మహారాష్ట్ర బీజేపీలో ట్విస్ట్‌.. పంకజా ముండే సంచలన కామెంట్స్‌

మహారాష్ట్ర బీజేపీలో ట్విస్ట్‌.. పంకజా ముండే సంచలన కామెంట్స్‌

ముంబై : మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తిగా మారాయి. మహారాష్ట్ర రాజకీయం అనేక మలుపుతు తిరుగుతున్న వేళ.. బీజేపీ జాతీయ కార్యదర్శి పంకజా ముండే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రెండు నెలలు సెలవు తీసుకుంటున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను పంకజా ముండే ఖండించారు. అజిత్‌ పవర్‌ వర్గం ప్రభుత్వంలో చేరడంపై చాలా మంది బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, భయం వల్ల వారు దీని గురించి మాట్లాడటం లేదన్నారు. 

కేంద్ర మాజీ మంత్రి గోపీనాథ్ ముండే కుమార్తె అయిన పంకజా ముండే మీడియాతో శుక్రవారం (జులై 7న) మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని తాను కలిసినట్లు ప్రసారం చేసిన ఛానెల్స్ పై పరువు నష్టం కేసు వేస్తానని చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్లు వదంతులు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. బీజేపీ సమావేశాలకు తనను ఆహ్వానించకపోవడం వల్లనే ఇలాంటి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తనను ఎందుకు విస్మరించారన్నది పార్టీనే సమాధానం చెప్పాలన్నారు.

తాను 20 ఏళ్లుగా పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేశానని, అయినా తన నీతిని ప్రశ్నిస్తున్నారని, పుకార్లు పుట్టిస్తున్నారని పంకజా ముండే ఆవేదన వ్యక్తం చేశారు. సోనియాగాంధీని, రాహుల్ గాంధీని ఎప్పుడూ కలువలేదని దీనిపై ప్రమాణం చేస్తానని అన్నారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. బీజేపీ సిద్ధాంతం తన రక్తంలో ఉందన్న పంకజా ముండే, అటల్ బిహారీ వాజ్‌పేయి, గోపీనాథ్ ముండే మార్గంలో తాను నడుస్తున్నట్లు తెలిపారు. రెండు నెలలు సెలవుపై వెళ్తున్నట్లు వెల్లడించారు.

అజిత్‌ పవార్‌ వర్గం ఎన్సీపీని వీడి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరింది. అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక అజిత్ పవార్‌ వర్గం బీజేపీ కూటమితో చేరడం పట్ల మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేతలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.