కొండగట్టుకు సంజయ్ యాత్ర రేపే

కొండగట్టుకు సంజయ్ యాత్ర రేపే

కరీంనగర్, వెలుగు: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ పేరిట ఈనెల 14న నిర్వహించబోయే ‘మహా పాదయాత్ర’కు బీజేపీ నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. భాజాభజంత్రీలు, డప్పుచప్పుళ్లు, కళాకారులతో వేలాది మందితో యాత్ర సాగనుంది. బీజేపీ ప్రజాప్రతినిధులకు తోడు యాత్రలో పాల్గొనేందుకు బీజేపీ శ్రేణులు, హిందుత్వవాదులు, హనుమాన్ భక్తులు భారీగా తరలివచ్చేందుకు సిద్ధం కావడంతో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చేయాల్సిన ఏర్పాట్లపై బీజేపీ సీనియర్ నేత డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి భండారి శాంతికుమార్, మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఆయా జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపీ, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ కుమార్ గురువారం చర్చించారు. 

పాదయాత్ర ప్రారంభమయ్యేదిలా....

14న ఉదయం 7 గంటలకు కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం నుంచి ఈ మహా పాదయాత్ర ప్రారంభమవుతుంది. రేకుర్తి, కొత్తపల్లి, గంగాధర, పూడూరు, కొడిమ్యాల, మల్యాల మీదుగా కొండగట్టు అంజన్న ఆలయం వద్దకు చేరుకుంటారు. దాదాపు 40 కి.మీల మేరకు కాలి నడకన వెళ్లి కొండగట్టు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు.