హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ చేసి బీఆర్ఎస్ నేతలు దేశద్రోహానికి పాల్పడ్డారని బీజేపీ రాజ్యసబ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ట్యాపింగ్ బాధ్యులు ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై రాజభవన్లో గవర్నర్ రాధాకృష్ణన్ ను బీజేపీ నేతలు కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో తమ పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేసి బీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు.
ట్యాపింగ్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరారు. ప్రతిపక్ష నాయకులు, ప్రముఖులు, సినిమా వాళ్ల ఫోన్లను ట్యాప్ చేసి మాఫియా రాజ్యాన్ని నడిపారని ఆయన మండిపడ్డారు. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన ట్యాపింగ్‌పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీని వెనక ఉన్న దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.