ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

భైంసా, వెలుగు : పార్టీతో పాటు తనను నమ్ముకుని వెన్నంటే ఉంటున్న కార్యకర్తలకు అన్ని విధాలుగా  అండగా ఉంటానని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోస్లే మోహన్​రావు పటేల్​అన్నారు. ఆదివారం భైంసాలోని దారాబ్జీ ఫ్యాక్టరీలో ఆయన బర్త్​ డే సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి  అనూహ్య స్పందన లభించింది. ముథోల్​ సెగ్మెంట్​ నుంచి వచ్చిన సుమారు 300 మందికి పైగా కార్యకర్తలు, యువకులు రక్తదానం చేయగా.. వారిని మోహన్​రావు పటేల్​అభినందించారు. ఈ సందర్భంగా పటేల్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా  వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు. బీజేపీ లీడర్లు సుభాష్​ పటేల్, సాయినాథ్​పటేల్, కౌన్సిలర్​కపిల్​సింధే,   సాయినాథ్​, రవికుమార్ పాల్గొన్నారు.

ప్రధానిపై ఆరోపణలు చేస్తే సహించం:బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి
నిర్మల్​, వెలుగు : దేశాభివృద్ధికి పీఎం నరేంద్రమోడీ ఎంతో కృషి చేస్తున్నారని, అలాంటి వ్యక్తిపై  మంత్రి  అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి  అవాకులు చెవాకులు పేలడం సహించబోమని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి మండిపడ్డారు. శనివారం జిల్లా పార్టీ ఆఫీస్​లో మీడియా సమావేశం నిర్వహించారు. అంతకు ముందు మంత్రి  ఇంద్రకరణ్​రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  రోజూ18 గంటల పాటు పీఎం ప్రజాక్షేత్రంలో ఉంటున్నారని సీఎం రోజూ 3 గంటలు కూడా  ఉండడం లేదని ఎద్దేవా చేశారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా బీజేపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. మంత్రి వెంటనే తన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్​చేశారు.  బీజేపీ పెద్దపల్లి ఇన్​చార్జి రావుల రాంనాథ్​, జిల్లా ప్రధాన కార్యదర్శి  రాజు, డా. మల్లికార్జున్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

‘దళితబంధు’ పంపిణీలో ఎమ్మెల్యే వివక్ష
బెల్లంపల్లి, వెలుగు: ‘దళిత బంధు’ లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివక్షచూపుతున్నారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసర్ల యాదగిరి ఆరోపించారు. ఆదివారం  బెల్లంపల్లి  ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గానికి ‘దళిత బంధు’ 100 యూనిట్లు శాంక్షన్​కాగా ఎమ్మెల్యే చిన్నయ్య తన  సొంత మండలం.. నెన్నెలలోని కొత్తూరు గ్రామంలో 20 యూనిట్లు  మాదిగలకే ఇచ్చారని యాదగిరి ఆరోపించారు. అంతేకాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా 100 యూనిట్లలో 90 శాతం ఎమ్మెల్యే తన సామాజిక వర్గానికి ఇచ్చారని,  మాలలకు ఎమ్మెల్యే   ద్రోహం చేశారని వాపోయారు. ఇప్పటికైనా న్యాయం చేయాలని లేకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు గుర్రాల ప్రదీప్, జిల్లా ప్రధాన కార్యదర్శి సబ్బని రాజనర్సు, మహిళా విభాగం అధ్యక్షురాలు  దాసరి విజయ పాల్గొన్నారు.

పేదలకు అండగా బీజేపీ
ఖానాపూర్, వెలుగు: పేద ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందని  భరోసా ఇస్తూ కార్యకర్తలు పార్టీని బూత్​లెవ్​లో బలోపేతం చేయాలని బీజేపీ ఆదిలాబాద్​పార్లమెంట్ ఇన్ చార్జి డాక్టర్ మురళీ ధర్ గౌడ్ పిలుపునిచ్చారు.  ఆదివారం ఖానాపూర్ పట్టణంలోని జేకే గార్డెన్ లో ఖానాపూర్ అసెంబ్లీ ‘ప్రజా గోస– బీజేపీ భరోసా’ సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై  మాట్లాడారు.    టీఆర్ఎస్​ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను బీజేపీ కార్యకర్తలకు  ప్రజలకు వివరించాలని  
పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పి.రమాదేవి, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, పార్ల మెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య, బీజేపీ జిల్లా ఇన్ చార్జి మ్యాన మహేశ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బీజేపీలో పలువురు యువకుల చేరిక
ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్, బొక్కలగూడ, శాంతి నగర్ తదితర కాలనీల యువకులు ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ సమక్షంలో పార్టీలో చేరారు.  ఈ సందర్భంగా  శంకర్​మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతాలకు, ప్రధాని పాలనా విధానాలకు  ఆకర్షితులై రాష్ట్రంలో భారీ సంఖ్యలో యువత, ప్రజలు బీజేపీ లో చేరుతున్నారని తెలిపారు. జిల్లా నాయకులు  మయూర్ చంద్ర, దినేశ్​మటోలియ, విజయ్, రాందాస్, ముకుంద్ రావు తదితరులు పాల్గొన్నారు.
 బీజేపీ పట్టణ దళితమోర్చ అధ్యక్షుడిగా హనుమాన్ బీజేపీ పట్టణ దళిత మోర్చా  అధ్యక్షుడిగా ధీకొండా హనుమాన్ ను నియమించినట్లు  పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో   అలర్ట్​గా ఉండాలి: కలెక్టర్ భారతి హోళికేరి
మంచిర్యాల, వెలుగు: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా అధికార యంత్రాంగం అలర్ట్​గా ఉండాలని  కలెక్టర్ భారతి హోళికేరి ఒక ప్రకటనలో తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా సగటు సముద్రమట్టం నుంచి ఆవర్తనం మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయి వరకు విస్తరించి వాయుగుండంగా మారే ప్రమాదం ఉందని,  దీంతో 30  నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారని చెప్పారు.  రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, జిల్లాలో ఉన్న పొంగుతున్న వాగులు, నిండి ఉన్న చెరువు వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, నీటి ప్రవాహం ఉన్న వంతెనలు రోడ్ల వద్ద రాకపోకలు నిలిపి వేయాలని తెలిపారు. భారీ వర్షాలు, వరద పరిస్థితుల దృష్ట్యా ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఎమర్జెన్సీ సేవల కోసం 08736-250501, 250502  నంబర్లలో  సంప్రదించాలని తెలిపారు.

పట్టణంలో  భగత్​సింగ్​ విగ్రహాన్ని  పెట్టాలి: బీజేపీ రాష్ట్ర నాయకురాలు​సుహాసినీరెడ్డి
ఆదిలాబాద్​టౌన్​, వెలుగు:  ఆదిలాబాద్​ పట్టణంలో 15 రోజుల్లోగా భగత్​సింగ్​ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని జడ్పీ మాజీ చైర్​పర్సన్​ ,
బీజేపీ స్టేట్ ​లీడర్ ​చిట్యాల సుహాసినీరెడ్డి డిమాండ్​ చేశారు.  ఆదివారం ఆమె నివాసంలో మీడియాతో మాట్లాడారు. పట్టణ సుందరీకరణలో భాగంగా భగత్​సింగ్​విగ్రహాన్ని తొలగించి ‘ఐ లవ్​ ఆదిలాబాద్’​ సింబల్​ని ఏర్పాటు చేశారన్నారు. ఆందోళనలు చేస్తే నెల రోజుల్లోపు విగ్రహం ఏర్పాటు చేస్తామని మున్సిపల్​ చైర్మన్​జోగు ప్రేమేందర్​హామీ ఇచ్చారని, ఏడాది గడుస్తున్నా ఆ విషయం గురించి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విగ్రహం ఏర్పాటు చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  బీజేపీ లీడర్లు విజయ్​కుమార్​, క్రాంతి, సంతోష్​, కాంతారావు, మోహన్​ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. 

బుద్ధిజం మేనిఫెస్టో లాంటిది:బుద్దవనం ప్రాజెక్ట్  స్పెషల్ ​ఆఫీసర్​ మల్లేపల్లి లక్ష్మయ్య 
ఆసిఫాబాద్, వెలుగు : ‘బుద్ధిజం’ మేనిఫెస్టో లాంటిదని తెలంగాణ బుద్ధవనం ప్రాజెక్ట్ స్పెషల్​ఆఫీసర్​మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. ఆసిఫాబాద్ ను  బౌద్ధ దీక్ష మహా స్థలంగా అభివృద్ధి చేసేందుకు  కృషి చేస్తానని చెప్పారు.  ‘బుద్ధిస్ట్​ ఇంటర్నేషనల్​ నెట్ వర్క్  ఆఫ్​ తెలంగాణ’ రెండవ మహాసభ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని లుంబినీ దీక్ష భూమి ప్రాంగణంలో ఆదివారం జరిగింది. హాజరైన మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ దేవాలయంలో పుజారులకు నెలవారి జీతం ఇచ్చినట్లు.. బౌద్ధ భిక్షువులకు కూడా జీతం వచ్చేలా సీఎం కేసీఆర్​దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అంబేద్కర్​చూపిన దారిలో లక్ష మంది బౌద్ధులతో హైదరాబాద్ లో భారీ ప్రదర్శన చేయాలని, అప్పుడే ప్రభుత్వం మన వైపు చూస్తుందని లక్ష్మయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  నేషనల్ ఇన్ చార్జి  డాక్టర్ విలాస్ ఖారత్  బుద్ధిస్ట్​,  శంకర్ , భాగ్యవాన్, లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి వాస్తవ లాభాలను ప్రకటించాలి
మందమర్రి, వెలుగు: సింగరేణి కంపెనీ 2021-–22 ఆర్థిక సంవత్సరం ఆర్జించిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించాలని, అందులో కార్మికులకు 35శాతం వాటా ఇవ్వాలని సింగరేణి కోల్​మైన్స్​ కార్మిక సంఘ్ బీఎంఎస్​ప్రెసిడెంట్​యాదగిరి సత్తయ్య, వర్కింగ్​ ప్రెసిడెంట్ పేరం రమేశ్​ డిమాండ్ చేశారు. ఆదివారం మీడియాతో వారు మాట్లాడారు.  ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదు నెలల  గడుస్తున్నా వాస్తవ లాభాలను ప్రకటించడంలో  సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర సర్కార్​ జాప్యం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ విషయంలో వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.  లాభాలు, వాటా ప్రకటన చేయాలని డిమాండ్​ చేస్తూ సోమవారం సింగరేణి వ్యాప్తంగా బీఎంఎస్​ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.

మందమర్రిలో కాంగ్రెస్​ సంఘీభావ యాత్ర
మందమర్రి, వెలుగు: కాంగ్రెస్ నేత రాహుల్​గాంధీ చేపట్టిన భారత్​ జోడో యాత్రకు సంఘీభావంగా కాంగ్రెస్​ లీడర్లు మందమర్రిలో యాత్ర నిర్వహించారు. ఆదివారం స్థానిక పార్టీ ఆఫీస్​ నుంచి నేషనల్​ హైవే మీదుగా క్యాతన్​పల్లి మున్సిపాలిటీలోని అమ్మగార్డెన్​ వరకు 10 కి.మీ దూరం యాత్ర చేపట్టారు. కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్​ కొక్కిరాల సురేఖ, వైస్​ ప్రెసిడెంట్​ నూకల రమేశ్​, చెన్నూరు నియోజకవర్గ ఇన్​చార్జీ పిన్నింటి రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

నైజాం విముక్త స్వాతంత్ర్య  అమృతోత్సవ  కమిటీ ఎన్నిక
మంచిర్యాల, వెలుగు: నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాలను సెప్టెంబర్ 17 నుంచి ఏడాది పాటు నిర్వహించడానికి జిల్లా కమిటీని ఆదివారం లక్ష్మీనారాయణ మందిర్​లో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా మాధవరపు రవీందర్ రావు, అధ్యక్షుడిగా డాక్టర్ జె.సురేశ్​కుమార్, ప్రధాన కార్యదర్శిగా కొమ్మెర విశ్వేశ్వరశర్మ, ఉపాధ్యక్షుడిగా చక్రవర్తుల పురుషోత్తమచారి, రేణికుంట్ల శ్రీనివాస్ తదితరులను ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడు మాధవరపు రవీందర్ రావు మాట్లాడుతూ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 

మందలో పిడుగుపడి 152 మేకలు, గొర్రెలు మృతి, 20 లక్షల వరకు ఆస్తి నష్టం
తిర్యాణి, వెలుగు :  కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా..తిర్యాణి మండల పరిధిలో పిడుగు  పడి 152 గొర్రెలు, మేకలు చనిపోయాయి.  వివరాల్లోకి వెళితే ఏదుల పాడ్ గ్రామశివారులో గంభీరావుపేట గ్రామానికి చెందిన కాపరులు మంద పెట్టారు. శనివారం అర్ధరాత్రి భారీగా కురిసిన వర్షానికి మందపై పిడుగు పడింది.  ఆవుల భూమయ్యకు చెందిన 9 గొర్రెలు, పబ్బల మల్లేశ్ వి 25, పబ్బల ఐలయ్యవి 26, పబ్బల సుజాతవి 25, పబ్బల బుచ్చయ్యవి 20 గొర్రెలు, జాడ ఐలయ్యవి 13, జాడ పోచ మల్లువి 10, మొత్తం 152 గొర్రెలు, మేకలు చనిపోయాయి.  రూ. 20 లక్షలకు పైగా  నష్టం  జరిగిందని తెలిపారు. తమను   ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వెటర్నరీ  డాక్టర్ రామకృష్ణ, ఆర్ఐ మోహన్  ఘటనాస్థలానికి చేరి పంచనామ చేశారు. జడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, సర్పంచ్​లు వరలక్ష్మి,  గోపాల్ ఉన్నారు. 


బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
ఆసిఫాబాద్, వెలుగు : రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్  ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో కొత్తగా కట్టిన బీజేపీ ఆఫీస్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  జిల్లాలో బీజేపీ కి రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందన్నారు.  రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కృష్ణ కుమారి, రాష్ట్ర మహిళా మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని , జిల్లా ప్రధాన కార్యదర్శులు కొట్నక్​విజయ్ కుమార్, అన్నపూర్ణ  తదితరులు పాల్గొన్నారు. 

పెన్షన్ బంద్ చేశారని నేత కార్మికుడి ఆత్మహత్య
దండేపల్లి, వెలుగు:  మండలంలోని  నర్సాపూర్​గ్రామంలో చేనేత కార్మిక పింఛన్​ నిలిపి వేయడంతో మనస్తాపానికి గురై ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం..  గ్రామానికి చెందిన చిలుకమారి శంకరయ్య(60)   చేనేత కార్మిక పింఛన్​దారుడు. ఇటీవల మండలంలోని ముత్యంపేట, కొర్వీచెలమ గ్రామాలలో అనర్హులు వృద్ధాప్య,చేనేత పెన్షన్ పొందుతున్నారని అక్కడి వారు కలెక్టర్ కు కంప్లైంట్​ చేశారు. దీంతో కలెక్టర్ విచారణ కు ఆదేశించింది. ఆఫీసర్లు మండలంలో  విచారణ చేపట్టకుండా 40 మంది  పింఛన్లు  నిలిపివేశారు. 6 నెలలుగా పింఛన్​రాకపోవడంతో ఇక పింఛన్​ రాదేమోనని మనస్తాపంతో ఆదివారం తెల్లవారుజామున ఇంటి దగ్గరలోని మామిడితోటలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. కాగా మృతుడి కుమారుడు  అనారోగ్యంతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు కంప్లైంట్​చేయడం గమనార్హం.