
జగిత్యాల, వెలుగు: కమీషన్ల కోసమే సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించాడని, ప్రతి నెలా రూ.6 కోట్ల అప్పు తెచ్చి జీతాలిస్తున్నాడని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. రూ.60 వేల కోట్ల అప్పున్న రాష్ట్రాన్ని కేసీఆర్ రూ.5 లక్షల కోట్లకు చేర్చిండని, ప్రతి గ్రామంలో బెల్టు షాపులు పెట్టి ప్రజలను తాగుబోతులను చేసి ధనిక రాష్ట్రం అంటుండని మండిపడ్డారు. ఒకప్పుడు రూ.10 వేల కోట్ల లిక్కర్ ఆదాయం ఉంటే.. ఇప్పుడు రూ.40 వేల కోట్ల ఆదాయం వస్తోందని కేసీఆర్ గొప్పలు చెబుతున్నాడని విమర్శించారు. శనివారం జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్ మీటింగ్ లో వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.
కేసీఆర్ పని చేసేది కాంట్రాక్టర్ల కోసమే
కేసీఆర్ కాంట్రాక్టర్ల కోసమే పనిచేస్తున్నాడని, రూ.33 వేల కోట్లతో పూర్తయ్యే కాళేశ్వరం ప్రాజెక్టును రూ.లక్ష కోట్లకు పెంచాడని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. కాంట్రాక్టులన్నీ మేఘా కృష్ణారెడ్డికే ఇస్తున్నారని, హైదరాబాద్ లో కాంట్రాక్టులన్నీ ఆయనవేనని ఆరోపించారు. తెలంగాణ వచ్చాక అభివృద్ధి పనులేమో కానీ.. కల్వకుంట్ల ఫ్యామిలీ ఆస్తులు మాత్రం పెరిగాయన్నారు. ఈ అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలంటే బీజేపీతోనే సాధ్యమని, దీని కోసం పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ధర్మపురి అసెంబ్లీ పాలక్ సురభి నవీన్ రావు, రాష్ట్ర దళిత మోర్చా అధికార ప్రతినిధి కాడే సూర్యనారయణ, అసెంబ్లీ కన్వీనర్ కస్తూరి సత్యం, జిల్లా అధికార ప్రతినిధి మరిపెల్లి సత్యం, స్టేట్ స్వచ్ఛ భారత్ కన్వీనర్ మంచె రాజేశ్, బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గాజుల మల్లేశం, మండల అధ్యక్షులు గంగారాం, చక్రపాణి, శ్రీధర్, మహేష్, కొమురవెల్లి తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలే బీజేపీ బలం..
రాష్ట్రంలో 30 వేల బూత్ కమిటీలు ఉన్నాయని, జూన్ లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా కలిసి పని చేయాలని కార్యకర్తలకు వివేక్ సూచించారు. కార్యకర్తలే బీజేపీ బలమని, అందుకు దుబ్బాక ఉప ఎన్నికే ఉదాహరణ అని అన్నారు. బూత్ కమిటీలు, శక్తి కేంద్రాల దగ్గర నుంచి ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేసి వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు నడుం బిగించాలని చెప్పారు. రాష్ట్రాన్ని కేసీఆర్ కబంధ హస్తాల నుంచి విడిపించేలా కృషి చేసి, ధర్మపురిలో బీజేపీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.