కేసీఆర్వి ఓటు బ్యాంక్ రాజకీయాలు

కేసీఆర్వి ఓటు బ్యాంక్ రాజకీయాలు

నిజామాబాద్: రైతు బంధుతో రాష్ట్ర రైతులను కేసీఆర్ మభ్యపెడుతున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో దుబ్బాకలో జరిగిన రైతు ధర్నాలో ఎంపీ అర్వింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ పాలనలో రైతులు ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తోందని, వడ్ల కొనుగోళ్లలో కేసీఆర్ ప్రభుత్వం నయా పైసా ఖర్చు పెట్టలేదని చెప్పారు. ఫసల్ బీమా యోజనను అమలు చేయకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారని కేసీఆర్ పై మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన బియ్యంతో బ్లాక్ మార్కెట్ దందాకు పాల్పడిన దుర్మార్గులు టీఆర్ఎస్ నాయకులని ఫైర్ అయ్యారు. ఇటీవలి వరదలకు రైతులు ఇబ్బందులు పడుతోంటే అవేమీ పట్టించుకోకుండా సీఎం కేసీఆర్, మంత్రులు జల్సా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ వి ఓటు బ్యాంక్ రాజకీయాలన్న అర్వింద్... రైతు రాజ్యం మోడీతోనే సాధ్యమని చెప్పారు. 

తాను ఎంపీ అయ్యాకే పసుపు రైతులకు మేలు...

తనకంటే ముందు ఎంపీగా ఉన్న కల్వకుంట్ల కవిత పసుపు బోర్డు పేరుతో కాలయాపన చేసిందని, కానీ తాను ఎంపీగా గెలిచిన 5 నెలల్లోనే పసుపు రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్రాన్ని ఒప్పించానని బీజేపీ ఎంపీ అర్వింద్ చెప్పారు. దిగుమతులు తగ్గించి నిజామాబాద్ నుంచి విదేశాలకు పసుపును ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. పసుపుకు అధిక మద్దతు ధర ఇవ్వడంతోపాటు పెద్ద మొత్తంలో బాయిలర్లు, టార్పాలిన్లు ఇచ్చామన్నారు. స్పైస్ బోర్డు ఎక్సెటెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసి రూ.30 కోట్ల నిధులు తెచ్చానని అర్వింద్ పేర్కొన్నారు. తనకంటే ముందు ఎంపీగా ఉన్న కల్వకుంట్ల కవిత పసుపు బోర్డు పేరుతో కాలయాపన చేసిందని మండిపడ్డారు. బాల్కొండ నియోజకవర్గ పసుపు రైతులకు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.