ప్రగతి భవన్​ నుంచి కేటీఆర్​ స్కెచ్​ వేసిండు

V6 Velugu Posted on Jan 27, 2022

హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్ష పార్టీల లీడర్లకు రక్షణ లేకుండాపోయిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్​ మండిపడ్డారు. మంగళవారం తనపై నిజామాబాద్ జిల్లా ఆర్మూర్​ నియోజకవర్గంలో టీఆర్ఎస్  కేడర్​ చేసిన దాడి విషయాన్ని కేంద్ర హోంమంత్రి, లోక్ సభ స్పీకర్  దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ దాడికి ప్రగతిభవన్​ వేదికగా కేటీఆర్​ స్కెచ్​ వేశారని, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, పోలీసు కమిషనర్ కలిసి దాడి చేయించారని ఆయన ఆరోపించారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో అర్వింద్​ మీడియాతో మాట్లాడారు. తనపై దాడి జరుగబోతుందని ముందుగానే పోలీసు కమిషనర్ కు సమాచారం ఇచ్చినా ఆయన స్పందించలేదని, తన ప్రాణం తీయడానికి పోలీసులు ప్లాన్ చేశారని ఆరోపించారు. రిపబ్లిక్ డే రోజున ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదన్నారు. ‘‘పసుపు రైతుల పేరుమీద నన్ను అడ్డుకునే కుట్ర చేశారు. మంగళవారం నాటి గొడవతో తమకు ఎలాంటి సంబంధం లేదని పసుపురైతు ఐక్య వేదిక ప్రకటన విడుదల చేసింది. దాడికి పాల్పడింది రాము, మ్యూనిరొద్దిన్ తో పాటు మరి కొందరు ఉన్నారు. దాడి చేసేందుకు హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి 25 మందిని తీసుకువచ్చారు. వీరందరిని అక్కడికి తీసుకురావడంలో నాకు గతంలో ఇల్లు అమ్మిన వ్యక్తి ఉన్నడు” అని తెలిపారు. దాడికి పాల్పడిన రాము అనే వ్యక్తి కేటీఆర్ తో కలిసి ఉన్న ఫొటోను అర్వింద్​ మీడియాకు చూపించారు. దాడి జరిగిన స్థలంలో టీఆర్ఎస్ ఎంపీటీసీలు,- సర్పంచ్ లు, ఆ పార్టీ కార్యకర్తలు ఉన్నారని, ఆందోళనకారులను కనీసం అక్కడి నుంచి పంపించే ప్రయత్నం కూడా పోలీసులు చేయలేదని మండిపడ్డారు. ‘‘సీఎం కేసీఆర్... ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇంట్లోని పనోళ్ల లెక్క చూస్తున్నరు. కేసీఆర్ లాంటి సీఎంలు ఉన్నంత వరకు మంచి పేరు సంపాదించుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి వంటి అధికారులు ఇలానే తయారవుతరు” అని దుయ్యబట్టారు. ఆర్మూర్ ప్రాంతంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందని, దీని వెనుక- ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఆర్మూర్  నుంచి పోటీ చేసేందుకు ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు పెట్టుకుంటానన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి 80 స్థానాలు వస్తాయని తమ సర్వేలో తేలిందని చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో 175 మంది నామినేషన్ వేసిన పసుపు రైతుల దగ్గరికి సీఎం కేసీఆర్ ను తీసుకొచ్చే దమ్ము ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. ‘‘జీవన్ రెడ్డీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను పసుపు రైతుల దగ్గరకు తీసుకువస్తే- నేను ఒక్కడ్నే అక్కడికి వస్తా” అని ఆయన సవాల్​ విసిరారు. 
 

Tagged Notice, BJP MP Dharmapuri Arvind, union home minister, Lok Sabha Speaker, TRS cadre attack Armor

Latest Videos

Subscribe Now

More News