
హైదరాబాద్, వెలుగు : సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఫైరయ్యారు. ప్రతిపక్ష కూటమి విషయంలో కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ చేసిన సంచలన కామెంట్స్ పై సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘2024లో ప్రతిపక్ష కూటమికి చైర్‌పర్సన్‌గా బాధ్యతలు ఇస్తే.. ఎన్నికల ప్రచారానికి అయ్యే మొత్తం ఖర్చు తానే భరిస్తానని సీఎం కేసీఆర్ అన్నాడంట. 4 కోట్ల జనాభా కలిగిన రాష్ట్రాన్ని 8 ఏండ్లలో ఎంత పీల్చి పిప్పి జేస్తే.. 140 కోట్ల జనాభా గల దేశం మొత్తానికయ్యే ఖర్చు భరించగలడు? తెలంగాణ సమాజమా.. ఓసారి ఆలోచించు..” అంటూ వివేక్ ట్వీట్ చేశారు.
టెన్త్ పేపర్ లీకేజీపై ఘటనపై వివేక్ మండిపడ్డారు. ‘‘నీకు బుద్ధి, జ్ఞానం ఎప్పుడొస్తుంది కేసీఆర్? తినేటప్పుడు, పండుకునేటప్పుడు కూడా రాజకీయం గురించే ఆలోచిస్తావ్. అసలు పరిపాలన అనేది గాలికి వదిలేశినవ్. ఇగో ఆ తాలూకు పర్యవసానాలే ఇవ్వన్నీ. పరిపాలన పక్కకి పెడితే ఏమేం జరుగుతాయో అన్నీ 4 ఏండ్లుగా రాష్ట్రంలో జరుగుతున్నాయి” అని విమర్శించారు. ఇప్పటికైనా ఈ చివరి 6 నెలలు నువ్వు మేల్కొనకపోతే ఏ తెలంగాణ నేల పేరు చెప్పి పదవిలోకి, పవర్ లోకి వచ్చావో.. అదే తెలంగాణ నేల కోపాగ్నిలో మాడి మసైపోతావ్ జాగ్రత్త అని హెచ్చరించారు.