జనహిత పాదయాత్ర మోసం కాదా? : బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్రావు

జనహిత పాదయాత్ర మోసం కాదా? : బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్రావు
  • ఆరు గ్యారంటీల అమలుపై శ్వేతపత్రం ఇవ్వండి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘జనహిత పాదయాత్ర’ వాస్తవంగా జనహితమా లేదా ప్రజలను మోసం చేయడమా అనేది ఆపార్టీ స్పష్టంగా చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు, యువత, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, రైతులు, మహిళలు వంటి వర్గాలకు డిక్లరేషన్ల పేరుతో అనేక హామీలు ఇచ్చిందని, కానీ వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. 

బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని, ఇది ఎలా జనహితమవుతుందని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, హామీలు, మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు, డిక్లరేషన్ల అమలుపై ఎంత మేరకు నెరవేరాయో శ్వేతపత్రాన్ని విడుదల చేయాన్నారు.

మాలెగావ్ తీర్పును స్వాగతించిన బీజేపీ..

2008 మాలెగావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ముంబయిలోని ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్వాగతించారు. అప్పట్లో దేశ భద్రతకు, మత సామరస్యానికి విఘాతం కలిగించేలా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందన్నారు. మాలెగావ్ కేసులో కోర్టు తీర్పుతో కాంగ్రెస్ పార్టీ కుట్ర విఫలమైందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్‌‌‌‌‌‌‌‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు.