హత్యలతో నిరసనలను అణచివేయలేరు: బీజేపీ ఎంపీ

హత్యలతో నిరసనలను అణచివేయలేరు: బీజేపీ ఎంపీ

ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌ ఖేరీ‌లో రైతు నిరసనలపై కారు దూసుకెళ్లిన ఘటనకు సంబంధించి మరోసారి బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ స్పందించారు. రెండ్రోజుల క్రితం ఆ ఘటన వీడియో ఫోన్ స్క్రీన్‌ రికార్డును తన ట్విట్టర్‌‌లో పోస్ట్ చేసి మనసు కదిలిపోయింది.. దీనికి కారణమైన వాళ్లను తక్షణం అరెస్ట్ చేయాలి అంటూ డిమాండ్‌ చేసిన ఆయన.. ఇవాళ క్లిస్టల్ క్లియర్ వీడియో అంటూ ట్వీట్ చేశారు. కారు దూసుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా తెలుస్తున్న వీడియోతో పాటు.. హత్యలతో నిరసనకారుల గొంతు నొక్కడం వీలు కాదంటూ వరుణ్ గాంధీ పోస్ట్ చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమాయక రైతులకు న్యాయం జరగాలని కోరారు. ఈ విషయంలో ఆలస్యం తగదని, ప్రతి రైతు మనసులో క్రూరత్వం గూడుకట్టుకునేలోపే జవాబుదారీతనంతో వ్యవహరించాలని హెచ్చరించారు.

ఆదివారం నాడు లఖీంపూర్‌‌లో నిరసనలు చేస్తున్న రైతులపై నుంచి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్‌లోని వాహనం దూసుకెళ్లడం, ఆ తర్వాత హింస చెలరేగడంతో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్టు చేయకపోవడంపై పలు రాజకీయ పార్టీల నేతలు యూపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రాపై మర్డర్ కేసు నమోదు చేసినప్పటికీ ఇంకా అరెస్టు చేయలేదని తప్పుబడుతున్నారు. మరోవైపు ఈ ఘటనకు కారణమైన కారు తనదేనని, అయితే అందులో తన కొడుకు గానీ, తాను గానీ లేమని అజయ్ మిశ్రా చెబుతున్నారు. అయితే వచ్చే ఏడాదిలో ఎన్నికలు ఉన్న యూపీలో ఈ ఘటనపై సొంత పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఒక్కరు మాత్రం నిరసనకారుల తరఫున గళం విప్పడం సంచలనంగా మారుతోంది.

మరిన్ని వార్తల కోసం..

కశ్మీర్‌‌లో ప్రభుత్వ స్కూల్‌లో ఉగ్రదాడి.. ఇద్దరు టీచర్ల మృతి

బస్సు, ట్రక్కు ఢీ.. 9 మంది మృతి

హైదరాబాద్‌లో సెంచరీ దాటిన డీజిల్ ధర