తెలంగాణ భవిష్యత్​కోసం మునుగోడు ఉప ఎన్నిక

తెలంగాణ భవిష్యత్​కోసం మునుగోడు ఉప ఎన్నిక
  • ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నరు: సంజయ్ 
  • కాంగ్రెస్ మునిగిపోయే నావ.. కమ్యూనిస్టులు ఎర్ర గులాబీలు
  • వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు సెమీ ఫైనల్
  • వెయ్యి కిలోమీటర్లు పూర్తయిన పాదయాత్ర  

 

జనగామ, వెలుగు: సీఎం కేసీఆర్ గ్రాఫ్ పడిపోయిందని, ప్రజలు ఆయనను నమ్మడం లేదని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. మనిషికి రూ.వెయ్యి ఇచ్చి తరలించినా వికారాబాద్ లో నిర్వహించిన సీఎం సభ ఫెయిల్ అయిందని, అడిగి మరీ చప్పట్లు కొట్టించుకునే దుస్థితికి కేసీఆర్ చేరుకున్నారని విమర్శించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ క్యాడర్ బీజేపీ వైపు చూస్తోందన్నారు. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో ఆ పార్టీల కార్యకర్తలు బీజేపీకే ఓటేశారని... రేపు మునుగోడులోనూ అదే జరుగుతుందన్నారు. బుధవారం జనగామ జిల్లా లింగాల ఘన్​పూర్ మండలం కిష్టగూడెం దగ్గర జరిగిన రాష్ట్ర పదాధికారులు, ముఖ్య నేతల సమావేశంలో, మీడియాతో సంజయ్ మాట్లాడారు. ‘‘కేసీఆర్​ పనైపోయింది. కాంగ్రెస్​మునిగిపోయే నావ. కమ్యూనిస్టులు ఎర్ర గులాబీలుగా మారిన్రు. ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నరు” అని ఆయన అన్నారు. ‘‘మునుగోడు ఉప ఎన్నిక రాజగోపాల్ కోసమో.. బీజేపీ కోసమో కాదు. తెలంగాణ భవిష్యత్​కోసం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ అయిన మునుగోడు బైపోల్​లో బీజేపీ గెలుపు ఖాయం” అని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 21న మునుగోడులో అమిత్ షా సభలో రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని చెప్పారు. ‘‘దుబ్బాకలో, హుజూరాబాద్​లో ఓటమితో కేసీఆర్ అహం కొంచెం తగ్గింది. ఇప్పుడు మునుగోడులోనూ ఓడిపోతే పూర్తిగా తగ్గుతడు. బీజేపీ ఓడిపోతే మళ్లీ కేసీఆర్ అహం నెత్తికెక్కుతది. తెలంగాణ ప్రజల బతుకులు బర్బాద్ అయితయి. రాజగోపాల్ మునుగోడు ప్రజల కోసం రాజీనామా చేశారు. ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలి” అని పిలుపునిచ్చారు. కార్యకర్తలు మునుగోడు సభను సీరియస్ గా తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవంతం చేయాలని సూచించారు. 

కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక్కటే..
కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక్కటేనని.. అందుకే కాంగ్రెస్​ను కేసీఆర్ ఒక్కమాట కూడా అనడం లేడని సంజయ్​అన్నారు. మునుగోడులో లోపాయికారీ ఒప్పందంతో ఆ పార్టీలు పోటీ చేస్తున్నాయని ఆరోపించారు. ఈ ఎన్నిక టీఆర్ఎస్, బీజేపీ మధ్యే జరగుతుందన్నారు. కమ్యూనిస్టులు చిల్లర పెంకులకు ఆశపడి టీఆర్ఎస్ కు అమ్ముడుపోయారని, వారు కేసీఆర్​ఫాలోవర్లుగా మారిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలే ఒకరితో ఒకరు బహిరంగంగానే కొట్లాడుకుంటున్నారన్నారు. పద్ధతిగా ఉండే మర్రి శశిధర్ రెడ్డి కూడా అధ్యక్షుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారంటే ఆ పార్టీలో పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. సమావేశంలో ఇంద్రసేనారెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, మనోహర్ రెడ్డి, దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. 

బీజేపీ సిద్ధాంతాలు గొప్పవి: రాజగోపాల్ 
బీజేపీ సిద్ధాంతాలు చాలా గొప్పవని, పార్టీలో చేరడం ఆనందంగా ఉందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కు అహంకారం తలకెక్కిందని.. మంత్రులను, ఎమ్మెల్యేలను కూడా కలవడం లేదని మండిపడ్డారు. ఈ నెల 21న జరిగే సభను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. మునుగోడు తీర్పు తెలంగాణ మార్పుకు నాంది కావాలన్నారు.

 కేసీఆరే తెలంగాణకు శత్రువు: విశ్వేశ్వర్ రెడ్డి 
తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆరే ప్రథమ శత్రువు అని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​ రెడ్డి అన్నారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని ప్రశ్నిస్తున్న కేసీఆర్.. ముందు ఆయనేం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీలో చేరేందుకు మునుగోడు లో సర్పంచ్ లు క్యూ కట్టారని చెప్పారు. మోడీ రుమాలు కట్టుకుంటే కేసీఆర్ ఎద్దేవా చేయడం తగదని.. కేసీఆర్​ పిట్టల దొరలా టోపీలు పెట్టుకుంటున్నారని విమర్శించారు.  

టీఆర్ఎస్​ను బొంద పెడ్తరు: జితేందర్​ రెడ్డి 
పాలమూరు జనం గోస చూసి తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన అని చెప్పుకునే కేసీఆర్..​ పాలమూరుకు అన్యాయం చేస్తున్నారని మాజీ ఎంపీ జితేందర్​రెడ్డి మండిపడ్డారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కుర్చీ వేసుకొని కట్టిస్తానన్న ఆయన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. పాలమూరు జనం టీఆర్ఎస్​ను బొంద పెడతారన్నారు. 

82 రోజుల్లో వెయ్యి కిలో మీటర్లు..  
సంజయ్ పాదయాత్ర బుధవారంతో వెయ్యి కిలోమీటర్లు పూర్తయింది. జనగామ జిల్లా అప్పిరెడ్డిపల్లి స్టేజీ దగ్గర ఈ మైలురాయిని చేరుకుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పైలాన్​ను సంజయ్ ఆవిష్కరించారు. వెయ్యి బెలూన్లు ఎగరేసి పటాకులు కాల్చారు. మొత్తం మూడు విడతల్లో ఇప్పటి వరకు 82 రోజుల్లో 34 నియోజకవర్గాల్లో ఈ వెయ్యి కిలోమీటర్ల మార్క్​పూర్తయింది. మొదటి విడతలో 36 రోజుల పాటు 438 కి.మీ, రెండో విడతలో 31 రోజుల పాటు 383 కి.మీ, మూడో విడతలో ఇప్పటి వరకు (15 రోజులు) 183 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది. కాగా, సంజయ్ పాదయాత్రను ఒకరోజు పొడిగించారు. ఈ నెల 27న ముగియనుంది. ఆ రోజు వరంగల్ లో ముగింపు సభ ఉంటుంది. చీఫ్ గెస్టుగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా లేదా ఉత్తరప్రదేశ్​సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

కేసీఆర్​ది అవినీతి పాలన: వివేక్ 
కేసీఆర్​ది అవినీతి పాలన అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ర్ట పదాధికారుల సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడు సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నట్లు చెప్పారు. సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతినిపై ప్రధాని మోడీ, అమిత్ షా ప్రత్యేకంగా దృష్టి పెట్టారన్నారు. కేసీఆర్ కుటుంబ, నియంతృత్వ పాలన పోవాలని జనం కోరుకుంటున్నారని అన్నారు. ‘‘మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వకుండా ఓట్లు అడగనన్న కేసీఆర్.. ఇప్పటికీ నీళ్లు ఇవ్వలేదు. కమీషన్ల కోసమే మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులు చేపట్టారు. కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్నారు. రూ.5 లక్షల కోట్ల అప్పులు చేశారు” అని మండిపడ్డారు. మునుగోడులో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.