాల్గొన్న ఆయన.. ముఖ్యమంత్రి పరిపాలనను వదిలేసి దద్దమ్మలా ఢిల్లీలో ధర్నా ఎందుకు చేస్తున్నారో చెప్పాలని అన్నారు. ధాన్యం విషయంలో దేశంలో ఎక్కడాలేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వచ్చిందని ఈటల ప్రశ్నించారు. తెలంగాణలో పీకే ప్లాన్స్ పనిచేయవన్న ఆయన.. ఇక్కడ కేవలం ఆత్మగౌరవమే పనిచేస్తుందని అన్నారు. ఐదారు వేల కోట్లతో పంట కొనలేని అసమర్థ సీఎం కేసీఆర్ అని విమర్శించారు. పీకే రాకతోనే కేసీఆర్ పతనం ప్రారంభమైందన్న ఈటల.. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్ కు పిచ్చి పట్టిందని అన్నారు. గవర్నర్ విషయంలో టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటని ఈటల రాజేందర్ మండిపడ్డారు.