- మహిళా బిల్లుకు అందరూ మద్దతివ్వాలి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
ఖానాపూర్, వెలుగు : తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు స్పష్టం చేశారు. ఖానాపూర్ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడంతో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాంచందర్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామన్నారు.
ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశ పెట్టబోతోందని, ఈ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. మహిళలు పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి రావడం వల్ల పాలనలో పారదర్శకత పెరుగుతుందన్నారు. లోక్ సభ సీట్ల పెంపుతో దక్షిణాదితో పాటు దేశంలోని చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా కేంద్రం చూస్తుందన్న రేవంత్‌రెడ్డి ఆరోపణల్లో నిజం లేదన్నారు.
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందన్నారు. పట్టణంలోని కుమ్రంభీం చౌరస్తా నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్తగా ఎన్నికైన చైర్‌పర్సన్, బీజేపీ కౌన్సిలర్లను సన్మానించారు.
ఆదిలాబాద్ ఎంపీ జి.నగేశ్, బీజేపీ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, పాయల్ శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఆకుల శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ అంకం మహేందర్, మండల అధ్యక్షుడు ఉపేందర్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు మంత్ర రాజం సురేశ్ పాల్గొన్నారు. అనంతరం ఖానాపూర్ పట్టణ అధ్యక్షుడు కీర్తి మనోజ్‌ను రాష్ట్ర అధ్యక్షుడు రాం చందర్‌రావు, ఎంపీ నగేశ్‌లు పరామర్శించారు.

