గజ్వేల్ పై బీజేపీ స్పెషల్ ఫోకస్.. ప్రత్యేక ఇన్​చార్జిల నియామకం

గజ్వేల్ పై బీజేపీ స్పెషల్ ఫోకస్.. ప్రత్యేక ఇన్​చార్జిల నియామకం

సిద్దిపేట, వెలుగు :  సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ లీడర్లు ఇప్పటి నుంచే పక్కాగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలనే దిశగా రాష్ట్ర పార్టీ పనిచేస్తుండగా గజ్వేల్​లో గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్​ ఉండటంతో ఈ నియోజకవర్గంలో విజయం సాధించడమే ధ్యేయంగా కమలనాథులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశాలను గజ్వేల్​లో నిర్వహించారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో బూత్, గ్రామ, మండల స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ప్లాన్ ​చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీని ఓడించినట్టుగా గజ్వేల్​లో కేసీఆర్ ను ఓడించి బీజేపీ సత్తా చాటాలని పక్కా ప్రణాళికతో పార్టీ నేతలు ముందుకు  కదులుతున్నారు. 

నాలుగు క్లస్టర్లుగా విభజన

గజ్వేల్​లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రయత్నాల్లో భాగంగా నియోజకవర్గాన్ని నాలుగు క్లస్టర్లుగా విభజించారు. గజ్వేల్ మున్సిపాల్టీ తో పాటు కొత్గగా ఏర్పడిన కుకునూరుపల్లి మండలంతో కలుపుకొని మొత్తం  తొమ్మిది  మండలాలు  దూరదూరంగా ఉండటంతో క్లస్టర్ల  ఏర్పాటుతో పార్టీ కార్యక్రమాల నిర్వహణ సులభంగా ఉంటుందనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు. 

మండలాల వారీగా ఇన్​చార్జిలు 

జిల్లాలోని ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఇక్కడ మండలాల వారీగా ఇన్​చార్జిల నియామకాన్ని పూర్తి చేశారు. ఇన్​చార్జిలు బూత్, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ముఖ్య కార్యకర్తలను క్రియాశీలకం చేస్తూ ప్రజా సమస్యలపై ఆందోళనలు, పార్టీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసే విధంగా దిశానిర్దేశం చేయనున్నారు. ఇందులో భాగంగా గజ్వేల్ టౌన్ కు గురువారెడ్డి, గజ్వేల్ మండలానికి  రాంరెడ్డి, జగదేవ్ పూర్ కు నందాల శ్రీనివాస్, మర్కూక్ కు పేర్ల శ్రీనివాస్, ములుగుకు నలగామ శ్రీనివాస్,  వర్గల్ కు నందన్ గౌడ్,  మనోహరాబాద్ కు రామ్మెహన్ గౌడ్, తుప్రాన్  టౌన్ కు సాయిబాబా,  తుప్రాన్ రూరల్ కు ఆంజనేయులు, కొండపాకతో పాటు కొత్తగా ఏర్పాటైన కుకునూరుపల్లి మండలాలకు రాములును ఇన్​చార్జిలుగా  నియమించారు.

త్వరలో బైక్ ర్యాలీలు

గజ్వేల్ నియోజకవర్గంలో ఈ నెల రెండో వారంలో భారీ బైక్ ర్యాలీల నిర్వహణకు  పార్టీ నేతలు రంగం సిద్ధం చేస్తున్నారు. క్లస్టర్ల వారీగా బైక్ ర్యాలీ నిర్వహిస్తూనే కార్యక్రమానికి  రాష్ట్ర స్థాయి లీడర్లు రోజుకు ఒకరు చొప్పున పాల్గొనేలా ప్లాన్​ చేస్తున్నారు. 

సీఎంను ఢీకొట్టేదెవరు? 

గజ్వేల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎవరు బరిలో నిలుస్తారనే విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే గజ్వేల్ నుంచి తాను పోటీ చేస్తానని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటించడమే కాకుండా నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులతో  టచ్ లో ఉన్నారు. అలాగే నియోజకవర్గానికి చెందిన లువురు గజ్వేల్ బరిలో నిల్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. కేసీఆర్ లాంటి బలమైన అభ్యర్థిని ఢీకొట్టాలంటే అంతే స్థాయి గల వ్యక్తి ఉంటేనే సాధ్యమనే దిశగా పార్టీ నేతలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 

కాషాయ జెండా ఎగరడం ఖాయం

గజ్వేల్​లో కాషాయ జెండా ఎగరడాన్ని ఎవరూ అడ్డుకోలేరు. నియోజకవర్గ ప్రజల నుంచి బీజేపీకి మంచి స్పందన లభిస్తోంది. సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా ప్రజలకు అందుబాటులో లేక పోవడంపై తీవ్ర అసంతృప్తి ఉన్నది. ఈ క్రమంలో ప్రజా సమస్యలపై పోరాటాలకు బీజేపీ సిద్ధమవుతోంది. 
- దూది శ్రీకాంత్ రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు