
ఇంఫాల్: ‘మణిపూర్‌లో ప్రస్తుతం 60 వేల కేంద్ర బలగాలు ఉన్నప్పటికీ కొన్నిచోట్ల గొడవలు జరుగుతూనే ఉన్నాయి. హింసను ఆపలేని బలగాలు మాకెందుకు?. వాటిని వెనక్కి తీసుకోండి’ అంటూ మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ ఇమో సింగ్ సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. రెండు వర్గాల మధ్య చెలరేగిన గొడవలతో మణిపూర్మొన్నటి వరకూ అట్టుడికింది. దాడులు ప్రతిదాడులతో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. దీనిని అరికట్టి రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం సైనిక బలగాలను పంపించింది. అస్సాం రైఫిల్స్ సహా వివిధ విభాగాలకు చెందిన 60 వేల మంది సైనికులు ప్రస్తుతం రాష్ట్రంలో శాంతిభద్రతలు పర్యవేక్షిస్తున్నారు.
అయినప్పటికీ కొన్నిచోట్ల హింస ఆగడంలేదని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించారు. గొడవలు చెలరేగినపుడు అడ్డుకోవాల్సిన బలగాలు మౌన ప్రేక్షకుడిలా మిగిలిపోతున్నాయని ఆరోపించారు. మణిపూర్‌లో శాంతిని నెలకొల్పే విషయంలో కేంద్రం, కేంద్ర బలగాలు విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గొడవలు, హింసను ఆపలేనపుడు ఆ బలగాలు మాత్రం ఉండెందుకని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలతో పొసగటం లేదంటూ అస్సాం రైఫిల్స్ బలగాలను మణిపూర్ నుంచి తరలించే ప్రయత్నం జరిగిందని గుర్తుచేశారు. అస్సాం రైఫిల్స్‌తో పాటు ఇతర బలగాలను కూడా వెనక్కి పిలిపించుకుంటే సంతోషిస్తామని రాజ్ కుమార్ చెప్పారు. ఈ విషయంలో సీఎం బీరేన్ సింగ్‌కు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని, బాధ్యత మొత్తం ఆయనకే అప్పజెప్పాలని డిమాండ్ చేశారు.