నో టికెట్... సోయం బాపూరావు సంచలన వ్యాఖ్యలు

 నో టికెట్...  సోయం బాపూరావు సంచలన వ్యాఖ్యలు

ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు లోక్​సభ టికెట్ రాకుండా కొంతమంది పార్టీ లీడర్లు అడ్డుకుంటున్నారని ఆరోపించారాయన. మార్చి 2వ తేదీ శనివారం సాయంత్రం 195మంది ఎంపీ అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి తొమ్మిది పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. మరో ఎనిమిది స్థానాలను పెండింగ్ పెట్టింది. అయితే, తొమ్మిది మందిలో ఎంపీ సోయం బాపూరావుకు చోటు దక్కలేదు. ఈక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బీజేపీ ఫస్ట్​లీస్టులో నాకు టికెట్ దక్కకుండా పార్టీ అగ్రనేతలే కుట్ర చేస్తూ అడ్డుపడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 ఆదివాసీ నేతనైనా తనకు టికెట్ దక్కకుండా కొంతమంది నేతలు పావులు కదిపారని బాపూరావు ఫైర్ అయ్యారు. తాను ఎక్కడ గెలుస్తానో అనే భయం వాళ్లకు పట్టుకుందని.. తాను కొమ్మపై ఆధారపడిన పక్షిని కాదు.. రెక్కల మీద ఆధారపడిన పక్షిని.. స్వతహాగా ఎదిగిన వ్యక్తినన్నారాయన. 2019లో ‌టికెట్ ఇస్తా అంటే పారిపోయిన నేతలే టికెట్ కోసం ఇప్పుడు పోటీపడుతున్నరన్నారు. ఏ బలం లేని సమయంలో తన సొంత బలంతో బీజేపీకి విజయం అందించానని చెప్పారు.

 జెడ్పీటీసీలను, ఎంపీపీలను, చివరికి నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించానని.. తన బలం, బలగం కావాలనుకుంటే పార్టీ టికెట్‌ ఇస్తుందని ఎంపీ అన్నారు. రెండో లిస్ట్‌లో తనకు టికెట్‌ వస్తుందని భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు.  టికెట్ రాకుంటే తన దారి తాను చూసుకుంటనని చెప్పారు. ఎవరికీ తలొగ్గేది లేదు.. ఆదిలాబాద్ ఎంపీ సీటు తనదే.. గెలిచేది తానే.. పార్టీ ఏదనేది అధిష్ఠానం ఆలోచించుకోవాలని సోయం బాపూరావు స్పష్టంచేశారు.