టీఆర్ఎస్ వైఫల్యాలపై కమిటీ వేసినం: ఎంపీ అర్వింద్

టీఆర్ఎస్ వైఫల్యాలపై కమిటీ వేసినం: ఎంపీ అర్వింద్

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై బీజేపీ కమిటీ వేసిందని నిజామాబాద్​ ఎంపీ అర్వింద్ అన్నారు. ఈ కమిటీ నివేదిక మరో నెల రోజుల్లో రానుందని చెప్పారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, పాలనపై జాతీయంగా, అంతర్జాతీయంగా పరిశీలిస్తున్నామని అన్నారు. ప్రజలకు మంచి చేసే మనసు కేసీఆర్‭కు లేదని ఆరోపించారు. 

టీఆర్ఎస్ పై ఛార్జిషీట్ దాఖలు చేయడానికి కమిటీ నివేదిక కీలకమని ఎంపీ అర్వింద్ అన్నారు. ప్రజాధనం, ప్రజలను దోచుకోవడం తప్ప ప్రభుత్వానికి దేనిపైనా చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు. విద్యుత్ రంగం వైఫల్యాలపై ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టామని చెప్పారు. ఆ ప్రెస్ మీట్ తర్వాతనే తన ఇంటిపై దాడి చేయించారని అర్వింద్ మండిపడ్డారు. రైతులను కూలీలుగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని చెప్పారు. గ్రామాల్లో 6 నుంచి 10 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారని విమర్శించారు. అప్పులు చేస్తూ విద్యుత్ కొంటున్నారని.. ఆ కొనుగోళ్లలో కూడా కుంభకోణం చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ కుంభకోణంలో వచ్చిన డబ్బులతో లిక్కర్ స్కాం, ఫీనిక్స్ లలో పెట్టుబడులు పెడుతున్నారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు.