ప్రజల కోసం పనిచేస్తే తప్పకుండా పదవులు

ప్రజల కోసం పనిచేస్తే తప్పకుండా పదవులు

మునుగోడులో బీజేపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. నేతలు పదవుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తే పదవులు వాటంతట అవే వస్తాయన్నారు. బీజేపీలోకి ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకురావడంలో తాను కీలక పాత్ర పోషించానని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం హుజురాబాద్ లో ఈటల రాజేందర్ ను గెలిపించామన్నారు. బీజేపీ దళితులకు వ్యతిరేకం అని కొందరు తప్పుడు ప్రచారం చేయడాన్ని ఖండించారు. కేంద్ర ప్రభుత్వంలో 12 మంది కేబినెట్ మంత్రులు దళితులు ఉన్నారని..అది బీజేపీ, ప్రధాని మోడీ వళ్లనే సాధ్యమైందన్నారు. బీజేపీలో కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా పదవులు వస్తాయని వివేక్ వెంకటస్వామి చెప్పారు.


సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని..దళితులను అణగదొక్కేలా వ్యవహరిస్తున్నారని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. అధికారం కోసం మాయమాటలు చెప్పి కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించారు. దళితులకు మంచి అవకాశాలు ఇస్తే రాజకీయంగా ఎదుగుతారనే ముఖ్యమంత్రి మనసులో ఉందని..అందుకే ప్రభుత్వం అమలు చేసే పథకాలు దళితులకు కాకుండా ఇతరులకు ఉపయోగపడుతున్నాయన్నారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని మోసం చేసిన కేసీఆర్ కు వ్యతిరేకంగా.. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ నేతలు ధర్నాలు చేయడం లేదని ప్రశ్నించారు. పార్లమెంట్ కి  అంబేడ్కర్ పేరు పెట్టాలని మేము అడిగాక..ఇప్పుడు TRS నేతలు అనవసర ఆందోళన చేస్తున్నారన్నారు. నల్గొండ జిల్లా బీజేపీ పార్టీ ఆఫీసులో జిల్లా  SC మోర్చా మండల అధ్యక్షులతో భేటీ అయ్యారు.  మునుగోడు ఉప ఎన్నికలలో అనసరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చించారు.