బిలావల్ వ్యాఖ్యలను నిరసిస్తూ.. బీజేపీ నాయకుల ర్యాలీలు

 బిలావల్ వ్యాఖ్యలను నిరసిస్తూ.. బీజేపీ నాయకుల ర్యాలీలు

హైదరాబాద్​ : ప్రధాని నరేంద్ర మోడీపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా బషీర్ బాగ్ లోని బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న బీఆర్ అంబేడ్కర్‌ విగ్రహం వరకు బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ తో పాటు పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోకు, పాకిస్తాన్ కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోన్న పాక్‌ ‘ఉగ్రవాద కేంద్రం’గా మారిందంటూ భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ ఇటీవల న్యూయార్క్‌ లో జరిగిన ఐరాస భద్రతా మండలి సమావేశంలో ఆరోపించారు. దీనికి స్పందనగా బిలావల్‌ ‘గుజరాత్‌లో ఊచకోతకు కారకుడు (బుచర్‌ ఆఫ్‌ గుజరాత్‌)’గా మోడీపై ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే పాక్‌ తీరుపై నేడు దేశవ్యాప్తంగా నిరసనలు తెలపాలని పార్టీ శ్రేణులకు బీజేపీ పిలుపునిచ్చింది.