ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు ఇబ్బందులు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు ఇబ్బందులు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
  •     నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో తడిసిన వడ్లు, పంటల పరిశీలన

చివ్వెంల/చిట్యాల, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు విమర్శించారు. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నల్గొండ జిల్లా చిట్యాల, సూర్యాపేట జిల్లా చివ్వెంలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేయకపోవడం వల్లే వర్షానికి వడ్లు తడిసిపోయాయన్నారు. 

పంట నష్టం వివరాలు, కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలను తెలుసుకునేందుకు బీజేపీ ఆధ్వర్యంలో మూడు టీమ్స్‌ను వివిధ జిల్లాలకు పంపామన్నారు. ప్రభుత్వం, కాంగ్రెస్‌ నాయకులు మిల్లర్లతో కుమ్మక్కై కొనుగోళ్లను ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. మొలకెత్తిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనాలని, లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెత్త ఎత్తున పోరాటం చేస్తామని చెప్పారు. చివ్వెంలలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతారెడ్డి, మండల అధ్యక్షుడు మాధవరపు అనిల్, ధరావత్‌ శ్రీనివాస్‌నాయక్‌, జంపాల వెంకటేశ్వర్లు, మంగ్దానాయక్‌, చిట్యాలలో కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ నాయకులు గంగిడి మనోహర్‌రెడ్డి, నాగం వర్షిత్‌రెడ్డి, నకరికంటి మొగులయ్య పాల్గొన్నారు.

రూ. 10 వేల పరిహారం రైతుకు అవమానం

ఖమ్మం టౌన్, వెలుగు : వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రూ. 10 వేలు ఏమాత్రం సరిపోవని, ఇది రైతులను అవమానించడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మండిపడ్డారు. ఖమ్మం నగరంలోని మున్నేరు పరివాహక ప్రాంతాల్లో వరద బాధితులను శుక్రవారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... వర్షాలతో ఇండ్లు, పంటలన్నీ కొట్టుకుపోయినా ప్రభుత్వం మాత్రం కంటి తుడుపు చర్యలతోనే కాలం గడుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆయన వెంట కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్ రెడ్డి, నాయకులు వాసుదేవరావు, నెల్లూరి కోటేశ్వరరావు, సన్నీ ఉదయ్ ప్రతాప్ పాల్గొన్నారు.